కేసీఆర్ ప్రకటనపై ఆసక్తి.. ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతున్నారు..? టార్గెట్ ఏంటి..?

KCR National Politics Target and Decision on Change in National Politics | Live News Today
x

కేసీఆర్ ప్రకటనపై ఆసక్తి.. ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతున్నారు..? టార్గెట్ ఏంటి..?

Highlights

KCR: కొంతకాలంగా కేంద్రంతీరుపై విరుచుకు పడుతున్న కేసీఆర్...

KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన ఏంటి? పీపుల్స్ ఫ్రంట్ అంటున్న కేసీఆర్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు?జాతీయ స్థాయిలో ఎం జరుగబోతుంది.? అస్సలు కేసీఆర్ టార్గెట్ ఏంటి? యావత్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీల్లో కొనసాగుతున్న చర్చ ఏంటి...

రాష్ట్రంలో రెండో సారి 2018 లో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి కేంద్రం ఆశించిన స్థాయిలో సహకరించడం లేదు. రాష్ట్ర అవసరాలు, డిమాండ్లు, న్యాయంగా దక్కాల్సిన నిధుల వాటాలు దక్కడం లేదు. గతం నుండి ఉన్న విధానాలకు కేంద్రం మోకాలడ్డుతోంది. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాలరాయడంతో పాటు అనేక అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకొంటోంది అంటూ సీఎం కేసీఆర్ తో తెలంగాణ ప్రభుత్వ మంత్రులు ఆరోపిస్తున్నారు.

పలుమార్లు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై ప్రధాని మోదీనీ, కేంద్ర మంత్రులను కలిశారు సీఎం కేసీఆర్. రాష్ట్ర మంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు. అయినా రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు రాలేదు, దక్కాల్సిన నిధుల వాటాలు దక్కలేదు. అంతే కాకుండా... రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్రంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు.

కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరిని తప్పుపడుతూ సీఎం కేసీఆర్ గత కొద్ది నెలలుగా కేంద్ర తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. మరోవైపు గుణాత్మక మార్పు రావాలి అంటూ ప్రత్యామ్నాయ శక్తి దేశానికి అవసరం అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీఎం కేసీఆర్ పీపుల్స్ ఫ్రంట్ అంటూ దేశవ్యాప్త పర్యటన చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అవసరమైన మేరకు బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగడుతున్నారు.

ఇప్పటికే అనేక రాష్ట్రాలకు వెళ్లిన సీఎం కేసీఆర్ టీమ్ దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూర్ కు వెళ్లి జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, ఆయన తనయుడు - మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామిని కలిసారు కేసీఆర్.మరో మూడు నెలల్లో జాతీయ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంటుందని అన్నారు. రాబోయే మూడు నెలల్లో జాతీయ రాజకీయాల్లో ఏదో ఒక సంచలనానికి మీరు సాక్ష్యమివ్వబోతున్నారు.. దానిని ఎవరూ ఆపలేరు అని కేసీఆర్ స్పష్టం చేశారు. తన ప్రయత్నాలు కేవలం ఉజ్వల్ భారత్ ని సృష్టించడం మాత్రమేనని, దేశ ప్రగతి కోసం ప్రజలు రాజకీయాలు, ఎదగాలన్నారు..

రాబోయే మూడు నెలల్లో జాతీయ రాజకీయాల్లో ఏదో ఒక సంచలనానికి మీరు సాక్ష్యమివ్వబోతున్నారు అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, దేశ వ్యాప్తంగా పలు పార్టీ నేతల్లో ఏలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. పీపుల్స్ ఫ్రంట్ అంటూ కొద్ది నెలలుగా మాట్లాడుతున్న కేసీఆర్ దేశవ్యాప్తంగా కొత్త రాజకీయ పార్టీనీ నెలకొల్పాలనే యోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పలుమార్లు సంప్రదింపులు జరిపిన కేసీఆర్ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారనీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక దేశంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు..దేశంలో ప్రస్తుతం అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ కూడా ప్రాంతీయ పార్టీల తో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ పేరుతో బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ యుపీఏ లతో కూడా జాతీయ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.

మెజారిటీతో సంబంధం లేకుండానే బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ ప్రాంతీయ పార్టీల పొత్తులతో కేంద్రంలో ఆధికారాన్ని చెప్పట్టాయి. అదే ఫార్ములాతో కేసీఆర్ అనుబంధ నాయకులు నేతృత్వంలో జాతీయ స్థాయిలో కొత్త పార్టీకి అంకురార్పణ జరగనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సంబంధాలు లేకుండా వివిధ రాష్ట్రాల్లో తటస్థంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కూడగట్టి కొత్త ఫ్రంట్ తో ముందుకు నడువాలని యోచిస్తున్నారు.

మొత్తంగా దేశవ్యాప్తంగా ఏర్పాటు కాబోయే రాజకీయ పార్టీ, ఫ్రంట్ గురించి వచ్చే మూడు నెలల లోపు సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ నుండి ఎలాంటి ప్రకటన వస్తుందోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories