కవిత రెడీ చేస్తున్న రిటర్న్‌ గిఫ్ట్‌ ఏంటి?

కవిత రెడీ చేస్తున్న రిటర్న్‌ గిఫ్ట్‌ ఏంటి?
x
Highlights

ఓటమి తరువాత ఆమె దాదాపుగా సైలెంట్ అయ్యారు. సొంత నియోజకవర్గానికి సైతం రావడం మానేశారు. రాజకీయ కార్యక్రమాలకు, పార్టీ సభ్యత్వ నమోదుకు దూరంగా ఉంటూ వచ్చారు....

ఓటమి తరువాత ఆమె దాదాపుగా సైలెంట్ అయ్యారు. సొంత నియోజకవర్గానికి సైతం రావడం మానేశారు. రాజకీయ కార్యక్రమాలకు, పార్టీ సభ్యత్వ నమోదుకు దూరంగా ఉంటూ వచ్చారు. ఒకరిద్దరు ముఖ్య నాయకులు తప్ప, కలిసేందుకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చేందుకు నిరాకరించారు. మున్సిపల్ ఎన్నికల వేళ, ఆమె మనస్సు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మళ్లీ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్రంలో యాక్టివ్ రోల్ పోషించేందుకు, సిద్దమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆమె మౌనం వీడినట్టేనా రాజకీయాల్లో యాక్టివ్ అయితే ఏ అంశాలతో ముందుకొస్తారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే, తనను ఓడించిన కాషాయ నేతకు, పసుపు రంగు కలిపిన రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చేందుకు ఆమె సిద్దమవుతున్నారన్న చర్చ, రానున్న ఇందూరు సమరానికి సంకేతంగా కనపడుతోంది.

రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నాయకురాలు కల్వకుంట్ల కవిత. సీఎం కూతురుగానే కాకుండా మాజీ ఎంపీగా దేశ స్ధాయిలోను గుర్తింపు పొందిన డైనమిక్ డీలర్ ఆమె. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఊహించని విధంగా, బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆమె సొంత నియోజకవర్గానికి సైతం ఒకే ఒక్కసారి వచ్చారు. అది ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు. ఆ తరవాత ఆమె జిల్లాకు రావడమే మానేశారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదుకు ఏ రకమైన బాధ్యతా తీసుకోలేదు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో, మంత్రి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా సభ్యత్వం తీసుకున్నారు మాజీ ఎంపీ కవిత. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన బోనాల వేడుకల్లో మరోసారి మెరిసారు. ఆ తర్వాత తాజాగా నిజామాబాద్‌లో కనిపించి, అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ఇందూరు యువత కార్యక్రమాలు దేశ యువతకు ఆదర్శ గా నిలుస్తున్నారని, వారు మంచి కార్యక్రమాలు కొనసాగించాలని తాను కోరుకుంటున్నాని నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంపీగా ఓటమిపాలైన కవిత చాలా రోజుల తరువాత నిజామాబాద్ విచ్చేసిన కవిత, నగరంలో స్వచ్చంద సంస్ధ పేరుతో ఏర్పాటు ఇందూర్ యువత వార్షికోత్సవ కార్యకకరమంలో పాల్గొన్నారు. ఈ దేశ మనకేమిస్తుందని అనుకోకుండా, దేశానికి మనమేమిస్తామన్న ఆలోచన మొదటు పెడితే అంతా మంచే జరుగుతదని అన్నారు.

మౌనంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ అస్త్ర సన్యాసం చేశారన్న అంతా చర్చ జరుగుతున్న టైంలో, కవిత ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఏ పసుపు బోర్డు అంశం కవిత ఓటమికి కారణమైందో, అదే అస్త్రంతో మళ్లీ యాక్టివ్ రోల్ పోషించాలని భావిస్తున్నారట కవిత. ఇందుకు ఆమె సొంత నియోజకవర్గం నుంచే కార్యచరణకు సిద్దమవుతున్నారనే ప్రచారం సాగుతోంది.

నిజామాబాద్ పసుపు రైతుల పక్షాన పసుపు బోర్డు సాధన కోసం మాజీ ఎంపీ కవిత పోరాటానికి సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. రైతుల పోరాటానికి కవిత నాయకత్వం వహిస్తే బీజేపీ ఎంపీపై ఒత్తిడి పెరగడం ఖాయం. తనను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తానంటూ, ఎంపీ అర్వింద్ రైతులకు హామి ఇచ్చారు. రెండు నెలలు గడిచినా ఎలాంటి ప్రగతి లేకపోవడంతో రైతులు సైతం అర్వింద్‌పై రుసరుసలాడుతున్నారు. దీంతో పసుపు రైతులను సమీకరించి, ఇచ్చిన హామి నిలబెట్టుకోవాలంటూ అర్వింద్‌పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలకు టీఆర్ఎస్‌ శ్రేణులు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ పోరాటానికి కవిత నాయకత్వం వహిస్తారని నిజామాబాద్ టీఆర్ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఏ పసుపు బోర్డు అంశం టీఆర్ఎస్ ఓటమికి అస్త్రంగా బీజేపీ వాడుకుందో.. ఇప్పుడు అదే అస్త్రంతో.. బీజేపీపై పోరాటం చేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలిసింది. రైతుల ద్వారా బీజేపీకి రిటర్న్ గిప్ట్ ఇవ్వాలని ఆ మాజీ ఎంపీ పట్టుదలతో ఉన్నారట. పసుపు బోర్డు ఇష్యుతో.. కవిత మళ్లీ యాక్టివ్ రోల్ పోషిస్తే గులాబీ శ్రేణుల్లో మళ్లీ పుల్ జోష్ రావడం ఖాయం.

కవిత రీ ఎంట్రీ విషయం తెలుసుకున్న బీజేపీ అలర్ట్ అయ్యిందట. పసుపు రైతులు తమతో ఉన్నారని, ఢిల్లీలో ఆ రైతులతో సమావేశం ఏర్పాటు చేయించారు ధర్మపురి అర్వింద్. టీఆర్ఎస్ నాయకులే రైతుల అవతారం ఎత్తి, నిరసన తెలిపేందుకు సిద్దమవుతున్నారని, వారి పోరాటాన్ని ఎదుర్కొంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. పసుపు బోర్డు అంశం కవితకు.. కీలకంగా మారగా.. ఎంపీగా ఉన్న అర్వింద్ కు టెన్షన్ పెట్టించేలా మారింది. హాట్ టాపిక్‌గా మారిన పసుపు బోర్డు ఉద్యమం ఎటు వైపుకు మళ్లుతుందో వేచిచూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories