మొదలైన శుభకార్యాల సీజన్‌.. మూడు నెలల పాటు..

Arun Chilukuri
Published on: 29 Oct 2020 10:59 AM IST
మొదలైన శుభకార్యాల సీజన్‌.. మూడు నెలల పాటు..
X

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలుకానుంది. ఇకపై మూడు నెలల పాటు సుముహూర్తాలు ఉండటంతో జనం శుభకార్యాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అటు కొన్ని నెలలుగా ఆశగా ఎదురుచూస్తున్న ఫంక్షన్‌ హాల్స్ నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కొవిడ్ దెబ్బకు మూతపడిన కళ్యాణ మండపాలు తిరిగి ముస్తాబవుతున్నాయి. శుభకార్యాల సీజన్‌ ప్రారంభం అవటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు యజమానులు. మార్చి నెలాఖరు నుంచి కొద్దిమందితోనే పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉండటంతో వివాహాల సంఖ్య తగ్గిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కాస్త కోలుకోవటం ఫంక్షన్ హాళ్లకు అనుమతి రావటంతో వైభవంగా వివాహ వేడుకలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.

ఇప్పటినుంచి మూడు నెలల దాకా శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి. 2021 జనవరి రెండో వారం నుంచి నాలుగు నెలలపాటు ముహూర్తాలకు బ్రేక్‌ పడనుండడంతో ఈ సీజన్‌లోనే శుభకార్యాలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. అక్టోబర్‌ 29, 30, 31 నవంబరు 4, 11 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయంటున్నారు పండితులు. ఆ తర్వాత కార్తీక, మార్గశిర మాసాల్లోనూ ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. 2021 జనవరి 2, 7 తేదీల్లో మంచి ముహూర్తాలుండగా జనవరి 16 నుంచి మౌఢ్యమి కారణంగా నాలుగు నెలల గ్యాప్ రానుంది.

ఇక లాక్ డౌన్ కారణంగా ఆర్ధికంగా దెబ్బతిన్న ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ప్రస్తుత శుభముహర్తాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొవిడ్ నిబందనలు పాటిస్తు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నారు. అయితే ఆరు నెలలుగా ఫంక్షన్ హాల్ తెరవకపోవడంతో చాలా వరకు ఫర్నిచర్ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జనమంతా శుభకార్యాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. కరోనా ఇంకా పోలేదనే విషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story