నీళ్లు.. నాకొద్దు.. జనగామలో వింత వృద్ధురాలు

నీళ్లు.. నాకొద్దు.. జనగామలో వింత వృద్ధురాలు
x
Highlights

జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో వింత వృద్ధురాలు గత 10 ఏళ్లుగా నీళ్లు తాగకుండా గడిపేస్తోన్న ప్రమీల ప్రమీల వయసు 70 ఏళ్లు చకా చకా పనులు చేస్తూ ఇంటిని చక్కదిద్దుతున్న వృద్ధురాలు వైద్యుల సూచనలు పట్టించుకోని ప్రమీల

తిండి లేకపోయినా కొందరు ఉండగలరేమో కానీ.. నీళ్లు లేకుండా ఎవరూ ఉండలేరు. మనుషులే కాదు సకల ప్రాణకోటి నీటి మీదనే ఆధారపడి బతుకుతుంది. మానవ శరీరానికి అయితే ఆహారం తీసుకున్నా, తీసుకోకపోయినా, గుక్కెడు నీటితో నోరు తడుపుకుంటే చాలు ప్రాణం లేచొస్తుంది. అలాంటిది ఓ వృద్ధురాలు గత పదేళ్లకు పైగా చుక్క నీరు తాగకుండా గడిపేస్తోందంటే నమ్మశక్యంగా లేదు కదా..? మీరు వింటుంది నిజమే.. కావాలంటే ఈ స్టోరీ చూసేయండి.

ఈమె పేరు ప్రమీల. వయసు 70 ఏళ్లు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన ఈ వృద్ధురాలు దాదాపు గత 10 ఏళ్లుగా నీళ్లు తాగకుండానే గడిపేస్తోంది. ఇంట్లో వాళ్లు బతిమాలినా సరే వద్దంటూ తోసేస్తోంది. పదేళ్ల ముందు మంచిగానే నీళ్లు తాగేదానినని, తరువాత ఎందుకో నచ్చట్లేదని తెలిపింది. నీళ్లు తాగకపోయినా తనలో ఏ మార్పు లేదని ఇప్పటికీ అన్ని పనులు చేసుకుంటూ ఇంటిని చక్కదిద్దుకుంటున్నానని అంటోంది వృద్ధురాలు.

రోజూ కనీసం నాలుగు లీటర్ల నీరు తాగకపోతే మనం బతకలేం. అలాంటిది ఆ వృద్ధురాలు నీరు తీసుకోకుండా బతకడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎవరు చెప్పినా తాను వినట్లేదని, వైద్యులు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని స్థానికులు అంటున్నారు. ఏ కాలమైనా సరే తాను నీళ్లు తాగదని చెబుతున్నారు. టీబీ ఉన్నప్పటికీ మనిషి మాత్రం ఎప్పుడూ హుషారుగానే ఉంటుందని తెలిపారు.

రోజూ తీసుకునే ఆహారంలో నీటి శాతం ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అయితే కొన్నిసార్లు సరిపడా నీరు తీసుకోకపోతే దుష్పలితాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. మొత్తానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి రోజు ఎనిమిది లీటర్ల నీరు తాగాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. కానీ ఈ మహిళ మాత్రం అలా చేసేందుకు ససేమిరా అంటోంది. మరి ఇప్పుడు డాక్టర్ల సూచనలతోనైనా వృద్ధురాల్లో ఏదైనా మార్పు వస్తుందేమో చూద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories