logo
తెలంగాణ

Mission Bhagiratha: తెలంగాణాలో దూరమైన ఫ్లోరైడ్.. చేరువవుతున్న భగీరధ ఫలాలు

Mission Bhagiratha: తెలంగాణాలో దూరమైన ఫ్లోరైడ్.. చేరువవుతున్న భగీరధ ఫలాలు
X

Mission Bhagiratha: 

Highlights

Mission Bhagiratha: ఒకప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ఉన్న ఫ్లోరైడ్ గ్రామాలకు భగీరధ ప్రయత్నంతో స్వస్తి పలికారు. కొన్ని ప్రాంతాల్లో భూమి లోతుల నుంచి వచ్చే నీటిలో ఫ్లోరైడ్ ఛాయలు ఉండటంతో ఆయా ప్రాంతాల్లోని జనం కొన్ని లోపాలతో జన్మించడం,

Mission Bhagiratha: ఒకప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ఉన్న ఫ్లోరైడ్ గ్రామాలకు భగీరధ ప్రయత్నంతో స్వస్తి పలికారు. కొన్ని ప్రాంతాల్లో భూమి లోతుల నుంచి వచ్చే నీటిలో ఫ్లోరైడ్ ఛాయలు ఉండటంతో ఆయా ప్రాంతాల్లోని జనం కొన్ని లోపాలతో జన్మించడం, మరికొంత జన్మించాక మరికొన్ని రకాల వ్యాధులకు గురికావడం జరుగుతుండేది. ఈ విషయాలను గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం ఫ్లోరైడ్ లేని నీటిని అందించే దిశగా ప్రయత్నం చేసింది. క్షేత్రస్థాయిలో సఫలమయ్యింది. దీనికి సంబంధించి ఇటీవల కేంద్రం ప్రకటించిన ఫ్లోరైడ్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణా లేకపోవడంతో పాలనా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

అంగవైకల్యం.. అంతుపట్టని అనారోగ్యం.. మరుగుజ్జుతనం.. బుద్ధిమాంద్యం.. వయసు తగ్గట్టుగా ఎదగని శరీరం.. ఇవి ఫ్లోరైడ్‌ బారిన పడిన వారి ఆనవాళ్లు. ఫ్లోరైడ్‌ రక్కసి కాటుకు బలైన కుటుం బాలెన్నో.. జీవచ్ఛవాలుగా బతుకులీడ్చినవారెందరో.. ఇది ఒకప్పుడు. మరిప్పుడో? దాని పీడ విరగడైంది. ఇప్పుడు ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారింది. దాని కోసం 'భగీరథ'ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. తెలంగాణలో ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాల్లేవని పార్లమెంటు సాక్షిగా కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ రక్కసి బారిన పడి అల్లాడుతున్న 967 ఆవాసాలకు ఊరట కలిగింది. 'మిషన్‌ భగీరథ'పథకం ప్రవేశపెట్టడానికి ముందు.. అంటే 2015 ఏప్రిల్‌ ఒకటి నాటికీ రాష్ట్రంలో 976 ఫ్లోరైడ్‌ ప్రభావిత ఆవాసాలుండగా.. గత నెల ఒకటో తేదీ నాటికీ ఈ సంఖ్య సున్నాకు చేరుకుంది. ఫ్లోరోసిస్‌ ప్రభావిత ప్రాంతాలకు మిషన్‌ భగీరథ కింద రక్షిత తాగునీరు అందించడంతో అది జాడ లేకుండా పోయింది.

తొలిసారి దర్శిలో గుర్తింపు

భూగర్భజలాల్లో తొలిసారి ఫ్లోరైడ్‌ ఆనవాళ్లు 1937లో ప్రకాశం జిల్లా దర్శిలో, 1945లో నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం బట్లపల్లి(పాత)లో కనిపించాయి. ప్రజలు ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకునేందుకు ఉపరితల నీటివనరుల సేవనమే మార్గమని శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంకే దాహూర్‌ అప్పటి నిజాం ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు నిజాం నవాబు చర్లగూడ, ఇబ్రహీంపట్నం, పసునూరు, తంగడిపల్లి, మునుగోడు చెరువులను తవ్వించినా వర్షాభావ పరిస్థితులు, కరువుతో అవి రానురాను అడుగంటిపోయాయి.

దీంతో ఫ్లోరోసిస్‌ భూతం ఉగ్రరూపం దాల్చింది. 1985లో బట్లపల్లిలో ప్రపంచం లోనే అత్యధిక పరిమాణం(28 పీపీఎం)లో ఫ్లోరైడ్‌ ఉన్నట్టు తేలింది. ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలైన మర్రిగూడ, నాంపల్లి, చండూరు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, సంస్థాన్‌ నారాయణపూర్, చౌటుప్పల్, మునుగోడు మండలాల ప్రజలు అనివార్యంగా బోరుబావుల నీటినే సేవించాల్సి వచ్చింది. 2003లో పోరుయాత్రలో భాగంగా మర్రిగూడకు వచ్చిన ప్రస్తుత సీఎం కేసీఆర్‌.. ఫ్లోరైడ్‌ బాధితులను చూసి చలించిపోయారు. అధికారంలోకి రాగానే చౌటుప్పల్‌లో మిషన్‌ భగీరథ పైలాన్‌ ఆవిష్కరించి 2017 చివరి నుంచి ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందించారు.

మిషన్‌ భగీరథ ఫలితంగానే..

తెలంగాణ ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా మారేం దుకు మిషన్‌ భగీరథ పథకమే కారణమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలం గాణ ఆవిర్భావానికి ముందు కేవలం 5,767 గ్రామాలకు మాత్రమే తాగునీటి సదుపాయం ఉండేదని, ఇప్పుడు రాష్ట్రంలో 23,968 ఆవాసాలకు, 120 పట్టణాలకు మిషన్‌ భగీరథ రక్షిత మంచినీరందుతోందని చెప్పారు.

భగీరథ నీటితో ఫ్లోరైడ్‌ విముక్తి

మిషన్‌ భగీరథ నీరు రాకమునుపు ఊరంతా ఫ్లోరైడ్‌ నీరే శరణ్యం. ఫ్లోరైడ్‌ నీరు తాగి, ఒంటి నొప్పులు ఇతర సమస్యలతో బాధపడేవారు. ఇప్పుడు అలాం టి పరిస్థితి లేదు. గతేడాది నుంచి రక్షిత నీరు ఇంటింటికీ సరఫరా చేస్తున్నాం. –కొట్టం మాధవిరమేష్‌ యాదవ్, సర్పంచ్‌ తమ్మడపల్లి, మర్రిగూడ మండలం, నల్లగొండ జిల్లా

ఆరోగ్యం కుదుటపడింది

ఫ్లోరైడ్‌ వల్ల చాలామంది మా మండలంలో వికలాంగులుగా మారారు. ఈ నీరు తాగినప్పుడు కాళ్లు, చేతులకు నొప్పులు ఉండేవి. ఏ పనీ చేయలేని పరిస్థితి. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు ఇస్తున్నారు. అనారోగ్య సమస్యలు పోయాయి. –అల్వాల అంజయ్య, తిరుగుండ్లపల్లి, మరిగూడ మండలం

Web Titlefluoride problem cleared in telangana says central government-
Next Story