Elections: ఏపీలో ఓటేసేందుకు బయలుదేరిన నగరవాసులు

Passenger Rush At Bus Stand & Railway Stations In Hyderabad
x

Elections: ఓటేసేందుకు బయల్దేరిన నగరవాసులు.. బస్సులు, రైళ్లు కిటకిట

Highlights

Elections: విమానాలు, రైళ్ళు, బస్సుల్లో ముందుగానే టికెట్ బుకింగ్‌

Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ ..గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో మాత్రం తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ గెలిచిన మొత్తం సీట్లులో 17 సీట్లు గ్రేటర్ పరిదిలోనివే ...దీంతో ఈసారి లోక్ సభ ఎన్నికల్లోనే గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిదిలో సికింద్రాబాద్ , మల్కాజ్ గిరి, చేవెళ్ళ, హైదరాబాద్ ఉన్నా...హైదరాబాద్ మినహా మిగతా మూడింటిపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నది. అయితే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు రావడంతో బీఆర్‌ఎస్‌ నేతలకు కొత్త సమస్య వచ్చి పడింది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ఒకే రోజు పోలింగ్‌ జరగడమే బీఆర్‌ఎస్ నేతల సమస్యకు అసలు కారణం. గత డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు ఏపీలో ఎటువంటి ఎన్నికలు లేనందున గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు హైదరాబాద్‌లోనే ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో అధిక శాతం బీఆర్ఎస్‌కు ఓటు వేసినట్లు అంచనా.. అందుకే గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు ఆధిక్యం వచ్చిందన్న విశ్లేషణ కూడా ఉంది.

ఏపీ, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఈనెల 13న జరగనున్నది. దీంతో ఏపీ నుంచి వచ్చిన చాలా మంది ఓటర్లు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరిలో దాదాపు అందరికీ రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కావడంతో రాజకీయ నాయకులు ఓటర్లను తరలించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తు్నారు. ఆంధ్రా ఓటర్లు కూడా సొంతూరిలో ఓటు వేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ ఓటర్లు స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో ఈసారి గ్రేటర్‌ హైదరాబాద్‌లో పోలింగ్‌ పర్సెంటేజ్‌ తగ్గే అవకాశం ఉంది.. ఇదే ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలను పట్టిపీడిస్తోంది.

హైదరాబాద్‌నుంచి ఓటర్లు ఆంధ్రప్రదేశ్‌కు పయనం కావడంతో ఏపీకి వెళ్ళే రైళ్ళు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. మే 13న జరిగే పోలింగ్‌ కోసం ఏపీ ఓటర్లు ముందుగానే రైళ్ళు, బస్సులు, విమానాల్లో టికెట్లు బుక్‌ చేసుకున్నారు. వలస ఓటర్లు వెళ్ళిపోవడంతో సికింద్రాబాద్‌, చేవెళ్ళ, మల్కాజిగరి లోక్‌సభ నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన చేదు అనుభవంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ, ఈ నాలుగు నెలల్లో గ్రేటర్ పరిధిలో పార్టీని బలోపేతం చేయడంలో తలమునకలయ్యింది.. ఈ మూడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంత మేర పట్టు సాధించింది.

రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల నుంచి 30 లక్షల మంది ఏపీ ఓటర్లు ఉన్నారు. వీరిలో 80 శాతానికి పైగా ఓటర్లు ఏపీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్టు అంచనా. దీంతో గ్రేటర్ పరిధిలోని 4 లోక్ సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ పర్సంటేజీ తగ్గనుంది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్ నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఏపీ ఓటర్లు ఉన్నారు. అలాగే నిజామాబాద్, మెదక్ స్థానాల్లోనూ చెప్పుకోదగిన స్థాయిలో ఏపీ ఓటర్లు ఉన్నారు. సాధారణంగానే జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. అలాంటిది ఇప్పుడు ఏపీ ఓటర్లు వెళ్లిపోతే, అది మరింత పడిపోయే ప్రమాదముంది. గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, ప్రగతినగర్, కేపీహెచ్ బీ, బీహెచ్ఈఎల్, అశోక్ నగర్, నిజాంపేట, కుత్బుల్లాపూర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, సరూర్ నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, సనత్ నగర్‌తోపాటు నగర శివారు ప్రాంతాల్లో ఏపీ ఓటర్లు ఎక్కువ మంది నివసిస్తున్నారు.. విద్యాసంస్థలకు సెలవులు రావడంతో ఇప్పటికే 40 శాతం మంది ఏపీలోని వివిధ జిల్లాలకు వెళ్లిపోయారు. ఇంకా వారాంతం కావడంతో వరుసగా మూడురోజులు సెలవులు వచ్చాయి. దీంతో పలువురు ఉద్యోగులు కూడా ఇంటి బాట పట్టారు.

అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 46.68 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఏపీ వాసులు ఎక్కువగా నివసించే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓటింగ్ శాతం 60లోపే ఉంది. పైగా ఈసారి పోలింగ్ సోమవారం జరుగుతున్నది. రెండో శనివారం, ఆదివారం తర్వాత పోలింగ్ డే సోమవారం ఉంది. ప్రభుత్వ, ఐటీ, బ్యాంకు ఉద్యోగులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీకి వెళ్లే ఆంధ్రా ఓటర్ల పర్సంటేజీ ఎక్కవ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఓల్ట్ సిటీ మినహా మిగతా అన్ని సెగ్మెంట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రా వాసులు ప్రధానంగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్టు స్పష్టమైంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రస్తుత లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారాయి.

దీంతో ఏపీ ఓటర్లు ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటే, ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక దానివైపు మొగ్గుచూపేవారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.. మరోవైపు ఏపీ ఓటర్లు ఈసారి కూడా తమకే మద్దతు ఇచ్చేవారని.. వారు ఏపీకి వెళ్లడం వల్ల తమకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ నేతల అభిప్రాయం. మొత్తానికి రెండు జాతీయ పార్టీల నడుమ బీఆర్ఎస్ పరిస్థితి ఇబ్బంది కరంగా మారింది. బీజేపీ ఎప్పటిలాగే మోడీ ఛరిష్మా, ఓటు బ్యాంకుపై, మజ్లీస్‌ పాతబస్తీ ఓటు బ్యాంకుపై పూర్తి నమ్మకంతో ఉన్నాయి. ఏపీ శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్‌, బీజేపీలకు కలిసి వస్తుంటే, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం నిరాశనే మిగిలిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories