ఎల్లారెడ్డిలో తాజా, మాజీల కోల్డ్‌వార్‌పై గులాబీలో కొత్త గుబులు ఏంటి?

ఎల్లారెడ్డిలో తాజా, మాజీల కోల్డ్‌వార్‌పై గులాబీలో కొత్త గుబులు ఏంటి?
x
Highlights

వాళ్లిద్దరూ రాజకీయ ప్రత్యర్ధులు. ఏళ్లకు ఏళ్లుగా పొలిటికల్‌ ఎనిమీస్. గెలుపు కోసం రెండు దశాబ్దాల పాటు పోరాడిన నేత ఒకరైతే ఓటమి ఎరుగని నాయకుడు ఇంకొకరు...

వాళ్లిద్దరూ రాజకీయ ప్రత్యర్ధులు. ఏళ్లకు ఏళ్లుగా పొలిటికల్‌ ఎనిమీస్. గెలుపు కోసం రెండు దశాబ్దాల పాటు పోరాడిన నేత ఒకరైతే ఓటమి ఎరుగని నాయకుడు ఇంకొకరు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడలు బండ్లు బండ్లు ఓడలయ్యాయి. మూడుసార్లు ఓటమి చెందిన నేతను నాలుగోసారి అదృష్టం వరించగా అపజయం ఎరుగని నాయకున్ని పరాజయం వెక్కిరించింది. యుద్ధకేత్రంలో సంవత్సరాలుగా కత్తులు దూసుకున్న నేతలు, ఒక్క పార్టీలో చేరితే ఒకే వరలో రెండు కత్తులు ఇముడుతాయా ఇమడవు. ఇమడలేదు కూడా. అందుకే ఆ నియోజకవర్గం ఇఫ్పుడు చిన్నసైజు యుద్ధభూమిగా మారింది అదే గులాబీలో గుబులు రేపుతోంది.

ఒకరు తాజా ఎమ్మెల్యే. మరొకరు మాజీ ఎమ్మెల్యే. ఇద్దరి మధ్య ఇప్పుడు కోల్డ్‌ వార్‌. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గంలో ఇద్దరు నాయకుల మధ్య ప్రచ్చన్నయుద్దం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పీక్‌ స్టేజికి చేరుతోంది తాజా ఎమ్మెల్యే జాజుల సురేందర్ - మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిల మధ్య గొడవ.

ఇద్దరి మధ్య వివాదం రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. టీఆర్ఎస్‌లో ఉద్యమకారునిగా ఉన్న సురేందర్, కాంగ్రెస్‌లో చేరి ఎల్లారెడ్డి అసెంబ్లీకి నాలుగుసార్లు పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఉన్న రవీందర్ రెడ్డి చేతిలో మూడు సార్లు ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి సురేందర్. ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సురేందర్, వెంటనే గులాబీ గూటికీ చేరిపోయారు. తన చిరకాల ప్రత్యర్తి కూడా కారెక్కడంతో రగిలిపోతున్నారు మాజీ ఎమ్మెల్యే రవీందర్‌ రెడ్డి.

తాజా ఎమ్మెల్యే కారెక్కడాన్ని మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారనే ప్రచారం జరిగింది. ఐతే అధిష్ఠానం నిర్ణయం ఫైనల్ కావడంతో ఎల్లారెడ్డిలో క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే అసంతృప్తితో రగిలిపోతున్నారు. పుండు మీద కారం చల్లినట్లు ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో రవీందర్ రెడ్డి వర్గాన్ని పక్కన పెట్టారని ఆయన వర్గం తాజా ఎమ్మెల్యేపై గుర్రుగా ఉంది. పార్టీలో ఎమ్మెల్యే సురేందర్ ప్రాభవం తగ్గించాలని నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు రెబల్‌గా పోటీ చేసి, సొంత పార్టీకే నష్టంతెచ్చారు. ఏడు జడ్పీటీసీ స్ధానాలకు 4 కాంగ్రెస్, మూడు చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. నియోజకవర్గ మండల కేంద్రంలోనూ ఎంపీపీ, జడ్పీటీసీ స్ధానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ గెలుపుకు రవీందర్ రెడ్డి వర్గం సహకారం అందించిందనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తోందనేది చర్చ.

తాజా ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యే మధ్య నెలకొన్న వివాదాంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. అగ్నికి ఆజ్యం పోసేలా పార్టీ మారొచ్చిన ఎమ్మెల్యేకు అత్యున్నత పదవిలో ఉన్న సీనియర్ నేతతో పాటు ఎంపీ పూర్తి సహకారం అందిస్తూ మాజీని ఏకాకిగా చేశారనే టాక్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు వర్గం కాబట్టే పక్కకు పెట్టారని మరో వాదన గులాబీ పార్టీలో వినిపిస్తోంది. ఓటమితో మనస్ధాపంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాలకు నూతన పార్టీ కార్యాలయ శంకుస్ధాపనకు ఆ మాజీ హాజరుకాకపోవడం పెద్ద చర్చకు దారితీసింది.

తాజా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య నడుస్తున్న కోల్డ్ వార్‌తో పరిషత్ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోగా తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. దశాబ్దాలుగా ఆ నేతల మధ్య కంటిన్యూ అవుతున్న గ్యాప్‌ను పూడ్చేందుకు పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాలని క్యాడర్ కోరుతోంది. ఇద్దరి మధ్య చీలికలు తెచ్చే విధంగా కొందరి నేతల ప్రవర్తన మరింత నష్టం చేకూరుస్తోందనే భయం వెంటాడుతోంది. నేతల మధ్య కోల్డ్ వార్ మరింత ముదరకుండా అదిష్టానం జోక్యం చేసుకుంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories