నిజామాబాద్‌ జిల్లా ఇందూరులో సరికొత్త భూ దందా!

Land Scam in Nizamabad District Induru
x

నిజామాబాద్ జిల్లలో భారీ భూ దందా (ప్రతీకాత్మక చిత్రం)

Highlights

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఇందూరులో సరికొత్త భూ దందా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం పేదలకు పంచిన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి భూకబ్జాలకు తెరలేపారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల పట్టాలకు అసలు లబ్ధిదారుల జాగాలో నకిలీలు పాగా వేశారు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఇందూరులో సరికొత్త భూ దందా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం పేదలకు పంచిన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి భూకబ్జాలకు తెరలేపారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల పట్టాలకు అసలు లబ్ధిదారుల జాగాలో నకిలీలు పాగా వేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఈ అక్రమ దందాకు తెరలేవగా.. ఇప్పుడు భూకబ్జాల అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. భూ కబ్జాల వెనుక కొందరు అధికార పార్టీ నేతలు ఉండటంతో.. అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదని బాధితులు లబోదిబోమంటున్నారు. నాగారం భూకబ్జాల అంశంపై స్పెషల్‌ స్టోరీ.

సర్కార్‌ జారీ చేసిన పట్టాలకు నకిలీ పత్రాలు సృష్టించి.. కొందరు భూములను అమ్మకానికి పెట్టారంటూ ఓ బాధితుని ఆవేదన. ఇలాంటి బాధితులు అక్కడ వందల సంఖ్యలో ఉన్నారు.

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని నాగారంలో.. అక్రమ పట్టాల పేరుతో కొత్తరకం భూకబ్జాల బాగోతం తెరమీదకు వచ్చింది. నాగారం ప్రాంతంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు పట్టాలను పంపిణి చేసింది. బీడి కార్మికులు, నిరుపేదలకు అక్కడ 60 గజాల చొప్పున భూమికి పట్టాలిచ్చారు. కొందరు ఆర్థిక స్థోమత బాగుండి ఇళ్లు కట్టుకోగా.. మరికొందరు తమకు పట్టాలు ఉన్నాయనే భరోసాతో మిన్నకుండిపోయారు. అయితే లాక్‌డౌన్ సమయంలో కొందరు అక్రమార్కులు ఆ భూములపై కన్నేసి నకిలీ పట్టాలు సృష్టించారు. పేదల భూములను అమ్మకానికి పెట్టేశారు. ఇలా వందల మంది బాధితులు పట్టాలు చేతుల పట్టుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

జిల్లా కేంద్రంలో అసలు పట్టాలకు నకిలీ పట్టాలు తయారు చేస్తూ.. ఒకే స్ధలాన్ని నలుగురికి అమ్మేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో పేదల భూములు కబ్జాకు గురవుతున్నాయని.. నాగారంలో జరిగే భూకబ్జాలపై విచారణ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ఒకే స్ధలానికి ఇద్దరు ముగ్గురు యజమానులు వచ్చి.. స్ధలం నాదంటే నాదంటూ పేచీ పెడుతూ.. అధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నా.. పట్టించుకోవడం లేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.తమకు ఇచ్చిన పట్టాలకు భూమి చూపించాలని బాధితులు కోరుతున్నారు.

ఇక ఈనేపథ్యంలో నాగారంలో భూ కబ్జాలపై బీజేపీ ప్రత్యక్ష పోరుకు సిద్దమవుతోంది. ఈ పాటికే నాగారంలో బీజేపీ నేతల బృందం పర్యటించి బాధితులతో ముఖాముఖి ఏర్పాటు చేసింది. కబ్జాల వెనుక ఉన్న అధికార పార్టీ నేతలపై విచారణ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

నాగారంలో వెలుగు చూసిన నకిలీ పట్టాల స్కాంపై.. అధికారులు దృష్టి సారించాలని ప్రజా సంఘాలు, లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. సర్కారు ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే భూ కబ్జాలపై దృష్టి పెడుతుందని బాధితులు ఆశాబావం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories