Huzurabad: హుజూరాబాద్​లో మద్యం అమ్మకాల జోరు.. కోట్లలోనే..!

Liquor Record Sales in Huzurabad Constituency
x

Huzurabad: హుజూరాబాద్​లో మద్యం అమ్మకాల జోరు.. కోట్లలోనే..!

Highlights

Huzurabad: బైపోల్‌ జరిగే హుజురాబాద్‌‌లో మద్యం ఏరులై పారుతోంది.

Huzurabad: బైపోల్‌ జరిగే హుజురాబాద్‌‌లో మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ మద్యం అమ్మకాలు మరింత పెరిగాయి. మద్యం సరిపోకపోవడంతో బయటినుంచి కూడా తెప్పించి అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలక్షన్ హీట్ పీక్ స్టేజ్‌కు చేరింది. అంతే స్థాయిలో మద్యం అమ్మకాలు సైతం రికార్డు సృష్టిస్తున్నాయి. మందు చాలక పక్క జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మొత్తం 29 దుకాణాలలో గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు రూ.125 కోట్ల మద్యం అమ్ముడుపోగా 2021లో రూ.170 కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాదికన్నా సుమారు రూ.45 కోట్ల వ్యాపారం అధికంగా జరిగింది. ఒక్క కరీంనగర్ జిల్లా మొత్తం రూ.320 కోట్ల వ్యాపారం జరగ్గా 55శాతం అమ్మకాలు హుజురాబాద్ లో జరగడం గమనార్హం.

ఉప ఎన్నికకు టైమ్ దగ్గర పడుతోన్న నేపథ్యంలో లిక్కర్ సేల్స్ మరింత పెరుగుతాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే తాము మాత్రం బెల్ట్ షాపులను మూసేశామని, మరోవైపు లిక్కర్ ప్లాంట్ నుంచి వైన్స్ కు సరఫరా చేసే మద్యం విషయంలోనూ కొంత నియంత్రణ పాటిస్తున్నామని అధికారులు చెప్పారు.

మద్యం కోసం నాయకులు ఏకంగా కార్యకర్తలకు మద్యం, మాంసం చిట్టీలు ఇస్తున్నారు. దీంతో ప్రచారం ముగిసిందంటే చాలు నియోజకవర్గంలో ఉన్న బెల్టు షాపుల నుండి వైన్స్‌ షాపులు, బార్లు పూర్తిగా నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో మద్యంబాబులు తాగి పడేసిన బాటిల్స్ ఏకంగా ప్రతీరోజూ తొమ్మిది లారీలకు పైగా నిండుతున్నట్లుగా సమాచారం. హుజురాబాద్ లో మద్యం ఏరులై పారడం రాజకీయంగా కొంత ఇబ్బందేనని రాజకీయనేతలు, పరిశీలకులు అంటున్నారు. మొత్తమ్మీద హుజురాబాద్ లో ఉప ఎన్నికల పుణ్యమాని ఊళ్లుఊళ్లన్నీ తాగి ఊగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories