Top
logo

PV Narasimha Rao's Birth anniversary: పీవీ శతజయంతి వేడుకలు..కేసీఆర్‌ వ్యూహమేంటి?

PV Narasimha Rao
X
Highlights

PV Narasimha Rao's Birth anniversary: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని...

PV Narasimha Rao's Birth anniversary: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ ఎందుకు అనుకుంటోంది? కాంగ్రెస్ పార్టీకి చెందిన పీవీ నరసింహరావు కావచ్చు, కాంగ్రెస్ కురువృద్దుడు వెంకట స్వామి జయంతులు, వర్గంతులు కావచ్చు. ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతల జయంతి ,వర్ధంతులకు కేసీఆర్ ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? కాంగ్రెస్‌ నుంచి సర్దార్‌ పటేల్‌ను మోడీ లాగేసుకున్నట్టు, కేసీఆర్‌ కూడా, పీవీని తన అమ్ములపొదిలో అస్త్రంగా జత చేసుకుంటున్నారా? కేసీఆర్ ఆలోచన వెనక ఏదైనా వ్యూహం వుందా?

ముఖ్యమంత్రి కేసిఆర్ ఏం చేసినా రాష్ట్రంలో వారంరోజుల పాటు చర్చించుకుంటారు ప్రజలు. ఇప్పుడు తాజాగా సీఎం మరో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గర్వపతాక, దేశ మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల పితామహుడు పాములపర్తి వెంకట నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. దేశానికే కొత్త దిశ చూపిన దార్శనికుడికి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కేసీఆర్‌ పీవీ ప్రతిపాదనల వెనక రాజకీయ వ్యూహం కూడా వుందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.

పీవీ నరసింహారావు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి నిత్యం ప్రశంసిస్తూనే వున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ, దేశ ప్రధానిగా సేవలందించారని ఎన్నో సంస్కరణకు ఆద్యుడని అదేవిధంగా భూ సంస్కణలు, ఆర్థిక సంస్కరణలు, విద్యా సంస్కరణలకు బీజం వేసిన దార్శనికుడని చాలాసార్లు అన్నారు కేసీఆర్. పీవిని స్మరించుకోవడం ద్వారా, ఆయన బాటలో నడవాలని చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి.

మాజీ ప్రధాని పీవీ లాంటి మహానుభావులను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, ఇప్పటికీ తెలంగాణ ప్రజలు అంటూ ఉంటుంటారు. అలాంటిది ఇప్పుడు పీవీ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకుంటోంది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ఖ్యాతి చాటిచెప్పేలా హోర్డింగ్స్ ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నారు. కేసీఆర్‌ ఏం చేసినా వ్యూహాత్మకమేనంటారు విశ్లేషకులు. ప్రతి ప్రతిపాదన వెనక అంతుచిక్కని వ్యూహం ఏదో వుందంటారు. ఇప్పుడు పీవీ విషయంలోనూ కేసీఆర్‌కు పక్కా వ్యూహముందనే వారు కూడా ఉన్నారు. మరి గులాబీ దళాధిపతి మదిలో వున్న ఆలోచనలేంటి?

భారతరత్న డిమాండు, ఘనంగా శతజయంతి ఉత్సవాల ద్వారా, తెలంగాణ బిడ్డగా పీవీని ఓన్‌ చేసుకోవాలనుకుంటోంది టీఆర్ఎస్‌ ప్రభుత్వం. మొదటి నుంచీ కేసీఆర్‌ ఇదే మాట అంటున్నారు. పీవీని ప్రశంసించిన సందర్భాలు కూడా చాలా వున్నాయి. అయితే, ఇందులో కొంత రాజకీయ వ్యూహం కూడా వుందన్నది జరుగుతున్న చర్చ. కాంగ్రెస్‌‌ పీవీని ఎప్పుడో వదులుకుంది. ఆయనపై అనేక ముద్రలు వేసి అవమానించింది. రకరకాల కేసులతో వేధించింది. దేశానికే కొత్త పంథాలో పరుగులు పెట్టించిన రాజనీతిజ్ణుడి భౌతికకాయాన్ని కాసేపు కూడా, కాంగ్రెస్‌ కార్యాలయంలో వుంచడానికి ఇష్టపడలేదు సోనియా. చివరికి దేశ దార్శనికుడి అంతిమ సంస్కారాలను అవమానకరరీతిలో నిర్వహించింది. ఇప్పటికీ సోనియా గాంధీ పీవీ పేరెత్తరు. ఒకరకంగా కాంగ్రెస్‌ పీవీని వెలివేసింది. కేసీఆర్‌ మాత్రం పీవీ ఖ్యాతిని అక్కున చేర్చుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడిపోతోంది. కక్కలేక మింగలేక అల్లాడిపోతోంది.

