Harish Rao: పీజేఆర్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే పీజేఆర్

Minister Harish Rao Meet Vishnuvardhan Reddy
x

Harish Rao: పీజేఆర్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే పీజేఆర్

Highlights

Harish Rao: దోమలగూడలోని విష్ణువర్ధన్‌ ఇంటికి హరీష్‌రావు

Harish Rao: పీజేఆర్‌ తనయుడు, జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిని మంత్రి హరీష్‌రావు కలిశారు. దోమలగూడలోని విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్‌రావు.. ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విష్ణువర్ధన్‌ను బీఆర్ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. నిన్న రాత్రి సీఎం కేసీఆర్‌తో విష్ణువర్ధన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ టికెట్‌ను అజారుద్దీన్‌కు కేటాయించడంతో.. విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడాలని భావించారు. దీంతో.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం విష్ణువర్ధన్‌రెడ్డితో మంత్రి హరీష్‌రావు సమావేశమై.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

జంట నగరాల్లో పీజేఆర్ అంటే తెలియని వ్యక్తి ఉండరని, కార్మిక పక్షపాతిగా ఆయన చేసిన ప్రజాసేవ అందరికీ తెలిసిందేనని మంత్రి హరీష్‌రావు అన్నారు. అలాంటి నేత వారసుడికి కాంగ్రెస్ నేడు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే కాంగ్రెస్ అన్నట్లు ఉండేదని, సీఎల్పీ నేతగా పీజేఆర్ ఆ పార్టీకి ఎనలేని సేవలందించారని గుర్తుచేశారు. అలాంటి పార్టీ ఇప్పుడు కొంతమంది ముఠాకోరుల చేతుల్లోకి వెళ్లిందని, పార్టీ కోసం కష్టపడుతున్న నేతలకు కాంగ్రెస్‌లో అన్యాయం జరుగుతోందని హరీష్‌రావు తెలిపారు. విష్ణువర్ధన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నామన్న హరీష్‌రావు.. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌లో తనకు ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదని విష్ణువర్ధన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీలోకి రావాలని పిలిచినా.. తమ రక్తంలో కాంగ్రెస్‌ ఉందని రాలేమని చెప్పామని విష్ణువర్ధన్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. తన తండ్రి 35 ఏళ్లు కాంగ్రెస్‌కు సేవ చేశారని, తాను 17 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నానని చెప్పారు. రెండో జాబితాలో తన పేరు ఉంటుందని భావించానని, కానీ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యానన్నారు. హరీష్‌రావు, కేటీఆర్‌, కవిత, అనిల్‌ తనను గుర్తించి పార్టీలోకి ఆహ్వానించినట్లు చెప్పారు. ఇప్పుడున్న నాయకులు త్వరలో గాంధీవన్‌ను కూడా అమ్మేస్తారని, అలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే తెలంగాణను అమ్మేస్తారన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానించినందుకు బీఆర్‌ఎస్‌ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు విష్ణువర్ధన్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories