MLC Kavitha: సుఖేష్‌తో నాకెలాంటి పరిచయం లేదు

MLC Kavitha: ఫేక్ చాట్‌లతో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు

Jyothi
Updated on: 13 April 2023 3:48 PM IST
MLC Kavitha Responded to Sukesh Chandrasekhar Allegations
X

MLC Kavitha: సుఖేష్‌తో నాకెలాంటి పరిచయం లేదు

MLC Kavitha: ఆర్థిక నేరగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ విడుదల చేసిన వాట్సప్ చాట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. సుఖేష్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదన్నారు కవిత. బీఆర్ఎస్ పార్టీపై ఉదేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ని ఎదుర్కునే ధైర్యం లేక తనపై దాడి చేస్తున్నారని.. ఫేక్ చాట్‌ విడుదల చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సుఖేశ్ చంద్రశేఖర్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదన్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా తనపై ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను, జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవీ ఛానెళ్లు, యూ ట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామకుడు రాసిన లేఖను విడుదల చేయడం. దానిపై వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం.. దాని తదనంతరమే ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్‌లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని మండిపడ్డారు.

అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో తనకు పరిచయం కూడా లేదన్నారు. అతనెవరో కూడా తనకు తెలియదన్నారు ఎమ్మెల్సీ కవిత. కానీ వాస్తవాలను పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో.. పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయన్నారు. ఇదివరకు తన మొబైల్ ఫోన్ల విషయంలో ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారన్నారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్ ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని,కేసీఆర్‌ని వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయన్నారు కవిత.

మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్‌.. అరవింద్ కేజ్రీవాల్‌, కవిత మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని బుధవారం లేఖ విడుదల చేశాడు. లేఖతో పాటు కవిత అక్క టీఆర్ఎస్ అనే పేరుతో ఉన్న చాట్‌ను కూడా రిలీజ్ చేశాడు సుఖేష్‌. తాను ఆప్‌ నుంచి డబ్బులను బీఆర్ఎస్‌ ఆఫీస్‌లో డెలివరీ చేసినట్లు వెల్లడించాడు. అయితే దీనిపై స్పందించిన కవిత.. అవన్నీ అవాస్తవాలే అని కొట్టిపారేశారు.

Jyothi

Jyothi

Next Story