MLA Raja Singh: కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

MLA Raja Singh: కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
x
Highlights

MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇద్దరం కలిసి ఎన్నికలకు వెళ్దామని ఆయన సవాల్ విసిరారు.

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రాజా సింగ్, తనకు బీజేపీ నుంచి ఎలాంటి సహకారం అందలేదని అన్నారు. పార్టీలో తాను ఎటువంటి పదవిని ఆశించలేదని చెప్పారు. "ప్రస్తుతం ఉన్న కమిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదు. ఒకవేళ ఈ కమిటీతో గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా" అని రాజా సింగ్ వ్యాఖ్యానించారు.

పార్టీని నాశనం చేస్తున్నది ఎవరో మరోసారి బయటపెడతానని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలోని కేంద్ర పెద్దలు తరచూ తనతో ఫోన్‌లో మాట్లాడుతున్నారని, వారికి పార్టీలో జరుగుతున్న విషయాలన్నీ వివరిస్తానని తెలిపారు. తాను ఎప్పటికీ బీజేపీ నేతగానే ఉంటానని, సెక్యులర్ వాదిని కాదని స్పష్టం చేశారు. అలాగే, బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీల్లో చేరే ప్రసక్తే లేదని చెప్పారు.

పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనకు ఫోన్ చేసి మందలించారని రాజా సింగ్ వెల్లడించారు. తాను చేసే వ్యాఖ్యలు పార్టీపై కాదని, కేవలం కొందరు నేతలపై మాత్రమేనని చెప్పారు. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఢిల్లీ పెద్దలు పిలిస్తే వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాజా సింగ్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories