Nalgonda Tragedy: స్కూల్‌కు వెళ్తుండగా మృత్యువు కబళించింది.. కారు టైర్ పేలి ఇద్దరు టీచర్లు దుర్మరణం!

Nalgonda Tragedy: స్కూల్‌కు వెళ్తుండగా మృత్యువు కబళించింది.. కారు టైర్ పేలి ఇద్దరు టీచర్లు దుర్మరణం!
x
Highlights

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం. స్కూల్‌కు వెళ్తుండగా కారు టైర్ పేలి ఇద్దరు ఉపాధ్యాయులు మృతి. జాజిరెడ్డిగూడెం వద్ద జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు.

సంక్రాంతి పండుగ వేళ ఆ కుటుంబాల్లో వెలుగులు నిండాయి.. మూడు రోజుల పండుగను ఆప్యాయతల మధ్య జరుపుకున్నారు. సెలవుల తర్వాత తొలిరోజే విధుల్లో చేరాలని ఉత్సాహంగా బయలుదేరారు. కానీ, విధి మరోలా తలచింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరు ఉపాధ్యాయులను మృత్యువు కబళించడంతో నల్లగొండలో విషాద ఛాయలు అలముకున్నాయి.

అసలేం జరిగిందంటే?

నల్లగొండ నుంచి ప్రతిరోజూ ఐదుగురు ఉపాధ్యాయులు కలిసి ఒకే కారులో తమ పాఠశాలలకు వెళ్లి వస్తుంటారు. వీరిలో ప్రవీణ్ (తుంగతుర్తి GHM), గీత (రావులపల్లి GHM), సునీతరాణి (అన్నారం GHM), కల్పన (తుంగతుర్తి కస్తూర్బా గాంధీ ASO) మరియు మరో ఉపాధ్యాయుడు ఉన్నారు. శనివారం ఉదయం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో వీరంతా నల్లగొండ నుంచి కారులో బయలుదేరారు.

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం సమీపానికి చేరుకోగానే, వీరు ప్రయాణిస్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. అదుపుతప్పిన వాహనం రోడ్డుపై మూడుసార్లు పల్టీలు కొట్టింది.

ఘటనాస్థలిలోనే ఒకరు.. దారిలో మరొకరు..

ఈ భీకర ప్రమాదంలో కల్పన అనే టీచర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మిగతా నలుగురిని వెంటనే సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. అయితే, గీత అనే టీచర్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. మిగిలిన ముగ్గురు ఉపాధ్యాయులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కుటుంబాల్లో తీరని శోకం

పండుగ సంతోషం తీరకముందే, విధులకు వెళ్లిన తమ వారు విగతజీవులుగా తిరిగి రావడంతో ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారు. జాజిరెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories