Top
logo

కడియం-రాజయ్య కోల్డ్‌వార్‌లో కాళేశ్వరం ట్విస్ట్‌

కడియం-రాజయ్య కోల్డ్‌వార్‌లో కాళేశ్వరం ట్విస్ట్‌
X
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరి నోట విన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు మాటే. అనతికాలంలోనే పురుడు పోసుకున్న...

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరి నోట విన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు మాటే. అనతికాలంలోనే పురుడు పోసుకున్న ప్రాజెక్టును చూడటానికి, జనం జాతరగా కదలి వెళుతున్నారు. ఈ జాతర ప్రయాణమే ఇద్దరు నాయకుల మధ్య కొత్త వైరం సృష్టించింది. ఇప్పటికే ఉప్పు, నిప్పులా ఒకే పార్టీలో ఉంటున్నా, కాళేశ్వరం జలాజాతరతో మరోసారి ఆ ఇద్దరి నాయకుల వర్గాలు కత్తులు నూరుతున్నాయి. ఇంతకీ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన, సమరానికి ఎలా దారి తీసింది? ఎవరా నాయకులు?

ఇద్దరు నేతలు, తెలంగాణ రాష్ట్రంలో కీలక పదవులు అనుభవించిన వారే మరో మాట ఇద్దరు ఒకే పదవిని అధీష్టించినవారే. ఒకరు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి అయితే తన పదవి పోగానే అదే పదవిని అధీష్టించిన నాయకుడు మరొకరు..ఈ ఇద్దరూ కూడా ఒకే పార్టీ..ఒకే నియోజకవర్గం..ఒకే పదవి అనుభవించిన వారు. కానీ ఆ ఇద్దరికీ ఇప్పుడు కీలక పదవులు ఏవీ లేకున్నా వారి మధ్య మాత్రం, కోల్డ్‌వార్‌ మాత్రం సెగలు కక్కుతూనే వుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ కోసం ఇద్దరూ తలపడ్డారు. సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకే సీటు అనడంతో, ఆశించి భంగపడ్డ నేత ఒకరు.. కీలక పదవిపోయిన ప్రజాప్రతినిధిగా అవకాశం దొరికిందని భావిస్తున్న నేత మరొకరు. ఒకరు ఎమ్మెల్యే గా, ఒకరు ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్నా, వారి ఇద్దరి దృష్టి మాత్రం ఒకే నియోజకవర్గంపై ఉండటంతో, అక్కడ అధికార పార్టీలో రెండు వర్గాల పోరు కొనసాగుతోంది. దానికి కాళేశ్వరం ప్రాజెక్టు టూర్ మరోసారి ఆజ్యం పోసింది.

తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవన్న సామెతకు బెస్ట్‌ ఎగ్జాంపుల్ ఈ నాయకులిద్దరూ. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి, ఇద్దరు కీలక నేతలు ఒకే సామాజికవర్గం నుంచి ఎదిగారు. మొదటి ప్రభుత్వంలో ఇద్దరికీ అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఒకరు చేజార్చుకుంటే మరొకరు ఒడిసిపట్టుకున్నారు. ఇలా ఇద్దరూ ఒకే పార్టీ ఒకే పదవి ఒకే నియోజకవర్గంలో ఉంటూ తమ శ్రేణులను కాపాడుకోవడం కోసం రెండు వర్గాలుగా చీలిపోయి, పనిచేస్తున్నారు. ఒకే పార్టీలో ఉంటూ ఇలా ఇద్దరు నేతల పిలుపులకు వెళ్లడం ఇబ్బందిగా ఉందని కార్యకర్తలు వాపోతున్నారు. అందుకు నిదర్శనం, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన.

దేశం గర్వించదగ్గ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టును, స్టేషన్‌ఘన్‌పూర్‌ కార్యకర్తలు చూసొచ్చారు. బస్సుల్లో వెళ్లీ మరీ సందర్శించి తిరిగొచ్చారు. దీంతో కాళేశ్వరం దగ్గర స్టేషన్‌ఘన్‌పూర్‌ టీఆర్ఎస్‌ కార్యకర్తల హడావుడి బాగా కనిపించింది. అయితే, ఈ కార్యకర్తలు తమవారంటే తమవారని, క్లెయిమ్‌ చేసుకుంటూ, ఇదిగో తమ బలం ఇదేనంటూ, ఇద్దరు నేతలు గొప్పలుగా పోతుండటం ఇప్పుడు సెగ్మెంట్‌లో చర్చనీయాంశమైంది. వీరి మాటలు విని, విస్తుపోవడం కార్యకర్తల వంతయ్యింది. సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం చూడాలని వెళ్లిన కార్యకర్తలను చూపించి, వ్యక్తిగత బలం ఇది అని చెప్పుకోవడంతో చూసొచ్చినవారు ముక్కున వేలేసుకుంటున్నారట.

అసెంబ్లీ ఎన్నికల టైంలో, స్టేషన్‌ఘన్‌పూర్‌ టికెట్‌ కోసం కడియం, రాజయ్యలు ఎంతగా పోట్లాడారో రాష్ట్రం మొత్తం చూసింది. తనకు కాకపోయినా, తన కూతురుకైనా ఇవ్వాలని ఆఖరి వరకూ కడియం, అన్ని అస్త్రాలూ ప్రయోగించారు. కానీ సిట్టింగ్‌లకే టికెట్‌ అన్న విధానంతో రాజయ్యకే టికెట్‌ వచ్చింది. విజయమూ దక్కింది. దీంతో అప్పటి నుంచీ ఇద్దరి మధ్య వైరం మరింత ముదురుతోంది. ఇద్దరిదీ ఒకే నియోజకవర్గం కావడంతో, మధ్యలో కార్యకర్తలు సతమతమవుతున్నారు. ఇటు రాజయ్యతో పడలేక, అటు కేసీఆర్‌ కరుణలేక, మరోపార్టీ వైపు కడియం వెళ్తారని ఊహాగానాలొచ్చాయి. అయితే వాటిని కడియం ఖండించారు. అయితే వీరి మధ్య వైరం మరింత రాజుకుంటోందనడానికి తాజాగా కాళేశ్వరం సందర్శన యుద్ధం నిదర్శనం.

తిరుగులేని శక్తిగా ఎదిగిన టిఆర్‌ఎస్‌కు, రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు నేతలు ఉండటం తమ తమ ప్రాబల్యం కాపాడుకోవడం కోసం ఒకే పార్టీ అయినా, రెండు వర్గాలుగా చీలిపోవడం చిక్కులు తెచ్చిపెడుతోంది. ప్రత్యామ్నాయ శక్తి తామే అంటున్న బీజేపీకి, ఇలాంటి గొడవలు ఆయుధం అవుతాయా అని, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.


Next Story