రీల్ హీరో కాదు.. రియల్ హీరో: ప్రచారంలో సోడా బండి మహిళ కష్టానికి చలించి లక్ష రూపాయలిచ్చిన జగ్గారెడ్డి!

రీల్ హీరో కాదు.. రియల్ హీరో: ప్రచారంలో సోడా బండి మహిళ కష్టానికి చలించి లక్ష రూపాయలిచ్చిన జగ్గారెడ్డి!
x
Highlights

Jagga Reddy: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలే కాదు.. అప్పుడప్పుడు ఇలాంటి మానవత్వ పరిమళాలు కూడా కనిపిస్తుంటాయి.

Jagga Reddy: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలే కాదు.. అప్పుడప్పుడు ఇలాంటి మానవత్వ పరిమళాలు కూడా కనిపిస్తుంటాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన ఉదారతతో మరోసారి వార్తల్లో నిలిచారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సదాశివపేటలో పర్యటిస్తున్న ఆయన, రోడ్డు పక్కన సోడా అమ్ముకునే ఓ సామాన్య మహిళ కష్టాన్ని చూసి చలించిపోయి, అక్కడికక్కడే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.

అసలేం జరిగిందంటే?

గురువారం సదాశివపేట పట్టణంలో జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, నిమ్మ సోడా అమ్ముతున్న ఒక మహిళ బండి వద్ద ఆగారు. సోడా తాగుతూ ఆమెతో కాసేపు ముచ్చటించారు. "వ్యాపారం ఎలా సాగుతోంది?" అని జగ్గారెడ్డి ఆరా తీయగా.. ఆ మహిళ తన దీనగాథను వివరించింది. "పాత పద్ధతిలో సోడాలు అమ్మితే ఏమీ మిగలడం లేదు సార్.. కొత్త మెషిన్ కొనుక్కుంటే గిరాకీ పెరుగుతుంది కానీ, అంత స్తోమత మాకు లేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది.

జేబులోంచి తీసి.. చేతిలో పెట్టి!

కొత్త సోడా మెషిన్ ఎంత ధర ఉంటుందని జగ్గారెడ్డి అడగగా, లక్ష రూపాయలు అవుతుందని ఆమె బదులిచ్చింది. ఎండాకాలం వస్తోంది కాబట్టి రోజుకు మూడు వేల వరకు సంపాదన ఉంటుందని వివరించింది. ఆ మాట విన్న జగ్గారెడ్డి, ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తన జేబులోంచి లక్ష రూపాయల నగదును తీసి ఆమెకు అందించారు. "దేవుడు ఆదేశించాడు.. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఈ డబ్బుతో వెంటనే మెషిన్ కొనుక్కో.. ఎండాకాలంలో మంచిగా వ్యాపారం చేసుకుని మీ కుటుంబం బాగుపడాలి" అని ఆమెను దీవించారు.

సంతోషంలో మునిగిపోయిన బాధితురాలు

అడగగానే అప్పటికప్పుడే అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తారని ఊహించని ఆ మహిళ ఆశ్చర్యంతో పాటు ఎంతో సంతోషపడింది. జగ్గారెడ్డికి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజకీయ నాయకులు ఇలా సామాన్యులకు అండగా ఉండాలని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories