Top
logo

కార్పొరేటర్లలో దడ పుట్టిస్తున్న కేసీఆర్ సర్వే ఏంటి?

కార్పొరేటర్లలో దడ పుట్టిస్తున్న కేసీఆర్ సర్వే ఏంటి?
X
Highlights

కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న ఖమ్మం నగరంలో, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరుపై టీఆర్ఎస్‌ బాస్ గుట్టుగా చేయించిన సర్వే రిపోర్ట్, కలకలం రేపుతోంది.

కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న ఖమ్మం నగరంలో, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరుపై టీఆర్ఎస్‌ బాస్ గుట్టుగా చేయించిన సర్వే రిపోర్ట్, కలకలం రేపుతోంది. గులాబీ కార్పొరేటర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఎవరి జాతకం ఎలా తేలిందో ఎవరికి టికెట్‌ దక్కుతుందో దక్కదో తెలియక, లోకల్‌ నేతలు దిక్కులు చూస్తున్నారట. అసలు కేసీఆర్ చేయించిన సర్వేలో ఏం తేలింది? ఎంతమందికి గుడ్‌, ఎంతమందికి బ్యాడ్‌ రిపోర్ట్‌ వచ్చింది? కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతను తీసుకున్న మంత్రి పువ్వాడ, గ్రౌండ్ వర్క్ ఏంటి?

ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలపై దృష్టి సారించింది అధికార టీఆర్‌ఎస్‌. నగర ఓటర్ల మనోభావాలను తెలుసుకునేందుకు ఒక అడుగు ముందుకేసింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అత్యంత గోప్యంగా చేయించిన అంతర్గత సర్వే, ఇపుడు కార్పొరేటర్లు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 2016 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వశమైంది ఖమ్మం కార్పొరేషన్‌. త్వరలో జరిగే ఎన్నికల్లోనూ ఖిల్లాపై పట్టు సాధించాలని పార్టీ అధిష్టానం సీరియస్ గా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇక సిట్టింగులు, కొత్త ముఖాలు, అసంతృప్తి ఉన్న ప్రాంతాలేమిటనే అంశాలపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 50 డివిజన్లకు 34 డివిజన్లలో విజయం సాధించింది. నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులను కైవసం చేసుకుంది. అయితే త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 3 వరకు, ప్రతి డివిజన్‌లో సర్వే చేసిన బృందం, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రతి డివిజన్‌లో 170 నుంచి 180 మందిని కలిసి ఇలా 8,754 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ప్రభుత్వ పనితీరు, నగరాభివృద్ధిపై ప్రజల్లో సానుకూలత, కొన్నిచోట్ల కార్పొరేటర్ల పనితీరుపై నెలకొన్న అసంతృప్తి సైతం వెల్లడైనట్లు తెలుస్తోంది.

50 డివిజన్లలో నిర్వహించిన సర్వేలో 10 మందిపై మాత్రమే గుడ్ రిపోర్ట్ వచ్చిందట. మరో 15 మందిపై యావరేజ్ రిపోర్ట్ వచ్చినట్లుగా పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మిగిలిన 25 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ బలంగానే ఉన్నా, కొందరు కార్పొరేటర్లు ల్యాండ్ సెటిల్ మెంట్లు, భూ దందాలు చట్ట విరుద్ధంగా నిర్వహించిన కార్యకలాపాలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపినట్లు సర్వేలో వెల్లడైందని పార్టీ శ్రేణుల్లో బహిరంగంగానే చర్చ సాగుతోంది. అయితే సర్వే ఫలితాలు పార్టీ అధినేత కేసీఆర్‌కు చేరడం, నగరంలో పార్టీ పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై చేసిన సర్వే గురించి సీఎం కేసీఆర్‌, మంత్రి అజయ్‌తో ఫోన్‌లో ప్రస్తావించి మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. దీంతో త్వరలో జరగనున్న నగర పాలక సంస్థ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, తన నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారట.

అలాగే నగర కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో, కొత్త ముఖాలకు సైతం పార్టీ తరఫున అవకాశం లభించనుంది. దాదాపు పది డివిజన్లు కొత్తగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత కార్పొరేటర్లలో ప్రజా వ్యతిరేక ఉన్నవారిని, తిరిగి పోటీలో నిలిపేందుకు అధిష్టానం అనాసక్తిగా ఉండటంతో, వారి స్థానాల్లో ఎవరికి అవకాశం ఇస్తారనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు 42 మంది ఉన్నారు. ఇందులో కాంగ్రెస్, వైఎస్సార్‌ సీపీ నుంచి గెలుపొంది, టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న వారు సైతం ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ఇందుకోసం సమాయత్తమవుతున్నారు.

ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల బాధ్యతను, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై పెట్టింది టీఆర్‌ఎస్‌ అధిష్టానం. దీంతో నగరంలో జరుగుతున్న అభివృద్ధితోపాటు సర్వేకు తగ్గ ఫలితాలు వచ్చేలా డివిజన్లవారీగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం డివిజన్లవారీగా ప్రజాదరణ కలిగిన నాయకులు, సమస్యలపై అవగాహన ఉన్న నేతలకు సంబంధించి పార్టీ వివిధ రూపాల్లో అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. నగరంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు, వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పార్టీ ప్రాతినిధ్యం వహించని డివిజన్లలో ఎవరిని రంగంలోకి దించాలనే అంశంపై పార్టీ ఇప్పటికే దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి డివిజన్‌ నుంచి పది మందికి పైగా ఆశావహులు కార్పొరేటర్లుగా రంగంలో ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో, గులాబి బాస్ నిర్వహించిన సర్వే ఫలితాలపై నగరవాసులు పలుపలు విధాలుగా చర్చించుకోవడం మాత్రం, రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది.

Web TitleKCR survey on TRS Khammam coroporation leaders performance creating tension in TRS leaders
Next Story