మళ్లీ తెరపైకి డబుల్ డెక్కర్ బస్సుల అంశం

మళ్లీ తెరపైకి డబుల్ డెక్కర్ బస్సుల అంశం
x
Highlights

నిజాం కాలం నాటి నుండే హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెట్టిన డబుల్ డెక్కర్ బస్సులు గుర్తున్నాయా...? గతంలో చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ లాంటివి చూడాలంటే హైదరాబాదు రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సు ఎక్కాల్సిందే..

నిజాం కాలం నాటి నుండే హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెట్టిన డబుల్ డెక్కర్ బస్సులు గుర్తున్నాయా...? గతంలో చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ లాంటివి చూడాలంటే హైదరాబాదు రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సు ఎక్కాల్సిందే.. ప్రస్తుతం ఇవే బస్సులు మళ్ళీ తిరిగనున్నాయా..? హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న రోడ్లపై ఈ బస్సు నడిచే అవకాశం ఉందా...? మంత్రి కేటీఆర్ తీపి జ్ఞాపకాన్ని రవాణా శాఖ నిజం చేయబోతుందా..? వాచ్ థిస్ స్టోరీ.

1990ల కాలంలో హైదరాబాద్‌లో ఉన్నవారికి డబుల్ డెక్కర్ బస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. బస్సుపై అంతస్తులో కూర్చొని ప్రయాణిస్తుంటే ఆ అనుభూతే వేరు.! నవతరం యువతకు మాత్రం దీని గురించి అసలు తెలియదు. ఎందుకంటే డబుల్ డెక్కర్ బస్సులు గత రెండు దశాబ్దాలుగా తగ్గిపోయి, ఆ తర్వాత పూర్తిగా కనుమరుగైపోయాయి. అయితే, తాజాగా హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల అంశం తెరపైకి వచ్చింది.

ఓ నెటిజన్ తన అనుభవాన్ని మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేయగా, ఆయన కూడా తన స్కూలు రోజుల్లో డబుల్ డెక్కర్ బస్సులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. షాకీర్ హుస్సేన్ అనే నెటిజన్ ట్వీట్ చేస్తూ గతంలో తాము డబుల్ డెక్కర్ బస్సు ఎక్కేవాళ్లమని ఓ ఫోటో ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో మళ్లీ ఆ బస్సులను ప్రయాణికులు లేదా టూరిస్టుల కోసం తీసుకురావాలని కేటీఆర్‌ను కోరారు.

దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. చిన్నప్పుడు అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూలుకు తాను వెళ్లేటప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవి. వాటి గురించి చాలా జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ బస్సులను ఎందుకు ఆపేశారో కచ్చితంగా తెలీదు. డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ రోడ్లపైకి తీసుకు వచ్చేందుకు ఏమైనా అవకాశం ఉందా? అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఈ విషయం గురించి టీఎస్ఆర్టీసీ ఎండీతో మాట్లాడతానని ట్వీట్ చేశారు. వీలుంటే ఆ బస్సులను మళ్లీ ప్రవేశపెడతామని ట్వీట్‌లో పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ డబుల్ డెక్కర్ బస్సు జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం.. దీనిపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి స్పందించడం.. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే భాగ్యనగరం రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు చక్కర్లు కొట్టే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే హైదరాబాద్ పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories