కేసీఆర్ మార్క్ రాజకీయం.. కవితకు రాజ్యసభ.. ప్రకాశ్‌కు మినిస్ట్రీ?

Kavitha may get Rajya Sabha Seat
x

కేసీఆర్ మార్క్ రాజకీయం.. కవితకు రాజ్యసభ.. ప్రకాశ్‌కు మినిస్ట్రీ?

Highlights

Kavitha: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఎవరు ఊహించని ట్విస్టులు ఇచ్చారు గులాబీ బాస్‌.

Kavitha: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఎవరు ఊహించని ట్విస్టులు ఇచ్చారు గులాబీ బాస్‌. ఎవరి అంచనాలకు అందకుండా అభ్యర్థులను అనూహ్యంగా ఎంపిక చేశారు. ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉన్న బండ ప్రకాశ్‌తో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించి, మండలికి పంపించారు. ఎందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నారా అని అంతా మాట్లాడుకోవడం ఒక ఎత్తయితే, ఆ ప్లేస్‌ను ఎవరితో భర్తీ చేస్తారన్నదే హాట్‌టాపిక్‌గా మారింది.

తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ తన మార్క్ రాజకీయం చూపించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌ను ఎమ్మెల్సీ చేశారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని ఎమ్మెల్సీగా ఓకే చేయడమే కాదు నామినేషన్ కూడా వేయించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎంపికలో తన రాజకీయ చాణక్యమేంటో చూపించిన కేసీఆర్‌ మొత్తం ఆరుగురిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. వారిలో బండ ప్రకాష్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఉన్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో అభ్యర్థుల పేర్లు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. ఎవరిని ఎంపిక చేద్దామన్న దానిపై ఎంతో కసరత్తు చేసిన కేసీఆర్ చివరి క్షణంలో బండా ప్రకాష్, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి తుది ఆరుగురి జాబితాలో చోటు కల్పించారు. ఆరుగురిలో ముగ్గురు రెడ్డి సామాజికవర్గం వారు ఉండగా ఒకరు వెలమ, మరొకరు ముదిరాజు ఇంకొకరు దళిత సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారు. సామాజికవర్గ సమీకరణాల కోసం తీవ్రంగా కసరత్తు చేసిన కేసీఆర్ బండా ప్రకాష్‌కు చాన్సిచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయనతో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇస్తున్నారు. ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ఖతర్నాక్ స్కెచ్ వేసినట్టే కనిపిస్తోంది. తన కూతురు కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపించడంతో పాటు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేయడమే గులాబీ బాస్ లక్ష్యంగా కనిపిస్తోందట. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న కవిత పదవీకాలం త్వరలోనే ముగియనుంది. నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. దీంతో కవితను మళ్లీ మండలికి కాకుండా ఢిల్లీకి పంపించాలని కేసీఆర్ నిర్ణయించారనే చర్చ సాగుతోంది. అందుకే అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్‌తో రాజీనామా చేయించారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బండా ప్రకాశ్‌‌కు మూడేళ్ల పదవీకాలం ఉన్నా ఆయన స్థానంలో కవితను రాజ్యసభకు పంపించేందుకు గులాబీ బాస్‌ కసరత్తు చేస్తున్నారట.

మరోవైపు బండా ఎంపికలో మరో ఆసక్తికర అంశం కూడా ఉందంటున్నారు గులాబీ నేతలు. కేబినెట్ నుంచి జూన్‌లో బర్తరఫ్‌ అయిన ఈటల ప్లేస్‌ను ప్రకాశ్‌తో భర్తీ చేసే ఎత్తుగడలో ఉన్నట్టు సమాచారం. ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించడంతో రాష్ట్రంలో బీసీల్లోనే అధిక జనాభా ఉన్న ముదిరాజులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట. బీసీ సంఘాలు కూడా కేసీఆర్‌పై అసంతృప్తిగా ఉన్నాయంటున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికలో ఆ ప్రభావం ఉందన్న అంచనాకు వచ్చిన కేసీఆర్ బీసీ సంఘాలతో పాటు ముదిరాజులను కూల్ చేసేలా తాజా వ్యూహం వేశారన్న టాక్‌ వినిపిస్తోంది. ఈటల సామాజిక వర్గానికే చెందిన బండా ప్రకాశ్‌ను ఎమ్మెల్సీగా చేసి తర్వాత కేబినెట్‌లోకి తీసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

తన కూతురు కవితను రాజ్యసభకు పంపించడంలోనూ కేసీఆర్‌ మంచి స్కెచ్చే వేశారని చెబుతున్నారు. ఢిల్లీలో పార్టీకి గట్టి ప్రచారం చేసే నేత లేరు. జాతీయ స్థాయిలో మంచి వాయిస్ ఉన్న కవిత అయితే బెటరన్న అంచనాతో ఉన్నారట. బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చే నేతగా ఆమెను ఫోకస్ చేసే వీలుందట. అటు పార్టీకి, ఇటు ఆమెకు వ్యక్తిగతంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. నిజామాబాద్‌ జిల్లాలో తనపై గెలిచిన బీజేపీ ఎంపీ అరవింద్‌తో సహా అందరిని టార్గెట్ చేయోచ్చని అనుకుంటున్నారట. అందుకే కవిత సేవలు జాతీయ స్థాయిలో పార్టీకి ఎంతో ఉపయోగమన్నది అధినేత ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పుడున్న నామా కేకేలాంటి నేతలతో పార్టీకి ఆశించిన మైలేజీ రావడం లేదు. కవిత అయితే, మాంచి ఫాలోయింగ్ ఉంది. హిందీ ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టుంది. అందుకే అమెను ఢిల్లీకి పంపాలని కేసీఆర్‌ స్కెచ్‌ వేశారట.

మరో ఆరు నెలల్లో బండా ప్రకాష్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంటుంది. అప్పటిలోగా ఎలాగూ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా కవిత కొనసాగే చాన్స్‌ వస్తుంది. అప్పుడు రాజకీయంగా ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే, కవిత ప్లేస్‌లో వేరే వారిని అకామిడేట్ చేయవచ్చని కేసీఆర్‌ అంచనా వేస్తున్నారట. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంతో ఉన్న కవితను అప్పటి వరకు ఎమ్మెల్సీగా ఉంటే, రాష్ట్ర్ర మంత్రివర్గంలో తీసుకున్న ఆశ్చర్యమేమీ లేదని అంటున్నారు ఆమె అభిమానులు.

మొత్తంగా, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ఇచ్చిన ట్విస్టులపై తెలంగాణ రాజకీయాల్లో హాట్‌హాట్‌గా చర్చ సాగుతోంది. రానున్న రోజుల్లో మంత్రివర్గ విస్తరణలో కూడా సీఎం కేసీఆర్ ప్రక్షాళన చేసి కొత్త ముఖాలకు తెరపైకి తెస్తారని అంటున్నారు. మరి ఇందులో నిజాలేంటో, ఊహాగానాలు ఏంటో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories