టీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేకు మరో ఎమ్మెల్సీతో వచ్చిన దిగులేంటి?

టీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేకు మరో ఎమ్మెల్సీతో వచ్చిన దిగులేంటి?
x
Highlights

అసలే మంత్రి పదవి రాలేదని నిరాశలో ఉన్న ఆ మహిళా ఎమ్మెల్యేకు, మరో ఎమ్మెల్సీ రూపంలో ఇంటి పోరు మొదలైందట. ఎలాగైనా మహిళా కోటాలో తమ నాయకురాలికి మంత్రి పదవి...

అసలే మంత్రి పదవి రాలేదని నిరాశలో ఉన్న ఆ మహిళా ఎమ్మెల్యేకు, మరో ఎమ్మెల్సీ రూపంలో ఇంటి పోరు మొదలైందట. ఎలాగైనా మహిళా కోటాలో తమ నాయకురాలికి మంత్రి పదవి దక్కుతుందని ఆశగా ఎదురుచూసిన ఆమె అనుచరగణం, మొదటి విడతలో మంత్రి పదవి రాకపోగా సదరు ఎమ్మెల్సీ రూపంలో ఇంటి పోరు మొదలవ్వటం ఆ అనుచరగనానికి, ఆ మహిళా ఎమ్మెల్యేకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట. ఇప్పటికే సెగ్మెంట్‌ మొత్తంలో దూకుడు ప్రదర్శిస్తున్న ఆ ఎమ్మెల్సీ, రెండో విడత విస్తరణలోనూ మినిస్ట్రీకి అడ్డుపడతాడేమోనని, ఆ మహిళా ఎమ్మెల్యే టెన్షన్‌ పడుతున్నారట ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ? అంతగా భయపెడుతున్న ఆ ఎమ్మెల్సీ ఎవరు?

టీఆర్ఎస్ నుంచి మొదట జడ్పీటిసిగా గెలిచి, ఆపై ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా అంచెలంచెలుగా ఎదిగిన మహిళా నేత పద్మా దేవేందర్ రెడ్డి. తన వాక్పటిమ, చొరవ, దూసుకుపోయే తత్వంతో అటు తెలంగాణ ఉద్యమంలో, ఇటు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. టీఆర్ఎస్‌లో ఇప్పుడున్న మహిళా ఎమ్మెల్యేల్లో ఆమె సీనియర్. ఉమ్మడి మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్, హరీష్ రావులు ఉన్నప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పద్మాదేవేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభకు డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన పద్మకు, ఈసారి మంత్రి పదవి ఖాయమని అందరూ అనుకున్నారు. మొన్నటి ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ సైతం పద్మా దేవేందర్ రెడ్డికి ఇప్పుడున్న పదవి కంటే పెద్ద పదవి ఇస్తానని ప్రకటించారు. కానీ మారిన పరిణామాలు, రాజకీయ సమీకరణల నేపథ్యంలో, పద్మా దేవేందర్ రెడ్డికి మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దొరకలేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో భవిష్యత్ మంత్రివర్గ విస్తరణలో సైతం పదవి లభిస్తుందన్న నమ్మకం సైతం లేదట. ఇందుకు కారణం సొంత పార్టీలోని ఎమ్మెల్సీనట.

అసలే మంత్రి పదవి రాలేదనే నిరాశలో ఉంటే, కొత్తగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి రూపంలో ఇంటి పోరు ప్రారంభమైందని నియోజకవర్గ రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారట. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మెదక్ నియోజకవర్గానికి చెందినవాడే. ఆయన స్వగ్రామం హవేలి ఘన్‌పూర్ మండలం కూచన్‌పల్లి. ముఖ్యమంత్రికి, ఆయన కుటుంబానికి సన్నిహితంగా ఉండే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీగా ఎన్నికవడం దానికి తోడు ఆయన ప్రోటోకాల్ పరంగా మెదక్ జిల్లానే ఎంచుకోవడంతో పద్మా దేవేందర్ రెడ్డి అనుచరుల్లో అభద్రతా భావం పెరిగిందట.

మొన్న జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి స్వంత మండలం హావేలి ఘన్పూర్ ఎంపీపీగా, తన అన్న శేరి నారాయన్ రెడ్డిని ప్రతిపాదిస్తే, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మరో నేత మానిక్‌రెడ్డిని తెరపైకి తెచ్చారట. చివరకు అధిష్టానం సుభాష్ రెడ్డి వైపు మొగ్గు చూపడంతో అతని అన్నశేరి నారాయణ్ రెడ్డిని హావేలి ఘన్‌పూర్ ఎంపిపి అయ్యారు. ఈ పరిణామం పద్మా దేవేందర్ రెడ్డి వర్గీయులకు మింగుడు పడటం లేదట.

మెదక్ నియోజకవర్గంలో ఎదురు లేదనకున్న తమకు, ఎమ్మెల్సీ రూపంలో ఇంటిపోరు మొదలైందని కంటి మీద కునుకు పడటం లేదట పద్మాదేవేందర్‌ రెడ్డి వర్గానికి. ఒక ఎమ్మెల్సీగా మెదక్ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన శేరి సుభాష్ రెడ్డి, నియోజకవర్గ అభివృద్ధిపై అదే హోదాలో త్వరలో అధికారులతో సమీక్షా సమావేశాలు సైతం నిర్వహించనున్నారట. ఈ పరిణామాలు ఎటు పోయి ఎటు దారితీస్తాయోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయట. ఇప్పటికే తనకు అన్నివిధాలుగా అడ్డుపడుతున్న సుభాష్‌ రెడ్డి, భవిష్యత్‌లో చేపట్టే మంత్రివర్గ విస్తరణలోనూ ఛాన్స్‌ తన్నుకుపోతాడేమోనని ఆందోళనపడుతున్నారట పద్మాదేవేందర్ రెడ్డి అనుచరులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories