Top
logo

కోమటిరెడ్డి దేనికైనా రెడీ.. సీనియర్లు గుర్తు చేసుకుంటున్న ఆ టాపిక్‌ ఏంటి?

Komati Reddy Brothers Target Revanth Reddy
X

కోమటిరెడ్డి దేనికైనా రెడీ.. సీనియర్లు గుర్తు చేసుకుంటున్న ఆ టాపిక్‌ ఏంటి?

Highlights

Komati Reddy Brothers: తెలంగాణ కాంగ్రెస్‌కు ఆ కుటుంబం ఆయువుపట్టులాంటిది.

Komati Reddy Brothers: తెలంగాణ కాంగ్రెస్‌కు ఆ కుటుంబం ఆయువుపట్టులాంటిది. కానీ కొద్దిరోజులుగా ఆ ఫ్యామిలీ హస్తంతో అంటీ ముట్టనట్టు ఉంటోంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై వివాదంతో సహాయ నిరాకరణను కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్‌ లైట్‌ తీసుకున్నా స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆ జిల్లాపై ఆ ఫ్యామిలీ పట్టేంటో గుర్తించినట్టుంది!! ఆ జిల్లాలో పోటీకి దిగాలని నామినేషన్ల చివరి రోజు వరకు హస్తం పార్టీ కీలక నేతలు ఆ కుటుంబంతో చర్చలు జరిపినా ఫలితం లేకుండాపోయిందట. గట్టి పోటీనిచ్చే బలమున్నా పార్టీ బరి నుంచి తప్పుకోవడంపై రకరకాల అభిప్రాయలు వినిపిస్తున్నాయి. ఇంతకీ పార్టీలో అంతగా బలమున్న ఆ కుటుంబం ఏది?

కోమటిరెడ్డి బ్రదర్స్ రాష్ట్రవ్యాప్తంగా మాస్ లీడర్లుగా పేరున్న నాయకులు. వాళ్ల సొంత జిల్లా అయిన నల్లగొండలో ఎవ్వరికి లేనంత పట్టు ఈ అన్నదమ్ములకు ఉంది. కాంగ్రెస్‌ గడ్డు కాలంలో ఉన్నప్పుడు ఈ బ్రదర్స్‌ ఏకమై పార్టీని పరుగులు పెట్టించారు. హస్తం అస్తవ్యస్థంగా కొనసాగుతున్న రోజుల్లో కూడా అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీగా తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసి తమకున్న వ్యక్తిగత పలుకుబడితో గెలుపొందారు. అయితే రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ అయ్యాక కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పీసీసీ పదవిని రాకపోవడంతో అలిగిన వెంకట్‌రెడ్డి వీలు దొరికినప్పడల్లా రేవంత్‌పై రెచ్చిపోయేవారు. పోటీలో ఉన్న వారితో కనీసం చర్చింకుండా అధిష్టానం ఏకపక్షంగా కొత్త పీసీసీని ప్రకటించడాన్ని ఈ బ్రదర్స్‌ డైజెస్ట్‌ చేసుకోలేకపోయారు. కొత్త పీసీసీ ఎంపిక నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఎక్కడా హాజరు కాకుండా కేవలం వారి, వారి నియోజికర్గాలల్లో సమస్యలు జిల్లా సమస్యలపైనే పోరాటం చేస్తూ వస్తున్నారు.

అయితే, రాష్ట్ర పార్టీ ఇప్పటివరకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ను లైట్‌గా తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు వాళ్లు వచ్చినా రాకున్నా పెద్దగా పట్టించుకోలేదు. కానీ సీన్‌ కట్‌ చేస్తే స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సరికి నల్గొండ జిల్లా పోటీపై కోమటిరెడ్డి బ్రదర్స్‌ను సంప్రదించాల్సి వచ్చిందట. వాళ్లిద్దరూ అంగీకరిస్తేనే కానీ, అక్కడ పార్టీ అభ్యర్థిని ఎన్నికల రంగంలోకి దించలేని పరిస్థితి వచ్చిందని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఉన్నా కోమటిరెడ్డి బ్రదర్స్ అంగీకారం తప్పనిసరన్న ప్రచారం సాగుతోంది. కానీ అక్కడే పరిస్థితి ఇంకోలా మారిందట.

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్‌ చివరి రోజు వరకు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండ జిల్లాలో పోటీకి తాము సహకరించలేమని పదే పదే చెప్పడంతో అధిష్టానం చేతులెత్తయ్యాల్సి వచ్చిందని పార్టీలో కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి బంధువును పోటీలో నిలపడానికి ఒప్పుకున్నా బ్రదర్స్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో వెనుకడుగు వేయాల్సి వచ్చిందట. కోమటిరెడ్డి అన్నదమ్ములు ఒప్పుకొని ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో, టీఆర్ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ గట్టిగా నిలబడి ఉండేదని, ప్రత్యర్థులు ఎవరికైనా ముచ్చెమటలు పట్టేవన్న టాక్‌ వినిపిస్తోంది. గతంలో నల్గొండ ఎమ్మెల్సీకి ఉపఎన్నిక వచ్చినప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భార్య లక్ష్మీరెడ్డిని రంగంలో దించి, అధికార పార్టీని హైరానా పెట్టించిన సంగతిని పార్టీలో కొందరు సీనియర్లు గుర్తు చేసుకుంటున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో, నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఉన్న ప్రయారిటీని గుర్తించి, వారి సమస్యను పరిష్కరించకుంటే, రాజకీయంగా హస్తం పార్టీకి భారీ నష్టమే జరుగుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డిలాంటి ఉద్దండ రాజకీయ నేతలు ఉన్నా పార్టీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ని దూరం చేసుకుంటే చాలా కష్టమన్న భావన వ్యక్తమవుతోంది. మరి కాంగ్రెస్‌ అధిష్టానం ఈ సమన్వయ లోపాన్ని ఎలా సరిదిద్దుతుందో, సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

Web TitleKomati Reddy Brothers Target Revanth Reddy
Next Story