తెలంగాణలో బీజేపీ దూకుడుగా కనిపిస్తున్నా, టీఆర్ఎస్‌కు ఇప్పటికీ గట్టి ప్రత్యర్థి కాంగ్రెస్సే. అధిష్టానం అభీష్టానికి వ్యతిరేకంగా పీవీని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఒక ఐకాన్‌గా ఆరాధించలేరు. పీవీని స్మరించుకుని, సోనియా అహాన్ని వేడెక్కించలేరు. కానీ పీవీని గుండెలకు హత్తుకుని, కాంగ్రెస్‌‌ను ఇరకాటంలో పెట్టాలన్నది కేసీఆర్ వ్యూహంగా కొందరు విశ్లేషిస్తున్నారు. భారతదేశానికి కొత్త దిశను చూపిన పీవీని కాంగ్రెస్‌ అనుమానిస్తూ, అవమానిస్తోందని, అది తెలంగాణ ఆత్మగౌరవానికే దెబ్బ అని గులాబీ పార్టీ దెప్పిపొడవచ్చు. తెలంగాణ బిడ్డ పీవీ పట్ల, కాంగ్రెస్‌ దారుణంగా వ్యవహరించిందని చురకలు వెయ్యొచ్చు. అటు కేసీఆర్ మాటను కౌంటర్‌ చెయ్యడానికి స్థానిక కాంగ్రెస్ నేతలు సాహసించే అవకాశం తక్కువ. కేసీఆర్‌కు కూడా కావాల్సింది అదే. కాంగ్రెస్‌ను కార్నర్ చెయ్యడానికి పీవీ ఆయుధాన్ని ప్రయోగిస్తారు కేసీఆర్. ఇందులో రాజకీయ వ్యూహమున్నా, తెలంగాణ బిడ్డ పీవీ, ఠీవీని కేసీఆర్‌ ఎలుగెత్తినట్టు అవుతుందని ఆయన అభిమానులంటున్నారు.

కాంగ్రెస్ నేతలు పీవీని ఓన్ చేసుకోవాలని ఎన్ని ఆపసోపాలుపడ్డా, సోనియా గాంధీ భయానికి మహానుభావుడి పేరు ఎత్తరు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్, పీవీ శతజయంతి వేడుకలు చేయాలని నిర్ణయం తీసుకున్నపట్టి నుంచీ, తెలంగాణ కాంగ్రెస్ నేతల గొంతులో కరక్కయ పడినట్లు అయింది. పీవీ విషయంలో తెలంగాణలో కేసిఆర్ కు మంచి మైలేజ్ వస్తుంది తప్ప, ఎలాంటి నష్టం లేదని అంటున్నారు.

పీవీకి భారత రత్న డిమాండ్‌ ద్వారా, ఫెడరల్‌ ఫ్రంట్‌ బలోపేతం చేసుకోవాలన్న వ్యూహం కూడా దాగుందన్నది అంచనా. పీవీని అభిమానించే ఎన్నో ప్రాంతీయ పార్టీలను ఆకర్షించవచ్చన్నది ఆలోచన. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ తెలుగు సెంటిమెంటును టిడిపి రగిలిస్తూనే ఉంది. ఇప్పుడు పీవీ పేరును కూడా తెరమీదకు తెచ్చి అలా చేయాలని అనుకుంటోంది టీఆర్ఎస్‌. అందుకే కేసీఆర్‌ ఏం చేసినా, పక్కా వ్యూహం వుంటుందనడానికి ఇదొక నిదర్శనమంటున్నారు. మరి సర్దార్‌ పటేల్‌‌ను కాంగ్రెస్‌ నుంచి మోడీ లాగేసుకుని జనాల అభిమానం పొందినట్టు, కేసీఆర్‌ కూడా పీవీని కాంగ్రెస్‌ నుంచి హైజాక్‌ చేసి, సెంటిమెంట్‌ రగిలిస్తారన్న చర్చ జరుగుతోంది. చూడాలి, ఢిల్లీలో వున్న కాంగ్రెస్‌ పెద్దలకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ స్థానికంగా వుంటున్న కాంగ్రెస్‌ నేతలకు మాత్రం, కేసీఆర్‌ పెడుతున్న పీవీ పరీక్ష, విషమ పరీక్షే.

Web TitleKCR seeks Bharat Ratna to former PM PV Narasimha Rao
Next Story