ఆ ముగ్గురికి మున్సిపోల్స్ సవాల్.. ఆ ముగ్గురు ఎంపీలు ఏం చేయబోతున్నారు..?

ఆ ముగ్గురికి మున్సిపోల్స్ సవాల్.. ఆ ముగ్గురు ఎంపీలు ఏం చేయబోతున్నారు..?
x
బీజేపీ ఎంపీలు
Highlights

ఆ ముగ్గురి వల్లే ఆ పార్టీకి ఊపొచ్చింది. ఏమీ లేదనుకున్న పార్టీని ఔరా ఇంతుందా అనిపించేలా చేశారు ఆ ముగ్గురూ. పార్టీ లేదనుకున్న చోట, దిగ్గజాలను ఓడించారు....

ఆ ముగ్గురి వల్లే ఆ పార్టీకి ఊపొచ్చింది. ఏమీ లేదనుకున్న పార్టీని ఔరా ఇంతుందా అనిపించేలా చేశారు ఆ ముగ్గురూ. పార్టీ లేదనుకున్న చోట, దిగ్గజాలను ఓడించారు. అంచనాలను మించిన ఆ విజయమే, ఇప్పుడు మున్సిపోల్స్‌ రూపంలో వారిపై ఒత్తిడి తీవ్రం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తరువాత ఆ పార్టీలో మునుపటి జోష్ లేదన్న ప్రచారం ఓ వైపు, వాపును చూసి కమలం పార్టీ నాయకులు బలుపు అనుకుంటున్నారన్న టిఆర్‌ఎస్ నేతల కౌంటర్ల నేపథ్యంలో, ఆ ఎంపీలకు మున్సిపల్ ఎన్నికలు సవాల్‌గా మారాయి. వారి నాయకత్వానికి సిసలైన పరీక్షగా నిలిచిన మున్సిపోల్స్‌లో, ఆ ముగ్గురు ఎంపీలు ఏం చేయబోతున్నారు..?

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్లు ముగ్గురు బీజేపీ ఎంపీలకు సవాలుగా మారాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావుల లీడర్​షిప్​కు ఈ ఎన్నికలు పరీక్షగా పరిణమించాయి. ఎంపీ ఎలక్షన్లలో గెలుపు తర్వాత బీజేపీలో మళ్లీ ఆ ఊపు కనిపించడం లేదని మున్సిపోల్స్​లో మంచి ఫలితాలు సాధించి సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పార్టీ సిట్టింగ్ ఎంపీల పరిధిలోని మున్సిపాలిటీలపై ఆశలు పెట్టుకుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కటంటే ఒక్క స్థానానికే పరిమితమై కొట్టుమిట్టాడిన కమలం పార్టీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా పుంజుకుంది. ఆ ఫలితాల రెట్టింపు ఉత్సాహంతో బీజేపీ అధినాయకత్వం కూడా తెలంగాణపై ఫోకస్ చేసి, పార్టీ బలోపేతానికి ప్రత్యేకంగా దృష్టి సారించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ప్రభంజనానికి చావు దెబ్బ తిన్న కమలం పార్టీ. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ఉపశమనం పొందటమే కాదు ఫుల్ జోష్ తో దూసుకుపోతోంది. దానికి కారణం నాలుగు ఎంపీ స్థానాల్లో గెలుపొందటమే కాదు, ముఖ్యమంత్రి కుమార్తెతో పాటు టిఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకున్ని ఓడించటం ఆ పార్టీ మైలేజీని మరింత పెంచింది. అయితే ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో ఆ పార్టీ కనీస ప్రభావం చూపలేకపోయింది. సరిగ్గా ఈ సమయంలో వచ్చిన మున్సిపాలిటీ ఎన్నికలు, కమలం పార్టీకి తన సత్తా ఏంటో నిరూపించుకోక తప్పక పరిస్థితిని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు చాలా కీలకమైనవి. రాష్ట్ర రాజకీయాలపై ఇవి ప్రభావం చూపట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో మళ్లీ అందరి దృష్టి ఆ ముగ్గురు ఎంపీలపైనే ఉంది. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లు దూకుడు మీదున్నారు. ఎప్పటికప్పుడు అధికారపార్టీపై మాటల తూటాలు పేలుస్తున్నారు. సొంత పార్టీ నేతలతో పాటు పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా వారిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.

కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ మున్సిపాల్టీలు ఉన్నాయి. నిజామాబాద్ లోక్​సభ పరిధిలో నిజామాబాద్ కార్పొరేషన్, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ఆర్మూర్, భీంగల్, బోధన్ మున్సిపాల్టీలు ఉన్నాయి. వీటన్నింటిలో గెలుపు బాధ్యత సంజయ్, అర్వింద్‌లపై పడింది. ఇక సోయం బాపూరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, కాగజ్ నగర్ మున్సిపాలిటీల్లో గెలుపుపైనా పార్టీలో ఆశలు ఉన్నాయి. దీంతో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాదుల్లో, టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి పొందారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలోని జీహెచ్ఎంసీకి ఇప్పుడు ఎన్నికల్లేవు. అయితే, హైదరాబాద్ నగర శివార్లలోని మల్కాజ్​గిరి, చేవెళ్ల లోక్​సభ సెగ్మెంట్ల పరిధిలోని ఏడు కార్పొరేషన్లు, 20 వరకు మున్సిపాలిటీల్లో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై ఉంది. బడంగ్ పేట్, మీర్ పేట్, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట కార్పొరేషన్లు, శంషాబాద్, మేడ్చల్, ఘట్ కేసర్, కొంపల్లి, దుండిగల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట్ వంటి కీలక మున్సిపాలిటీలు ఇందులో ఉన్నాయి. సిటీకి ఆనుకుని ఉండడంతో వీటిల్లో గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు సాధించాలని భావిస్తోంది బీజేపీ.

ఇక అటు అధికార పార్టీ ఈ ముగ్గురు ఎంపీల పరిధిలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించిందట. ఎంపీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా రాష్ట్రంలో ఎదగాలని చూస్తున్న బీజేపీని మానసికంగా దెబ్బ కొట్టడమే కాకుండా, ఎంపీ ఎన్నికల ఓటమికి బదులు తీర్చుకోవాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారట. ఈ ప్రాంతాల్లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్, స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ ముగ్గురు ఎంపీల పరిధిలో జరిగే ఎన్నికలు హోరాహోరీగా సాగటం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక అటు సంజయ్, అర్వింద్, బాపూరావులు ఈ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో టిఆర్‌ఎస్ తీరును ఎండగడుతూ లబ్ది పొందాలని బీజేపీ చూస్తోంది. మున్సిపాలిటీలకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి జరిగిందన్న వాదనలను బలంగా వినిపించాలని ఆ పార్టీ చూస్తోంది. ఏది ఏమైనా కాషాయ అధిష్టానాన్ని ఆకర్షించేందుకు, మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని, పట్టుదలగా వున్నారు ముగ్గురు ఎంపీలు. చూడాలి, పార్లమెంట్‌ పోరులో వర్కౌటైన స్ట్రాటజీ, స్థానిక పోరులో ఎలాంటి రిజల్ట్‌ ఇస్తుందో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories