ఇందూరులో ఆ పీఠం హాటు కేకులా మారింది.. సీఎం ఆశీస్సులు ఎవరికో తెలియక తికమక !

ఇందూరులో ఆ పీఠం హాటు కేకులా మారింది.. సీఎం ఆశీస్సులు ఎవరికో తెలియక తికమక !
x
Highlights

ఇందూరులో ఆ పీఠం హాటు కేకులా మారింది. ఆ సింహాసనం అధికార పార్టీ ఖాతాలో పడ్డా ఛైర్మన్ గిరి కోసం ఎమ్మెల్యేల మధ్య పోటీ రసవత్తరమైంది. ఆ పదవిని తన కుటుంబ...

ఇందూరులో ఆ పీఠం హాటు కేకులా మారింది. ఆ సింహాసనం అధికార పార్టీ ఖాతాలో పడ్డా ఛైర్మన్ గిరి కోసం ఎమ్మెల్యేల మధ్య పోటీ రసవత్తరమైంది. ఆ పదవిని తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలంటే కాదు కాదు తన ఫ్యామిలీ మెంబర్స్‌కే కావాలంటూ నేతలు పట్టుబడుతున్నారట. ఐతే డీసీసీబీ లేదంటే డీసీఎంఎస్ ఛైర్మన్ పీఠం, తమ బంధువులకు ఇప్పించుకునేందుకు, నువ్వానేనా అంటూ పోటీపడుతున్నారట. అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారట. ఇంతకీ పోటీలో ఉన్న ఆ నేతల బంధుగణం ఎవరు..? ఏ రేంజ్‌లో రేసు సాగుతోందో తెలుసా?

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ పీఠం పై అధికార పార్టీ గురిపెట్టింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉండే కీలకమైన ఈ పదవిని దక్కించుకునేందుకు తమ బంధువులకు దక్కేలా ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఈ మేరకు ఛైర్మన్ రేసులో ఉన్న ముఖ్య నేతల బంధుగణం డైరెక్టర్లుగా నామినేషన్లు వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీసీసీబీ పదవి దక్కాలంటే ఏదైనా సహకార సంఘం డైరెక్టర్ గా ఎన్నికై, సొసైటీ ఛైర్మన్ పదవి పొందాల్సి ఉంటుంది. దీంతో డీసీసీబీ ఛైర్మన్ రేసులో ఉన్న ద్వితీయశ్రేణి నేతలంతా తమ సహకార సంఘాన్ని ఏకగ్రీవం చేసేశారట. ప్రతిపక్ష పార్టీలు సహకార ఎన్నికల్లో చేతులెత్తేయడంతో డీసీసీబీతో పాటు డీసీఎంఎస్ స్ధానాలు గులాబీ పార్టీ కైవసం చేసుకోనుంది. ఇంత వరకు బాగానే ఉన్నా అధికార పార్టీకి డీసీసీబీ ఛైర్మన్ ఎన్నిక అసలు సమస్యగా మారనుందట. ఛైర్మన్ రేసులో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి గుప్తా ఉన్నారట. మంత్రి ప్రశాంత్ రెడ్డి తన బంధువు రమేష్ రెడ్డి కోసం మంత్రాంగం నడిపిస్తున్నారట. మరోవైపు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన అమర్ నాథ్ బాబు సైతం తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారట.

కామారెడ్డి జిల్లా బాన్సువాడకు నియోజకవర్గానికి చెందిన స్పీకర్ పోచారం తనయుడు భాస్కర్ రెడ్డి ఈ పాటికే దేశాయిపేట సహకారం సంఘం డైరెక్టర్ గా ఏకగ్రీవం అయ్యారట. మిగతా డైరెక్టర్ స్ధానాలను సైతం ఏకగ్రీవం చేయించి పీఏసీఎస్ ఛైర్మన్ గా రెండోసారి పీఠం ఎక్కనున్నారు. గతంలో డీసీసీబీ ఛైర్మన్ గా పోటీ పడ్డా అనివార్య కారణాలతో మరో నేత ఈ పదవి దక్కించుకున్నారు. ఈసారి పకడ్బందీ వ్యూహాంతో డీసీసీబీ ఛైర్మన్ కానీ, ఆప్కాబ్ డైరెక్టర్ పదవి కానీ దక్కించుకోవాలని స్కెచ్ వేస్తున్నారట. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా తన తండ్రిని జడ్పీ ఛైర్మన్ చేయాలని చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారట. సమీకరణాలు కలసిరాక ఆయన తన తండ్రిని డీసీసీబీ ఛైర్మన్ రేసుకు నిలబెట్టారట. ఈ మేరకు మాక్లూర్‌ సొసైటీ డైరెక్టర్‌ స్థానాలను మొత్తం ఏకగ్రీవం చేయించారట. కేటీఆర్ ను కలిసి తన మసన్సులో మాట చెప్పేందుకు ఎమ్మెల్యే గణేష్ గుప్తా రెడీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి సైతం తన బంధువు కుంట రమేష్ రెడ్డికి డీసీసీబీ పీఠం దక్కేలా చూస్తాననే హామి ఇచ్చారట. వేల్పూర్ సొసైటీ ఛైర్మన్‌గా రమేష్ రెడ్డిని ఏకగ్రీవం చేసి, మంత్రి తన స్టైల్ లో చక్రం తిప్పుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పెంటఖుర్దు సొసైటీ ఏకగ్రీవం చేసిన సీనియర్ నేత అమర్ నాథ్ బాబు సీఎం కేసీఆర్ ఆశీస్సులతో డీసీసీబీ ఛైర్మన్ పీఠం కోసం తనవంతు ప్రయత్నాలు మొదలెట్టేశారట. మాజీ మంత్రి మండవ సహకారంతో అమర్ నాథ్ బాబు ఈ పీఠం కోసం పోటీపడుతున్నారనే ప్రచారం ఉంది.

ఐతే డీసీసీబీ ఛైర్మన్ లేదా డీసీఎంఎస్ పీఠం రెండింటిలో ఏదో ఒకటి కావాలని తమ వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారట నేతల బంధువులు. ఐతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయన్నది అంతు చిక్కడం లేదట. ప్రస్తుతానికి ఈ పేర్లు వినిపిస్తున్నప్పటికీ, చివరి నిమిషం వరకు ఇవేవీ కాకుండా కొత్త ముఖాలు తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని గులాబీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. ఎవరి పంతం నెగ్గుతుందో ఎవరి బంధుగణానికి పదవి దక్కుతుందో తెలియాలంటే మరికొద్ది రోజుల వేచిచూడాల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories