నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం: కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు దగ్ధం!

భాగ్యనగరంలోని నాంపల్లిలో ఉన్న స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Arun Chilukuri
Published on: 7 Feb 2026 4:59 PM IST
నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం: కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు దగ్ధం!
X

భాగ్యనగరంలోని నాంపల్లిలో ఉన్న స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కీలకమైన సాక్ష్యాధారాలు, పత్రాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మరియు డీఎఫ్ఓ శ్రీదాస్ వివరాలను వెల్లడించారు.

ఉదయం 10 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భవనం మొదటి అంతస్తులో ఉన్న 'సీజ్డ్ ప్రాపర్టీ' (Seized Property) విభాగంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ పలు సంచలనాత్మక కేసులకు సంబంధించిన పత్రాలు, కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు భద్రపరుస్తారు. మంటల ధాటికి ప్లాస్టిక్ వస్తువులతో పాటు విలువైన డాక్యుమెంట్లు ఆహుతయ్యాయి.

ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో నలుగురు ఉద్యోగులు ఉన్నారు. మంటలను గమనించిన వెంటనే ఆఫీస్ బోయ్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా, పొగ పీల్చడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మిగిలిన సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

డీఎఫ్ఓ శ్రీదాస్ మాట్లాడుతూ.. "మొదటి అంతస్తులో హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు మంటల్లో చిక్కుకున్నాయి. అవి పూర్తిగా కాలిపోయాయా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయా అనేది పరిశీలించాల్సి ఉంది. అయితే రెండో అంతస్తులో ఉన్న కెమికల్ ల్యాబ్‌కు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేయగలిగారు" అని తెలిపారు.

ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అయితే, ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన ఈ ప్రమాదం వల్ల కీలక కేసుల విచారణపై ఎలాంటి ప్రభావం పడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story