Manda Krishna Madiga: మాదిగలకు రేవంత్ రెడ్డి మొండిచేయి.. రాజ్యసభ ఎంపికలో మోసం

Manda Krishna Madiga: మాదిగలకు రేవంత్ రెడ్డి మొండిచేయి.. రాజ్యసభ ఎంపికలో మోసం
Manda Krishna Madiga: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంద కృష్ణ మాదిగ నిప్పులు. రాజ్యసభ ఎంపికలో మాదిగలకు మొండిచేయి చూపారని విమర్శ. కోదాడ లాకప్ డెత్, ఎస్సీ వర్గీకరణ అంశాలపై కాంగ్రెస్ సర్కార్‌పై ధ్వజం.
Manda Krishna Madiga: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగ సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేస్తున్నాయని ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యసభ స్థానాల ఎంపికలో మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించకుండా ప్రభుత్వం తన సహజత్వాన్ని చాటుకుందని ఆయన విమర్శించారు.
రాజ్యసభకు ఒక్క మాదిగను కూడా ఎంపిక చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మంద కృష్ణ ఆరోపించారు. ఇప్పటికే లోక్ సభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేదని, ఇప్పుడు రాజ్యసభలోనూ అదే వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ఎదుగుదలకు మాదిగలు అండగా నిలిచారని చెప్పే రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక వారిని అణిచివేస్తున్నారని మండిపడ్డారు. తన స్నేహితుడైన వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపాలని చూడటం మాదిగలకు చేస్తున్న అవమానమని పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మంద కృష్ణ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు వెనక్కి తగ్గారని ఆరోపించారు. మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగలకు కేవలం 9 శాతం రిజర్వేషన్లు మాత్రమే కేటాయించి రేవంత్ రెడ్డి అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.
కోదాడ లాకప్ డెత్ పై మౌనం దేనికి?
కోదాడలో కర్ల రాజేష్ అనే మాదిగ యువకుడు పోలీసుల చిత్రహింసల వల్ల చనిపోయినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఎస్సై సురేష్ రెడ్డిని కాపాడేందుకే ఈ మౌనం వహిస్తున్నారని ఆరోపించారు.
గతంలో మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి పోలీసులను తొలగించి, ఆ కుటుంబాన్ని ఆదుకుందని.. కానీ రేవంత్ సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను మభ్యపెట్టి అణిచివేతకు గురిచేస్తోందని, దీనిపై తాము పోరాటం కొనసాగిస్తామని మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



