Top
logo

సైలెంట్‌గా వున్న తుమ్మలకు సడెన్‌ సర్‌ప్రైజ్.. ఇంత హడావుడిగా పార్టీ పెద్దల పిలుపు ఏంటి?

సైలెంట్‌గా వున్న తుమ్మలకు సడెన్‌ సర్‌ప్రైజ్.. ఇంత హడావుడిగా పార్టీ పెద్దల పిలుపు ఏంటి?
X
Highlights

ఖమ్మం జిల్లాలో మొన్నటి వరకు సైలెంట్‌గా వున్న తుమ్మల నాగేశ్వరరావును, గులాబీ అధిష్టానం సడెన్‌గా ఎందుకు...

ఖమ్మం జిల్లాలో మొన్నటి వరకు సైలెంట్‌గా వున్న తుమ్మల నాగేశ్వరరావును, గులాబీ అధిష్టానం సడెన్‌గా ఎందుకు పిలిచింది? నువ్వానేనా అని కత్తులు దూసిన మంత్రి పువ్వాడ, తుమ్మల దగ్గరకే వెళ్లి ఆహ్వానించడం, దేనికి సంకేతం? ఇక తానెవరికీ అక్కర్లేదని రగిలిపోతూ, చెట్ల నీడలో సేదతీరుతున్న మాజీ మంత్రిని, గులాబీ హైకమాండ్‌ ఎందుకు కూల్ చేస్తోంది? తుమ్మల నాగేశ్వర రావుకు ఇక టైమొచ్చిందా? టీఆర్ఎస్‌ అధిపతి మదిలో వున్న వ్యూహమేంటి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రిగా చేసి, ఎలక్షన్స్‌లో అనూహ్యంగా ఓటమిపాలై, ఇప్పుడు మౌనమే తన భాషగా, వ్యవసాయక్షేత్రంలోని చెట్ల నీడన సేదతీరుతున్నారు తుమ్మల నాగేశ్వర రావు. ఖమ్మం రాజకీయాల్లో తిరుగులేని హవా నడిపించిన తుమ్మలకు, బ్యాడ్‌టైం నడిచింది. అయితే, ఇప్పడు సడెన్‌గా గుడ్‌ టైం స్టార్ట్ అయినట్టు సంకేతాలు అందుతున్నాయి. అందుకు నిదర్శనమే ఏకంగా మంత్రులు, ఆయన దగ్గరకెళ్లి మరీ, ఓ ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించడం. మొన్నటి వరకు పెద్దగా పట్టించుకోని గులాబీ అధిష్టానానికి సడెన్‌గా, ఇప్పుడెందుకు తుమ్మల గుర్తొచ్చారన్నదానిపై రకరకాల చర్చ జరుగుతోంది.

ఎక్కడో ఉన్న సొంతూరు గండుగులపల్లి వ్యవసాయ క్షేత్రంలో, తన పనేదో తాను చేసుకుపోతున్న తుమ్మలకు, అకస్మాత్తుగా పార్టీ పెద్దల నుంచి పిలుపు ఎందుకు వచ్చిందనే వార్త, జిల్లా రాజకీయా వర్గాలను ఓ కుదుపు కుదిపేస్తోంది. వాస్తవానికి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌తో తుమ్మల వర్గానికి అంతగా సత్సంబంధాలు లేవు. పార్టీ జిల్లా కార్యాలయంలో తుమ్మల ఫోటో తొలగించడం నుంచి, తుమ్మల అనుకూల వర్గానికి పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేయడం వరకూ, రకరకాల పరిణామాలు చోటుచేసుకున్నాయి. తుమ్మల మాత్రం ఈ వ్యవహారాలను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. పార్టీలో ఉన్నారనే పేరే గాని, కార్యక్రమాల్లో పాల్గొన్నది కూడా తక్కువే. ఈమధ్య కాలంలో హైదరాబాద్ వెళ్లి కేసీఆర్‌ని కలిశారన్న ప్రచారం జరిగినా, ఎవ్వరూ ధృవీకరించలేదు. ఐతే ఇపుడు సడన్‌గా జిల్లాలో, వన్ మ్యాన్ షో గా రాజకీయాలు నడుపుతున్న మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మలను తన సొంత నియోజకవర్గం పరిధిలోని రఘునాథ పాలెంలో, తన సొంత నిధులతో నిర్మించిన రైతు వేదిక ప్రారంభానికి అతిథిగా ఆహ్వానించడం స్థానికంగా తీవ్ర చర్యకు దారి తీసింది.

వాస్తవానికి జిల్లాలో రైతు వేదికల ప్రారంభ కార్యక్రమంలో, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఉన్నారు. ఊహించని విధంగా మంత్రులు అజయ్, నిరంజన్ రెడ్డి తుమ్మల ఇంటికి వెళ్లి ఆయనను తమ వాహనంలో, ప్రభుత్వ కార్యక్రమానికి తీసుకెళ్లడం వెనుక టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం ఉందనే ప్రచారం, రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల అనంతరం, పార్టీలో బలమైన క్యాడర్ ఉండి, కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న తుమ్మల వంటి సీనియర్ నేతల సేవలను, మళ్లీ పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, గులాబీ బాస్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఆకర్షించేందుకు, పార్టీ నాయకత్వం తుమ్మల నాగేశ్వరరావును, తిరిగి చేరదీసినట్టు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఇన్నాళ్ళు జిల్లాలో కళ తప్పిన తుమ్మల వర్గానికి, తాజా రాజకీయ సమీకరణాలు ఒకరోజు ముందే దీపావళి పండుగను తీసుకొచ్చాయని జనం గుసగుసలాడుతున్నారు.

Web TitleMinister Tummala Nageswara Rao got unexpected respect in the party
Next Story