logo

కవితకు అతిత్వరలో కొత్త బాధ్యతలు?

కవితకు అతిత్వరలో కొత్త బాధ్యతలు?
Highlights

తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు ఊపందుకుంటున్న చర్చ, మాజీ ఎంపీ కవిత భవిష్యత్తు ఏంటీ ఏం చేయబోతున్నారు అధినేత...

తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు ఊపందుకుంటున్న చర్చ, మాజీ ఎంపీ కవిత భవిష్యత్తు ఏంటీ ఏం చేయబోతున్నారు అధినేత మనసులో ఏముంది వినోద్ కుమార్‌కు పదవిచ్చిన కేసీఆర్, కవితకు ఏ పదవి కట్టబెట్టబోతున్నారు కొద్ది కాలంగా సైలెంట్‌గా ఉన్న కవిత, మళ్లీ క్రియాశీలకంగా మారి ప్రజాజీవితంలోకి ఎప్పుడు వస్తారు సగటు కవిత అభిమాని మదిని తొలిచేస్తున్న ప్రశ్నలివే. అయితే అతి త్వరలో కవిత అభిమానులు గుడ్‌ న్యూస్‌ వినబోతున్నారట కొత్త బాధ్యతలతో మళ్లీ క్రియాశీలకం కాబోతున్నారట కవిత.

తెలంగాణలో తిరుగులేని పార్టీగా ఇప్పటికీ టీఆర్ఎస్‌ దూకుడుతో వుంది. టీడీపీ, కాంగ్రెస్‌లను ఖాళీ చేస్తూ మరింత బలిష్టంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కొల్లగొట్టి, తనకు ఎదురేలేదన్నట్టుగా నిలబడింది. బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుని, ఈమధ్య బలంగా మారుతున్న ఛాయలు కనిపిస్తున్నా, ఇప్పటికీ పటిష్టంగా ఉన్న పార్టీ టీఆర్ఎస్సే. అయితే ఇలాంటి సమయంలో నిజామాబాద్ నుంచి ఎవరూ ఊహించని విధంగా కవిత ఓడిపోయారు.

అంచనాలను తలకిందులు చేస్తూ, ఆమె పరాజయం పొందడాన్ని, ఇప్పటికీ టీఆర్ఎస్‌ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమి నాటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారామె. కుటుంబ సభ్యులతోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. అయితే జాతీయ స్థాయిలో మెరుపులా మెరిసి, ఇప్పుడామె సైలెంట్‌గా ఉండటం, ఆమె అభిమానులకు పాలుపోవడం లేదు. అయితే అలా నిరాశపడిన కవిత అభిమానులకు, అతి త్వరలో గుడ్‌ న్యూస్‌ రాబోతోందంటూ, తెలంగాణ భవన్‌లో చర్చ జరుగుతోంది.

తెలంగాణ సాంస్త్రృతిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కల్వకుంట్ల కవిత. ఒకవైపు కేసీఆర్‌ రాజకీయంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంటే, మరోవైపు తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ సారథిగా బతుకమ్మలతో మూవ్‌మెంట్‌లో మహిళలను సైతం ఏకం చేశారు కవిత. తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న ధాటియైన ప్రసంగాలతో ఉద్యమ అలజడిలో భాగమయ్యారామె. అయితే ఒక్క ఓటమి ఆమె రాజకీయ జీవితాన్ని తలకిందలు చేసినట్టయ్యింది. తన స్వభావానికి విరుద్దంగా కొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు కవిత. అయితే ఆమె గురించి తెలిసిన నేతలెవ్వరూ అంత ఈజీగా ఊరుకునే రకం కాదు కవిత అని అంటున్నారు. కాలం కలిసి రానప్పుడు కాస్త వెనక్కి తగ్గాలి ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడాలనే తత్వంలో కవిత ఉన్నారన్నది తెలిసిన వారు చెబుతుంటారు. అందుకే అతి త్వరలో కొత్త పాత్రకు సిద్దమవుతున్నారన్న చర్చ సాగుతోంది. ఇంతకీ ఏంటా కొత్త పాత్ర....?

రాజకీయాల్లో గెలుపోటములు సహజం అయితే కవిత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయురాలు కావడమే ఆ ఓటమి విస్తృతంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కరీనంగర్ నుంచి ఓడిన బోయినపల్లి వినోద్ కుమార్‌కు, రాష్ట్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు టీఆర్ఎస్ అధినేత. గతంలో కంటే ఆ పదవీకాలాన్ని కూడా పొడిగించారు. ఇప్పుడు కవితకు కూడా రాజకీయంగా ఓ పదవిని కట్టబెడుతారనే చర్చ మాత్రం పోలిటికల్ సర్కిల్లో బాగా ప్రచారం జరుగుతోంది. అవసరమైతే పార్టీకీ, ప్రభుత్వానికి కో-ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ సాగుతోంది. లేకుంటే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి రాష్ట్ర్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశమూ లేకపోలేదని అంటున్నారు.

అంతేకాదు, రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఛైర్మన్‌గా కూడా కవితను నియమించే అవకాశముందని తెలుస్తోంది. గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఎమ్మెల్సీ కావడంతో, రైతు సమన్వయ సమితికి రాజీనామా చేశారు. దీంతో కేబినెట్‌ ర్యాంకుతో కూడిన ఈ పదవిని, కవితకు ఇస్తే బాగుంటుందన్న చర్చ కూడా, తెలంగాణ భవన్‌లో జరుగుతోంది. నిజామాబాద్‌లో కవిత ఓడిపోవడానికి రైతుల ఆందోళన కూడా ఒక కారణమన్న చర్చ వుంది. దీంతో రైతులతో మరింత మమేకం అయ్యేందుకు, ఈ పదవి ఉపకరిస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

మొత్తానికి కవిత భవిష్యత్తుపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈమధ్యనే ఫ్యామిలీతో కలిసి చైనా వెళ్లి వచ్చిన కవిత, అతి త్వరలోనే మళ్లీ పూర్తిగా యాక్టివ్ అవుతారని అంటున్నారు టీఆర్ఎస్‌ నేతలు. అయితే మళ్లీ కవిత సీరియస్ రాజకీయాల్లో ఏ విధంగా ఏ పదవితో వస్తారనేది మాత్రం మరికొంత కాలం వేచి చూడాల్సిందే.లైవ్ టీవి


Share it
Top