Jai Bheem: సూర్యాపేట జిల్లాలో జై భీమ్ రియల్ సీన్.. గిరిజన రైతును..

Jai Bheem Scene Repeat in Suryapet Thanda
x

Jai Bheem: సూర్యాపేట జిల్లాలో జై భీమ్ రియల్ సీన్.. గిరిజన రైతును..

Highlights

Jai Bheem: పేరుకే ఫ్రెండ్లీ పోలిసింగ్ చేతల్లో మాత్రం అధికార మదమే, ఖాకీ కౌర్యమే తప్పు చేసినా చేయకున్నా ఒక్కసారి అరెస్ట్ అయితే..

Jai Bheem: పేరుకే ఫ్రెండ్లీ పోలిసింగ్ చేతల్లో మాత్రం అధికార మదమే, ఖాకీ కౌర్యమే తప్పు చేసినా చేయకున్నా ఒక్కసారి అరెస్ట్ అయితే ఒప్పుకునే వరకూ నరకానికి స్పెల్లింగ్ రాయిస్తారు. సరిగ్గా ఇలాంటి కథే జైభీమ్‌ సినిమాగా వచ్చి యావత్ దేశం దృష్టినీ ఆకర్షింది. అయినా, పోలీసుల్లో మాత్రం మార్పు శూన్యం అనేలా జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. సూర్యాపేటలో జరిగిన రియల్ జై భీమ్ ఘటనపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

గోడకుర్చీ వేయించారు లాఠీలతో కుళ్లపొడిచారు మూత్రం తాగించి అత్యంత క్రూరంగా ప్రవర్తించారు ఇదంతా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు పీఎస్‌ సాక్షిగా ఓ గిరిజన రైతుపై జరిగిన పోలీస్ ఉన్మాద చర్య. పోలీసుల దెబ్బలు తాళలేక బాధితుడు ఆస్పత్రి పాలయ్యాడంతే ఖాకీల దాష్టీకం ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు.

ఆత్మకూరు పీఎస్ పరిథిలో ఇటీవల జరుగుతున్న వరుస చోరీలపై పోలీసులు ఫోకస్ చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ కేసులో ఓ గిరిజన రైతుపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించడమే సంచలనం రేపుతోంది. బెల్ట్ షాపు చోరీ కేసు విచారణలో భాగంగా రామోజీ తండాకు చెందిన రైతు వీరశేఖర్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణ పేరుతో వీరశేఖర్‌ను లాకప్‌లో పెట్టడమే కాదు చిత్రహింసలకు గురిచేశారు. చివరకు మూత్రం తాగించారని బాధితుడు వాపోయాడు.

పోలీసుల ఉన్మాద చర్యతో బాధితు కుటుంబ సభ్యులు. గ్రామస్థులు ఆత్మకూరు పీఎస్‌ను ముట్టడించారు. చేయని నేరానికి హింసించడంపై గళమెత్తారు. వీరశేఖర్‌ను చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమం ఉధృతం కావడంతో ఎస్ఐ లింగంను బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు.

మరోవైపు తెలంగాణ పోలీసుల తీరుపై ప్రజా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. వీరశేఖర్‌ ఘటనను మరియమ్మ లాకప్‌డెత్‌తో పోల్చుతూ పోలీసుల తీరును ఎండగడుతున్నాయి. వీరశేఖర్ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. వీరశేఖర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, 25లక్షలు ఇవ్వాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కోర్టులు మందలించినా ప్రజా సంఘాలు గొంతెత్తి నినదిస్తున్నా పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదన్న విషయం ఇలాంటి ఘటనలతో స్పష్టమవుతోంది. ఇప్పటికైనా పోలీసుల వ్యవహార శైలిలో మార్పు రావాలని ప్రజలు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories