తెలంగాణ కాంగ్రెస్‌లో రచ్చ రేపిన జగ్గారెడ్డి.. రేవంత్ రెడ్డికి ముందున్నవన్నీ పరీక్షలేనా.?

Jagga Reddy vs Revanth Reddy in Telangana Congress
x

తెలంగాణ కాంగ్రెస్‌లో రచ్చ రేపిన జగ్గారెడ్డి.. రేవంత్ రెడ్డికి ముందున్నవన్నీ పరీక్షలేనా.?

Highlights

Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత పోరు రచ్చ రేపుతోంది.

Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత పోరు రచ్చ రేపుతోంది. రేవంత్ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పలువురు సీనియర్ల అలకలతో మొదలైన రచ్చ జగ్గారెడ్డి రీజానామా అస్త్రంతో పతాకస్థాయికి చేరింది. అయితే, కాంగ్రెస్ పార్టీని తన ప్రాణంకంటే ఎక్కువగా భావించే జగ్గారెడ్డికి పార్టీని వీడే స్థాయిలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది.? ఎర్రవెల్లి రచ్చబండ మొదలు వీలుచిక్కిన ప్రతిసారీ రేవంత్ నాయకత్వంపై ఎందుకా ఆరోపణలు.? రేవంత్ రెడ్డికి ముందున్నవన్నీ పరీక్షలేనా.? తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది.?

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఏక్షణాన ఎర్రవెల్లి రచ్చబండ నిర్వహించారో ఆ క్షణం నుంచే టీకాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఉధృతం అయింది. ఎర్రవెల్లి సభకు తనకు ఆహ్వానం ఇవ్వలేదన్న ఆరోపణలతో జగ్గారెడ్డి అలకలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రేవంత్ నాయకత్వంపై విమర్శలూ, ఆరోపణలూ చేస్తూనే ఉన్నారు జగ్గారెడ్డి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ తలపెట్టిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. తాజాగా రాజీనామా అస్త్రం ప్రయోగించడం ద్వారా మరోసారి తన అసంతృప్తిని బయటపెట్టారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీకి రాసిన లేఖలో మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లేఖ రాసిన క్షణం నుంచే తాను కాంగ్రెస్‌లో లేనట్లే అన్నారు. సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కాంగ్రెస్‌లో వర్గ పోరు వుండేదని జగ్గారెడ్డి గుర్తుచేశారు. త్వరలోనే పార్టీ పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్న జగ్గారెడ్డి పార్టీ వీడినా గాంధీ కుటుంబం‌పై గౌరవంతో ఉంటానని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో టీఆర్ఎస్‌లో చేరుతారన్న వార్తలపై స్పందించిన జగ్గారెడ్డి తానే పార్టీలో వెళ్లేది లేదన్నారు. అయితే, తనకు పార్టీలో అవమానం జరిగిందని పార్టీ కోసం పనిచేస్తున్న తనపై టీఆర్ఎస్ కోవర్ట్ అన్న ముద్ర వేశారని మండిపడ్డారు. ఇదే విషయం మాణిక్కం ఠాగూర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ పద్ధతి ఏమాత్రం బాలేదని విమర్శించారు.

జగ్గారెడ్డి వివాదంపై రేవంత్‌ సైత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి వివాదం టీకప్పులో తుఫాన్ లాంటిదే అన్నారు. ప్రజల సమస్యల ముందు తమ సమస్యలు చాలా చిన్నవని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో విభేదాలు లేవని, భిన్నాభిప్రాయాలు మాత్రమే వున్నాయని రేవంత్ స్పష్టం చేశారు. జగ్గారెడ్డి కోసం టీఆర్ఎస్ చేసే ఆలోచనలన్నీ అడియాశలవుతున్నాయన్నారు.

ఈ వివాదం ఎలా ఉన్నా తాజా పరిణామాల నేపధ్యంలో జగ్గారెడ్డి కొత్త పార్టీ పెడతారన్న వార్త హాట్‌ టాపిక్ అవుతోంది. జగ్గారెడ్డి సైతం పలుమార్లు కాంగ్రెస్‌లో పలువురు అసంతృప్త నేతలు ఉన్నారని బాహాటంగానే వ్యాఖ్యానించారు. దీంతో జగ్గారెడ్డి కొత్త పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. దీనికి తోడు జగ్గారెడ్డిని బుజ్జగించడానికి వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సైతం తనపైనా కోవర్ట్ పాలిటిక్స్ నడుపుతున్నారని ఆరోపించడం, ఆ వెంటనే పోలీస్ స్టేషన్ గడపతొక్కి ఫిర్యాదు చేయడం లాంటి అంశాలు జగ్గారెడ్డి కొత్త పార్టీపై బలం చేకూరుస్తున్నాయి.

ఒకవేళ జగ్గారెడ్డి కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ నుంచే పలువురు అసంతృప్త నేతలు చేరే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ ఉద్యమకారులను కలుపుకోవాలని జగ్గారెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌పై అసంతృప్తితో ఉన్న నేతలను టార్గెట్ చేస్తున్నారట. ఇంత వరకూ అంతా బాగానే ఉన్నా నిన్న మొన్నటి వరకూ రేవంత్‌తో ప్రత్యక్ష పోరు సాగించిన కోమటిరెడ్డి వివాదానికి రీసెంట్‌గా ఫుల్‌ స్టాప్ పడినట్టు కనిపిస్తున్న నేపధ్యంలో జగ్గారెడ్డి వెనుక ఎవరెవరు వస్తారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్‌లో తాజా పరిణామాలు రేవంత్‌కు మళ్లీ ఇబ్బందులు తెచ్చిపెట్టేలా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘ కాలం తర్వాత కోమటిరెడ్డిని ప్రశన్నం చేసుకున్న రేవంత్‌కు ఇప్పుడు జగ్గారెడ్డి రాజీనామా రూపంలో మరో ఇబ్బంది ఎదురైంది. ఈ వివాదాన్ని పైకి టీకప్పులో తుఫానులా చెబుతున్నా అంతర్గతంగా ఎలా ముగింపునిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories