గ్రేటర్ ప్రచార బరిలోకి అగ్రనేతలు

గ్రేటర్ ప్రచార బరిలోకి అగ్రనేతలు
x
Highlights

గ్రేటర్ ఎన్నికల్లో ఇక అసలు సిసలు పోరు మొదలుకానుంది. నామినేషన్ల పర్వం ముగియటంతో ప్రజాక్షేత్రంలో ప్రచారాలు ముమ్మరం చేయనున్నాయి పార్టీలు. మేయర్ పీఠంపై...

గ్రేటర్ ఎన్నికల్లో ఇక అసలు సిసలు పోరు మొదలుకానుంది. నామినేషన్ల పర్వం ముగియటంతో ప్రజాక్షేత్రంలో ప్రచారాలు ముమ్మరం చేయనున్నాయి పార్టీలు. మేయర్ పీఠంపై కన్నేసిన ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు స్టార్ కాంపెయినర్‌లను రంగంలోకి దించుతున్నాయి.

గ్రేటర్ ఎన్నికల నామినేషన్లు ముగియటంతో ప్రచారంపై దృష్టి సారించాయి పార్టీలు. ఐదేళ్లలో తాము సాధించిందేంటో ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికార టీఆర్ఎస్ భావిస్తుండగా ఎలాగైనా ఈ సారి గ్రేటర్ పీఠం కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నాయి విపక్షాలు.

గత ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచిన అధికార టీఆర్ఎస్‌ పార్టీ ఈ సారి సెంచరీ దాటించే దిశగా పావులు కదుపుతోంది. మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావు స్టార్‌ కాంపెయినర్లుగా వ్యవహరించనుండటం ఆ పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నాయి గులాబీ శ్రేణులు. ఇక సీఎం కేసీఆర్‌ కూడా స్వయంగా రంగంలోకి దిగుతుండటం ఆ పార్టీకి మరింత ప్లస్ కానుంది.

ఇక గ్రేటర్‌లో హవా చూపాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ టీఆర్ఎస్‌కు దీటుగా ప్రచారాలు చేసేందుకు సిద్ధమైంది. స్టార్ క్యాంపెయినర్‌లుగా జాతీయ నేతలను సైతం రంగంలోకి దింపుతోంది ఆ పార్టీ. ఇప్పటికే బండి సంజయ్ తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర నేతలు లక్ష్మణ్, డీ.కె. అరుణ ప్రచార బరిలో దించగా కేంద్ర మంత్రులు కూడా ప్రచారానికి రానున్నారు. ప్రచారం ముగింపు రోజు కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, ప్రకాష్ జవడేకర్లతో పాటు బీజేపీ యువజన విభాగం బాధ్యతలు చూసుకునే తేజస్వి సూర్య కూడా రానున్నారు. దీంతో గ్రేటర్‌లో పట్టు కోసం ప్రయత్నిస్తోన్న బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం ఎంతమేరకు కలిసొస్తుందనేది చూడాలి మరి.

ఇక కాంగ్రెస్‌‌ పార్టీ తరపున సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గ్రేటర్ ప్రచారంలో కీలకం కానున్నారు. అయితే దుబ్బాకలో వీరి ప్రచారం గెలుపు కట్టబెట్టలేకపోయింది సరికదా కనీస పోటీనిచ్చేలా కూడా ఉపయోగపడలేదు. దీంతో గ్రేటర్ లో అయినా వారి ప్రచారం పార్టీకి మైలేజ్‌ తెచ్చిపెడుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories