జూపల్లికి చుక్కలు చూపిస్తోంది ఎవరు?

జూపల్లికి చుక్కలు చూపిస్తోంది ఎవరు?
x
Highlights

ఎమ్మెల్యేగా ఆయన చక్రంతిప్పారు. మంత్రిగా దుమ్మురేపారు. స్ట్రాంగ్‌ లీడర్‌గా బలమైన నాయకులతో ఢీ అంటే ఢీ అన్నారు. నియోజకవర్గానికి రారాజుగా ఒక వెలుగు...

ఎమ్మెల్యేగా ఆయన చక్రంతిప్పారు. మంత్రిగా దుమ్మురేపారు. స్ట్రాంగ్‌ లీడర్‌గా బలమైన నాయకులతో ఢీ అంటే ఢీ అన్నారు. నియోజకవర్గానికి రారాజుగా ఒక వెలుగు వెలిగారు. సీన్‌ కట్‌ చేస్తే, ఇఫ్పుడాయన పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఒక్క ఓటమితో ఆ‍యన రాజకీయ జీవితమే తలకిందులైంది. ప్రత్యర్థులు కాదు, సొంత పార్టీ నేతలే, ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఒంటరిని చేసి చుక్కలు చూపిస్తున్నారు.

జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎదురులేని నాయకుడిగా హవా చాటిన లీడర్. కానీ ఇప్పుడాయన గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఒక్క ఓటమి ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంలోకి నెట్టేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంత్రి పదవిలో, తోటి సహచర మంత్రి డికే అరుణతో ఢీ అంటే ఢీ అన్న జూపల్లి ఆ తర్వాత మంత్రి పదవికీ, కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీలోను మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక నాటి నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఈ దశలోనే సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి జిల్లాలో అన్నీ తానై వ్యవహరించారు జూపల్లి. ఈ క్రమంలోనే ఆయన అప్పట్లో సొంతపార్టీలోనే కొంతమంది సహచర నాయకులతో వివాదాలను కొని తెచ్చుకున్నారు. మంత్రి హోదాలో ఉన్న తనకు తిరుగులేదని భావించిన జూపల్లికి, 2018లో జరిగిన ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు అనూహ్యమైన తీర్పునిచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కారు గుర్తు అభ్యర్థులు అత్యధికం గెలవగా, ఒక్క జూపల్లి మాత్రమే ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిని అప్పట్లో మామూలు విషయంగానే తీసుకున్న జూపల్లి క్రమేనా ఆ ఓటమి తన రాజకీయ భవిశ్యత్తుకు బీటలు వేస్తోందన్న సత్యాన్ని ఆలస్యంగా గ్రహించానని ఫీలవుతున్నారు.

ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బంది పడిన వారందరూ, ఇప్పుడు జూపల్లికి కొరకరాని కొయ్యలా తయారయ్యారు. ఇందులో ప్రధానంగా జూపల్లి మీద గెలిచి టీఆర్ఎస్ లో చేరిన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి ఒకరైతే మరొకరు మంత్రి నిరంజన్ రెడ్డిలు. ఈ ఇద్దరూ కలిసి కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లికి చుక్కలు చూపిస్తున్నారట.

ప్రస్తుత మంత్రి నిరంజన్ రెడ్డి జూపల్లిపై తీవ్ర కసితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో జూపల్లి మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ది పథకాలను, శంఖుస్థాపనలకే పరిమితం చేసినట్టు సమాచారం. జూపల్లి కృష్ణారావు గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు, కొత్తకోట మండలంలోని కనిమెట్ట - పాత జంగమాయపల్లి , అప్పరాల - తిప్పడం పల్లి గ్రామాల నడుమ ఉన్న వాగుపై, వంతెనల కొరకు శంఖు స్థాపనలు చేశారు. ఆ రెండు శంఖుస్థాపనలు కూడా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.

అందులో మొదటిది కనిమెట్ట - పాత జంగమాయ పల్లి బ్రిడ్జి నిర్మాణం కొరకు, 2017 జులై 12న రెండున్నర కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తూ పెద్ద ఎత్తున శంఖుస్థాపన చేశారు. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ సైతం పనులు ప్రారంభించి పునాదుల కోసం గుంతలు తవ్విన తరువాత, అంచనాలకు మించి ఖర్చు అవుతుందని కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. అయితే మళ్లీ అధికారులను పిలిచి నూతన అంచనా ప్రకారం ఆరు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే నిర్మాణం పూర్తి అవుతుందని మళ్ళీ ఫైల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపామని తెలిపారు. కానీ ఇప్పటివరకు ప్రొసీడింగ్ వచ్చింది లేదు, కాంట్రాక్టర్‌ను నియమించింది లేదు. ఇందుకు కారణం జూపల్లి శంకుస్థాపన చేయడమే అన్నది సర్వత్రా వినిపిస్తోంది.

కాగా ఉమ్మడి జిల్లాలో మంత్రిహోదాలో జూపల్లి కృష్ణారావు ప్రారంభించిన చాలా పనులు ఇలా పెండింగ్‌లోనే ఉన్నాయి. జూపల్లిని రాజకీయంగా ఇతర పార్టీల కంటే సొంత పార్టీ వాళ్లే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని నాగర్ కర్నూల్ జిల్లా నేతాగణం కోడై కూస్తోంది. ఓ పక్క ఎమ్మెల్యే వర్గీయులు జూపల్లి బీజేపిలో చేరతారని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. దీంతో జూపల్లి తాను ఏ పార్టీలోకీ వెళ్లడం లేదని మీడియా ముందు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పార్టీ మారతానని పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడతానని జూపల్లి హెచ్చరించారు. మొత్తానికి 2018లో జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటమి,జూపల్లిని ఎన్ని కష్టాలకు గురిచేస్తోందో జరుగుతున్న పరిణామాలే నిదర్శమన్న మాటలు వినిపిస్తున్నాయి. గులాబీ అధినేత ఏదో ఒక నామినేట్ పదవి ఇస్తే తప్ప, జూపల్లికి సొంత నియోజకవర్గంలో, జిల్లాలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేదన్న చర్చ జరుగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories