Goreti Venkanna: గోరటి వెంకన్నకు మంత్రి పదవి?

Minister Post for Goreti Venkanna
x

Goreti Venkanna: గోరటి వెంకన్నకు మంత్రి పదవి?

Highlights

Goreti Venkanna: గోరటి వెంకన్నకు అమాత్యపదవి దక్కబోతోందా? సాహిత్య రంగానికి పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకోబోతున్నారా?

Goreti Venkanna: గోరటి వెంకన్నకు అమాత్యపదవి దక్కబోతోందా? సాహిత్య రంగానికి పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకోబోతున్నారా? దళిత కవికి పట్టం కట్టిన గులాబీ బాస్‌ ఆయన్ను కేబినెట్‌ బెర్త్‌ ఎక్కించబోతున్నారా? సామాజిక ఆర్థిక స్థితిగతులను తన కవితలు, పాటలతో కళ్లకు కట్టినట్టు చూపించిన వెంకన్న ఇక మినిస్టర్‌ కాబోతున్నారా? ప్రజల్లో చైతన్యం కలిగించే విప్లవాత్మకమైన రచనలకు పట్టం కట్టిన ప్రజా వాగ్గేయకారుడికి గులాబీ అధినేత మరోసారి పట్టం కట్టబోతున్నారా? గులాబీ బాస్‌ ఆలోచన ఏంటి తెలంగాణ భవన్‌ ఏమనుకుంటోంది?

చట్టసభకు నడిచి వచ్చిన పల్లె పాటగా పేరొందిన గోరటి వెంకన్నకు మంత్రి పదవి ఖాయమన్న చర్చ తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరందుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నామినేట్‌ అయిన గోరెటి వెంకన్నకు సాహిత్య కోటా, దళితుల కోటాలో కేబినెట్‌ బెర్త్‌ ఎక్కించేందుకు కసరత్తు జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. పల్లె ఆత్మకు పాటగట్టి మనిషి మూలాలను తట్టిలేపిన వాగ్గేయకారుడిగా పేరు సంపాదించుకున్న గోరటి వెంకన్న పల్లె పాటకు పట్టం కడుతూ కిందటేడాది శాసనమండలిలో అడుగు పెట్టారు. పల్లె సమస్యలపై కదం తొక్కిన ప్రజా గొంతుక మండలి వేదికగా గజ్జె కట్టి పాడింది. ఆ పాటే ఇప్పుడు అమాత్య పదవికి దగ్గర అవుతుందన్న టాక్‌ వినిపిస్తోంది.

గోరటి వెంకన్న రచించిన వల్లంకి తాళం రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇది తెలంగాణకు వచ్చిన అవార్డు. తాను నమ్ముకున్న సిద్ధాంతాల మెట్ల మీద ఎదుగుతూ వచ్చిన మహాకవిగా, ప్రజాకవిగా, వాగ్గేయకారుడిగా జీర గొంతుతో తనలో బైరాగి రాగాల్ని పరుచుకున్న కవితాశైలి ఆయనది. ఏఆర్‌ సబ్‌ డివిజనల్‌ కో ఆపరేటివ్‌ ఆఫీసర్‌గా ఉన్న వెంకన్న ఉస్మానియా నుంచి తెలుగులో ఎంఏ పట్టా పొందారు. రేల పూతలు, ఏకనాథం మోత, పూసిన పున్నమి, వల్లంకితాళం, ద వేవ్‌ ఆఫ్‌ ద క్రిసెంట్‌ పుస్తకాలు రచించిన గోరటి కబీర్‌ సమ్మాన్‌, హంస, కాళోజీ, సినారె, లోకనాయక్‌, అరుణసాగర్‌ అవార్డులను, అధికార భాషా సంఘం పురస్కారాలతో పాటు తాజాగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందారు.

ఇదంతా సరే. అందరికీ తెలిసిన విషయమే. అసలు గోరటి వెంకన్న గురించి ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది? టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్గతంగా ఈయన గురించి జరుగుతున్న చర్చ ఏంటి? ఇవే విషయాలపై మనం కాస్త డిటైల్డ్‌గా మాట్లాడుకోవాలి. గోరటి వెంకన్న సహజంగా కవి. ఆయన నోటి నుంచి జాలువారే పదాలను ఒకచోట కూర్చి.. అందంగా అలకరించి, అయితే పాటగానో, లేదంటో కవితగానో మలిచే సత్తా ఉన్న కవి. దళిత సామాజిక వర్గం నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి ఎదిగిన వెంకన్నకు ఎమ్మెల్సీ రావడమే ఒక ఆశ్చర్యమైతే ఏకంగా ఆయన్ను తీసుకెళ్లి మంత్రి పదవి పీఠంపై కూచొబెడుతున్నారన్న ప్రచారంతో వెంకన్న పేరు మరోసారి తెరపైకి వస్తోంది.

వెనుకబడిన జిల్లాగా పేరున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి వచ్చిన గోరటి వెంకన్నకు సామాజిక సమీకరణాలు కూడా కలసి రావచ్చన్న అభాప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ మంత్రిపదవుల్లో ఉన్నారు. ఇందులో ఒకరు ఓసీ, మరొకరు బీసీ. ఎస్సీ సామాజికవర్గం కోణంలో ఆలోచిస్తే గోరటి వెంకన్నే కనిపిస్తున్నారని, వెంకన్నకు కేబినెట్‌ బెర్త్‌ కన్ఫామ్‌ చేస్తే ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోగా, దళితలకు న్యాయం చేశారన్న సింపతి కూడా రావొచ్చన్న అంచనాల మధ్య గులాబీ బాస్‌ వెంకన్న పేరును పరిశీలిస్తున్నారన్న టాక్‌ నడుస్తోంది.

వచ్చే నెలలో ఓ మంచి రోజు చూసుకొని విస్తరించబోయే మంత్రివర్గంలో గోరటి వెంకన్న పేరును కచ్చితంగా పరిశీలిస్తారన్న చర్చ జరుగుతోంది. అదీగాక, ఇప్పటికే తెలంగాణ అంతటా దళితబంధు పథకంతో దళితులకు దగ్గరైన కేసీఆర్‌ అదే సామాజికవర్గం నుంచి మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకన్నకు మంత్రిపదవి ఇస్తే ఎలా ఉంటుందన్న కోణంలో అధినేత ఆలోచిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మరి, గులాబీ బాస్‌ మనసులో ఏముందో, ఆయన ఏమనుకుంటున్నారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories