Top
logo

Nayani Narasimha Reddy: నాయని ప్రజాప్రస్థానం! హామీ ఇచ్చారంటే పని జరిగేదాక పట్టువదలరు!!

Nayani Narasimha Reddy: నాయని ప్రజాప్రస్థానం! హామీ ఇచ్చారంటే పని జరిగేదాక పట్టువదలరు!!
X
Highlights

Nayani Narasimha Reddy: తెలంగాణా తొలి హోం మంత్రి నాయని నరసింహారెడ్డి రాజకీయ ప్రస్థానం ఇలా సాగింది.

రాజకీయ నాయకులంటే ఎన్నికల సమయంలో హామీలు గుప్పిస్తారు. ఆ తర్వాత సహజంగా మర్చిపోతారు. కానీ ఈయన అలా కాదు. హామీ ఇచ్చారంటే పని జరిగేదాక పట్టువదలరు. సమస్య ఏదైనా వెంటనే పరిష్కరించి బాధితులకు అండగా నిలుస్తారు. బడుగుల కోసం సొంత ఊర్లో పెద్ద పోరాటమే చేసిన లీడర్. అందుకేనేమో కార్మికులంటే అంత అమితమైన ప్రేమ ఆయనకు. 1944 సంవత్సరంలో నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము గ్రామంలో దేవారెడ్డి, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు నాయిని నర్సింహారెడ్డి. సోదరుడు మాధవరెడ్డి, చెల్లెల్లు ధమయంతి, సుధేష్న. వీరిది మధ్య తరగతి కుటుంబం. మేనమామ కూతురు అహల్యను నాయిని వివాహం చేసుకున్నారు. నాయినికి దేవేందర్‌రెడ్డి, సమతా రెడ్డి సంతానం.

నాయినికి 10 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోయారు. కమ్యూనిస్టులకు అన్నం పెడుతున్నాడన్న ఆరోపణలతో పోలీసులు ఆయనను కాల్చిచంపారు. దీంతో అయిదుగురు మేనమామలు నాయిని కుటుంబానికి అండగా నిలిచారు. పెద్దమునగల్, ఎడవెల్లిలో నాల్గవ తరగతి వరకు చదువు సాగింది. అయిదవ తరగతి నుంచి దేవరకొండలో చదువు. హెచ్‌ఎస్‌సీ పూర్తి కాకముందే కుటుంబ బాధ్యతలు మీదపడ్డాయి. దీంతో చదువు మానేసి సొంత ఊరు నేరేడుగొమ్ములో వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నారు.

వ్యవసాయం చేస్తూనే సోషలిస్టు పార్టీకి ఆకర్శితులయ్యారు నాయిని. పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసి ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయారు. ఊర్లో జరిగే అన్యాయాలపై పోరాడేవారు. కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీచేసి గెలిచిన సర్పంచ్‌ ఓ స్థలాన్ని కబ్జా చేసి గోడ కట్టారు. గ్రామస్తులను ఏకం చేసి ఆ గోడను కూల్చడమేగాక, కబ్జాదారులను ఊరి నుంచి తరిమికొట్టారు. దీంతో నాయిని, అతని మద్ధతుదారులపై కేసు నమోదైంది. సంవత్సరంపాటు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది.

సోషలిస్టు పార్టీ కేంద్ర నాయకులు రామ్‌ మనోహర్‌ లోహియా, రాష్ట్ర నాయకుడు బద్రి విశాల్‌ పిట్టి కోరిక మేరకు 1962లో హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఇదే నాయిని కెరీర్‌కు కీలక మలుపు. సోషలిస్టు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్‌ సెక్రటరీగా కొత్త బాధ్యతలు చేపట్టారు. పార్టీ కార్యకలాపాలు నిర్వర్తిస్తూనే ట్రేడ్‌ యూనియన్లతో పనిచేసేవారు. వెయ్యి మంది సభ్యులున్న మున్సిపల్‌ కార్మిక సంఘాన్ని ఐఎన్‌టీయూసీ నుంచి సోషలిస్టు పార్టీలోకి తీసుకురావడంలో నాయిని అత్యంత కీలకంగా వ్యవహరించారు. హ్యాకర్స్‌ యూనియన్‌ను పటిష్టం చేశారు.

కార్మికుల కోసం అహర్నిశలు శ్రమించారు. ఎన్నో పోరాటాలు సాగించారు. కొద్ది రోజుల్లోనే సోషలిస్టు పార్టీలో జనరల్‌ సెక్రటరీ స్థాయికి చేరారు. వ్యవసాయ కార్మికులను ఏకతాటిపై తీసుకొచ్చారు. అనతి కాలంలోనే స్టేట్‌ జాయింట్‌ సెక్రటరీగా కొత్త బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లలోనే స్టేట్‌ జనరల్‌ సెక్రటరీ అయ్యారు. 1969లో పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఉద్యమంలో కీలకం కావడంతో ఏ బంద్‌ కాల్‌ పిలుపు ఇచ్చినా నాయినిని అరెస్టు చేసేవారు. అలా ఓ 30సార్లు జైలుకు వెళ్లారు.

జనతా మోర్చా, భారతీయ లోక్‌ దళ్, స్వతంత్య్ర పార్టీ, సోషలిస్టు పార్టీ, భారతీయ జన సంఘ్‌లు ఏకమై 1977లో ఓ జైలులో జనతా పార్టీ ఆవిర్భవించింది. 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి నాయిని ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ప్రముఖ నాయకుడు టి.అంజయ్య పైన 3 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. నాయినికి ప్రజల మనిషి అన్న పేరుంది. నియోజకవర్గంలో రాత్రిపూట కూడా పరిస్థితులను స్వయంగా తనకు ఇష్టమైన బుల్లెట్‌ వాహనంపై సమీక్షించేవారు.

నాయిని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే నాటికి నియోజకవర్గంలో కుళాయిలు తక్కువగా ఉండేవి. కొన్ని ప్రాంతాల్లో అర కిలోమీటరు వరకు బిందెల వరుస ఉండేది. నాయిని రాకతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. విరివిగా కుళాయిలు ఏర్పాటయ్యాయి. మురుగు కాల్వలు, రోడ్లు నెలకొన్నాయి. అయిదేళ్ల కాలంలో 3 కోట్ల వ్యయంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 1982లో ఎన్‌.టి.రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారు. పార్టీలో చేరాల్సిందిగా నాయినిని స్వయంగా ఎన్టీయార్‌ ఆహ్వానించగా పార్టీ మారేది లేదని నాయిని స్పష్టం చేశారు.

1983లో ఎమ్మెల్యేగా జనతాపార్టీ తరఫున పోటీచేసిన నాయిని 307 ఓట్లతో ఓటమిపాలయ్యారు. కొత్తగా వచ్చిన తెలుగు దేశం పార్టీ గెలుపొందింది. అయితే ప్రజల మనిషిగా పేరున్న నాయిని నర్సింహారెడ్డి ముషీరాబాద్‌లో గెలుస్తాడని ఎన్‌.టి.రామారావు గట్టిగా భావించారు. 1984లో వచ్చిన ఉప ఎన్నికల్లో హిమాయత్‌ నగర్‌ నుంచి జనతాపార్టీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1985లో ముషీరాబాద్‌ నియోజక వర్గం నుంచి 10వేల 500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1989లో జనతాదళ్‌ పార్టీ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు.

1995లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ నుంచి నాయినికి మరోసారి ఆహ్వానం అందింది. కార్యకర్తల ఒత్తిడితో టీడీపీలో చేరక తప్పలేదు. నాయినికి ముషీరాబాద్‌ టికెట్‌ ఇవ్వగా పొత్తులో భాగంగా ముషీరాబాద్‌ టికెట్‌ కోసం బీజేపీ పట్టుపట్టింది. దీంతో నాయినిని సనత్‌నగర్‌ నుంచి పోటీ చేయాల్సిందిగా టీడీపీ కోరింది. నాయిని ఆ ప్రతిపాదనను తిరస్కరించి ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

2001లో కేసీఆర్ నుంచి నాయినికి ఆహ్వానం అందింది. కొత్తగా పెట్టబోయే పార్టీలో చేరాల్సిందిగా కోరారు. 2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌తోనే ఉన్నారు నాయిని. 2004లో టీఆర్‌ఎస్‌ నుంచి ముషీరాబాద్‌లో పోటీ చేసి గెలుపొందారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ మినిస్టర్‌గా చేశారు. 2014లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పోర్ట్‌ఫోలియోలో హోమ్‌తోపాటు ప్రిసన్స్, ఫైర్‌ సర్వీసెస్, సైనిక్‌ వెల్ఫేర్, లేబర్, ఎంప్లాయ్‌మెంట్‌ శాఖలు కూడా ఉన్నాయి.

రవాణా, రవాణేతర రంగంలో ఉన్న డ్రైవర్లు, హోంగార్డులతోపాటు జర్నలిస్టులకు 5 లక్షల బీమాను ప్రవేశపెట్టారు. ప్రభుత్వమే ప్రీమియంను చెల్లిస్తుంది. దీని ద్వారా లక్షలాది కుటుంబాలకు భరోసా ఏర్పడింది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో బ్రోకర్ల చేతిలో మోసపోకుండా తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీయే విదేశాల్లో నియామకాలు చేపడుతుంది. ఇది అందుబాటులోకి వచ్చాక తెలంగాణలో విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు తగ్గిపోయాయి. అంతేకాదు ఈ కంపెనీ పెద్ద ఎత్తున జాబ్‌ మేళాలు నిర్వహిస్తోంది.

కేసీఆర్‌ నాయకత్వంలో నాయిని తన శాఖల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ద్వారాలు తెరుస్తూ కార్మిక చట్టాల్లో సవరణలు చేశారు. పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక యువత వ్యాపార అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా ఐటీఐలను విరివిగా స్థాపించారు. ఒక లక్ష సీసీటీవీ కెమెరాలు ఏర్పాటవడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. పోలీసులకు 500 కోట్లతో కొత్త వాహనాలు సమకూర్చారు. దేశంలో తొలిసారిగా మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ ఏర్పాటయ్యాయి. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ రూపుదిద్దుకుంటోందంటే దానికి కారణం నాయిని నర్సింహారెడ్డి.

Web TitleNayaniNarasimha reddy Telangana state first home minister Nayani Narasimha reddy never give up for any reason nayani biography
Next Story