Top
logo

కేసీఆర్‌-జగన్‌ భేటిలో బీజేపీ మీద జరిగిన చర్చేంటి?

కేసీఆర్‌-జగన్‌ భేటిలో బీజేపీ మీద జరిగిన చర్చేంటి?
Highlights

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రం పెత్తనాన్ని అడ్డుకోవడానికి సిద్దమవుతున్నారా...? ఇద్దరు సీఎంలు,...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రం పెత్తనాన్ని అడ్డుకోవడానికి సిద్దమవుతున్నారా...? ఇద్దరు సీఎంలు, అధికారంలో ఉన్న బీజేపీని అడ్డుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా...? ప్రగతి భవన్ లో అత్యవసర భేటిలో ఇతర కాణాలు చెప్పినా, అంతర్గతంగా ఇవే అంశాలపై చర్చ జరిగినట్లు వస్తున్న ఊహాగానాలు నిజమేనా...? అవుననే అనిపించకమానదు తాజా పరిణామాలను గమనిస్తే.

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి రాజకీయ వేడి రాజకుంటోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొనడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కటవుతున్నారన్న సంకేతాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎలాంటి సందర్భం లేకుండానే అత్యవసరంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కసారి భేటి కావడం వెనుక రాజకీయ భేటి జరిగిందనే చర్చ జోరుగా సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దక్షణాదిన పాగా వేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో వారి వ్యూహనికి చెక్ పెట్టడానికి తెలుగు రాష్ట్ర్రాల సీయంలు వ్యూహం చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల ముందునుంచే టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ వస్తోంది బీజేపీ. పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లు తమ ఖాతాలో వేసుకుంది. అన్నింటికీ మించి కేసీఆర్ కూతురును ఓడించి, అందరి దృష్టిలో పడింది. దీంతో అధికార టీఆర్ఎస్‌పై మరింత దూకుడు పెంచింది బీజేపీ. ఇక్కడ కాంగ్రెస్‌ను మూడోస్థానానికి నెట్టేసి, టీఆర్ఎస్‌కు తానే పోటీ అన్నట్టుగా వ్యూహాలకు పదును పెడుతోంది. కేసీఆర్‌ పాలనపై దీటైన విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.

ఇక ఆంద్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వరకు సైలెంటుగా ఉన్న కమలం పార్టీ ఎన్నికల తరువాత తన రూటును మార్చుకుంటోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని కార్నర్ చేస్తూ ఎదరుదాడిని ప్రారంభించింది. మొన్న కాకినాడలో ఆ పార్టీ వ్యూహకర్త రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాలన, పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యిందని, స్ట్రయిట్ అటాక్ చేశారు. దీంతో రానున్నకాలంలో, ఢిల్లీ పవర్‌ తోడుగా, జగన్‌కు ఇబ్బందులు తప్పవన్న ఆరోపణాస్త్రాలు దూసుకొస్తాయన్న చర్చ జరుగుతోంది. టీడీపీని రీప్లేస్ చేయడమో, లేదంటే టీడీపీతో కలిసి జగన్‌ను ఎదుర్కోవడమో, ఇలా రకరకాల ఆప్షన్స్‌తో జగన్‌ సర్కారుపై దాడికి కమలం పార్టీ సిద్దమవుతోందన్న సంకేతాలు అందుతున్నాయి. దీంతో బీజేపీ పట్ల అప్రమత్తంగానే ఉన్నారు జగన్.

ఇలా రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలను బీజేపీ టార్గెట్ చేసే పరిస్థితి వస్తుండటంతో అప్రమత్తం కావాలని, కేసీఆర్‌, జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఒకే ఎజెండాతో పోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తట్టుకోవడం ఈజీ అవుతుందని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రగతి భవన్‌లో నిన్న దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో ఇదే అంశంపై చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. రెండు రాష్ట్రాల్లో దూకుడుగా వస్తున్న బీజేపీని, ఎలా కట్టడి చేయాలి, అందుకోసం ఎలాంటి స్ట్రాటజీలు వేయాలన్నదానిపై మాట్లాడినట్టు తెలుస్తోంది.

దక్షణాదిన బలం పెంచుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఇప్పటికే కర్ణాటకలో సామదానదండోపాయాలను ప్రయోగించి, రీఎంట్రీ ఇచ్చింది. అటు వెస్ట్‌బెంగాల్‌లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోంది. కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేస్తోంది. ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసే ఆలోచనతో బీజేపీ ఉండటంతో, రెండు పార్టీల అధినేతలు అలర్ట్ అవుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రజల మద్దతు కూడగడుతూనే కేంద్రంలో ఉన్న బీజేపీ టార్గెట్ చేసే అంశాలను తెరపైకి తెచ్చి, కమలం పార్టీ ఆశలపై నీళ్లు చల్లాలని ఇద్దరు ముఖ్యమంత్రులు భావిస్తున్నట్లు చర్చ. ఇవే అంశాలపై ఇద్దరు సీఎంలు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. మరి కాషాయ పార్టీని ఎదుర్కొనేందుకు, ఇద్దరు సీఎంల స్ట్రాటజీ ఎలా ఉండబోతోందో, దానికి బీజేపీ కౌంటర్‌ స్ట్రాటజీ కూడా ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలి.

Next Story

లైవ్ టీవి


Share it