మెగాస్టార్‌ బాటలో లేడీ సూపర్‌స్టార్?

మెగాస్టార్‌ బాటలో లేడీ సూపర్‌స్టార్?
x
చిరంజీవి, విజయశాంతి
Highlights

లేడీ సూపర్‌ స్టార్‌, మెగాస్టార్‌ రూట్‌లో పయనించాలని డిసైడవుతున్నారా? రాజకీయాలకు ప్యాకప్ చెప్పి, సినిమాలకు మేకప్ వేసుకున్న చిరంజీవి బాటలో నడవాలని,...

లేడీ సూపర్‌ స్టార్‌, మెగాస్టార్‌ రూట్‌లో పయనించాలని డిసైడవుతున్నారా? రాజకీయాలకు ప్యాకప్ చెప్పి, సినిమాలకు మేకప్ వేసుకున్న చిరంజీవి బాటలో నడవాలని, ఫైర్‌ బ్రాండ్‌ రాములమ్మ ఆలోచిస్తున్నారా? కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా మారడం, మరో సినిమాకు సైతం సైన్ చేశారన్న పరిణామాలే అందుకు నిదర్శనమా? విజయశాంతి రాజకీయ ప్రస్థానం ఎటు సాగుతోంది?

చిరంజీవి. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మెగాస్టార్‌లా ఏలుతున్న హీరో. విజయశాంతి. కొన్ని దశాబ్దాల పాటు లేడీ సూపర్‌ స్టార్‌గా తెలుగు తెర మీద చెలరేగిపోయిన హీరోయిన్. ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి, దాన్ని కాంగ్రెస్‌లో కలిపి, ఎంపీగా, కేంద్రమంత్రిగా వ్యవహరించి, ఇప్పుడు రాజకీయాలన్నీ వదిలేసి, సినిమాలపైనే దృష్టిపెట్టారు. దాదాపు పాలిటిక్స్‌కు ప్యాకప్ చెప్పేశారు చిరంజీవి.

విజయశాంతి సైతం రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. బీజేపీలో ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌గా ఎదిగారు. బీజేపీ నుంచి బయటకు వచ్చి, సొంత పార్టీ పెట్టారు. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. చివరికి టీఆర్ఎస్‌కు సైతం గుడ్‌ బై చెప్పి, కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడామె కాంగ్రెస్‌లోనే వున్నారు. కానీ క్రియాశీలకంగా మాత్రం లేరు. సరిలేరు నీకెవ్వరుతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. మరో సినిమాకు సైతం సైన్ చేశారట రాములక్క.

విజయశాంతి కూడా రాజకీయాలకు గుడ్‌ బై చెప్పి , చిరంజీవి బాటలోనే సినిమాల్లో యాక్టివ్‌ కాబోతున్నారా అన్న చర్చ మొదలైంది. గతంలో ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చినా, రాజకీయాల మీదే తాను పూర్తిగా దృష్టిపెట్టానన్న విజయశాంతి, ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుతో వెండితెరపై మళ్లీ మెరిశారు. దీంతో ఆమె రాజకీయాలకు దూరం జరిగారా లేదంటే విరామంలో సినిమాలు చెయ్యాలని డిసైడయ్యారా అన్న అంశాలపై వాడివేడిగా చర్చ జరుగుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ విజయశాంతి. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ లేడి డాన్‌లా వ్యవహరించి అందరి మన్నలు పొందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా, పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించడం లేదని గాంధీభవన్‌లో వినిపిస్తున్న చర్చ. ప్రస్తుతం ఆమె మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టి, రాజకీయాలకు సమయం తగ్గించారు. కాని టి కాంగ్రెస్ నేతలు తనను పట్టించుకోకపోవడం వల్లే, పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉన్నట్లు స్వయంగా సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో సీనియర్లు తనను పొమ్మనలేక పొగపెడుతున్నారని కూడా, రాములమ్మ వాపోతున్నారట.

అయితే, హస్తం పార్టీలో అసంతృప్తిగా ఉన్న రాములమ్మను, కాషాయ కండువా కప్పి, సొంతపార్టీ గూటికి తీసుకురావడానికి బిజేపి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా చర్చ జరిగింది. కాంగ్రెస్‌లో మెజార్టీ సీనియర్లంతా బిజేపి వైపు చూస్తుండటంతో, సినిమా గ్లామర్‌తో పాటు రాజకీయ ఇమేజ్ ఉన్న రాములమ్మను స్వగృహ ప్రవేశం చేయించాలని బిజేపిలో అగ్రనాయకత్వం సీరియస్‌గా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం సాగింది. కానీ ఈ ప్రచారాన్ని రాములమ్మ చాలాసార్లు ఖండించారు.

అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి వల్లే, తమిళనాడులో శశికళ ఇబ్బందుల్లో పడ్డారనే ప్రచారం ఉంది. ఆమెతో అత్యంత సన్నిహితంగా ఉండే విజయశాంతి, గతంలోనే శశికళపై సానుభూతి చూపారు. ఈ నేపథ్యంలో, తన స్నేహితురాలిని కటకటాల పాలు చేసిన బిజేపి గూటికి విజయశాంతి చేరతారో లేదోనన్న అనుమానం ముందు నుంచీ వుంది. ఎందుకంటే, గతంలో చిన్నమ్మను ఇబ్బంది పెట్టిన బిజేపిలోకి వెళ్లేది లేదంటూ బహిరంగంగా ప్రకటన చేశారు విజయశాంతి. దీంతో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకుంటారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు విజయశాంతి సన్నిహితులు. అటు కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా లేరు, ఇటు రారమ్మంటున్న బీజేపీలోకీ వెళ్లనంటున్నారు రాములమ్మ. అందుకే చిరంజీవి బాటలో రాజకీయాలకు పూర్తిగా గుడ్‌ బై చెబుతారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి.

మొత్తానికి సరిలేరు నీకెవ్వరు మూవీతో విజయశాంతి సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడం, కాంగ్రెస్‌కు దూరంగా ఉండటంతో, ఆమె రాజకీయ ప్రస్థానంపై అభిమానులు, కార్యకర్తల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి, ఆమె సినిమాలకు ఒప్పుకున్నారని, త్వరలో మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకం అవుతారని, గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. విజయశాంతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రానున్న కాలమే సమాధానం చెప్పాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories