సఖీ కేంద్రాలను పటిష్టంగా నిర్వహించాలి : మంత్రి సత్యవతి రాథోడ్

సఖీ కేంద్రాలను పటిష్టంగా నిర్వహించాలి : మంత్రి సత్యవతి రాథోడ్
x
Highlights

మహిళల సమస్యలన్నింటికి ఒకే కేంద్రంగా పరిష్కారం చేస్తున్న సఖీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి...

మహిళల సమస్యలన్నింటికి ఒకే కేంద్రంగా పరిష్కారం చేస్తున్న సఖీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నామని ఈ నెలాఖరు నుంచి అమలు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ప్రైవేట్ ఎన్జీవోలలోని బాలికలకు భద్రత, భవిష్యత్ కల్పించడం వంటి అంశాలపై నేడు మహిళాభివృద్ధి, సఖీ కేంద్రాలను పటిష్టం చేయడం, మహిళా పాలిటెక్నిక్ కాలేజీ అడ్మిషన్లు, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి దివ్య, జాయింట్ డైరెక్టర్ లక్ష్మి, ఇతర అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సఖీ కేంద్రాలకు పోలీస్ శాఖ నుంచి ఒక అధికారిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

ఎన్జీవోల ఆధ్వర్యంలో నడుస్తున్న సఖీ కేంద్రాలను మరింత బాధ్యతాయుతంగా, పటిష్టంగా చేసేందుకు సఖీ కేంద్రాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిని నియమించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ నెలాఖరున సఖీ కేంద్రాలపై పోలీసు ఉన్నతాధికారులతో కలిసి మహిళా భద్రత అంశంపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా అక్కడకు వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రభుత్వ సర్వీసుల నుంచి రిటైరైన అధికారులను, నిపుణులైన న్యాయవాదులను నియమించనున్నట్లు వెల్లడించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్షియల్ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో ఈ ఏడాది అడ్మిషన్లు పూర్తి అయ్యాయని, ఈ నెలాఖరున అడ్మిషన్లు పొందిన వారికి ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలో గల తల్లిదండ్రులు లేనివారు, తల్లిదండ్రుల్లో ఒకరే ఉన్నవారు, అన్యాయానికి గురైన బాలికలకు ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్స్ కోర్సుల్లో అడ్మిషన్లు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఎన్జీవోల్లోని బాలికలకు ఇటీవల జరుగుతున్న ఇబ్బందుల నేపథ్యంలో వారికి మంచి విద్య, వసతి కల్పించే లక్ష్యంతో ఈ ఎన్జీవోలలోని బాలికలను రెసిడెన్షియల్ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చేర్పించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అనాథ బాలుర, షెల్టర్ కావాల్సిన బాలుర కోసం ఇప్పటి వరకు రాష్ట్రంలో షెల్టర్ హోమ్స్ లేవని త్వరలో పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పది బాలుర షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories