National Politics: కేసీఆర్ బంగారు భారత్ వ్యాఖ్యల మర్మం ఇదేనా?

Is this the Mystery of KCR Gold India Comments?
x

National Politics: కేసీఆర్ బంగారు భారత్ వ్యాఖ్యల మర్మం ఇదేనా?

Highlights

National Politics: మూడో కూటమి ముంగిట కేసీఆర్ వ్యూహాలు రాజకీయాల్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్ అవుతున్నాయి.

National Politics: మూడో కూటమి ముంగిట కేసీఆర్ వ్యూహాలు రాజకీయాల్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్ అవుతున్నాయి. ఇప్పటివరకు బీజేపీ సర్కార్‌పై విమర్శలకు మాత్రమే పరిమితం అయిన గులాబీ అధిపతి కేసీఆర్ ఇక నేరుగా కూటమి కార్యాచరణ అమల్లోకి దిగిపోయారు. తనకు అచ్చొచ్చిన సెంటిమెంట్స్‌తో పాటు తాను అమలు చేస్తున్న పథకాలపైనే ఫోకస్ చేశారు. ఇంతకూ గులాబీ అధిపతి థర్డ్‌ఫ్రంట్ వ్యూహం ఏంటి.? బీజేపీయేతర ముఖ్యమంత్రులను కూటమి కోసం ఎలా సమాయత్తం చేస్తున్నారు.?

టీఆర్ఎస్ అధిపతి కేసీఆర్ మూడో కూటమి కోసం కేంద్రానికి అంతుచిక్కని రీతిలో పావులు కదుపుతున్నారు. బంగారు తెలంగాణ నినాదంతో రాష్ట్ర సాధనతో సహా రెండు సార్లు అధికారం సొంతం చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు అవే సెంటిమెంట్లతో పాటు తన వ్యూహాలను సైతం నేషనల్ పాలిటిక్స్‌లో అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారట. బీజేపీ సర్కార్‌పై ఇప్పటికే సెంటిమెంట్ అస్త్రాలను సంధించిన గులాబీ అధిపతి ఇకపై కూటమికి కట్టుదిట్టమైన కోట గోడలు కట్టే దిశగా అడుగులేస్తున్నారంటున్నారు విశ్లేషకులు.

మూడో కూటమి కోసం దూకుడు పెంచారు సరే మరి కార్యాచరణ ఏంటి.? సరిగ్గా దీనిపైనే కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారు. బంగారు తెలంగాణ నినాదం బంగారు భారత్‌గా కేసీఆర్ నోట రావడం వెనుక అసలు సిసలు వ్యూహం ఇదే అంటున్నారు విశ్లేషకులు. దళిల బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి పథకాలే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళుతున్నాయంటున్న కేసీఆర్ ఈ పథకాలనే జాతీయ రాజకీయాలకు ఆపాదించాలని భావిస్తున్నారట. కూటమి సన్నాహాల్లో భాగంగా బీజేపీయేతర ముఖ్యమంత్రుల భేటీల్లో సైతం ఇలాంటి అంశాలే ప్రధానంగా చర్చకు వస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.

ఇంతకు ముందు నుంచే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. రైతుబంధు పథకం తెలంగాణలో అమలైన తర్వాతే కేంద్రం కాపీ కొట్టి కిసాన్ సమృద్ధి యోజనగా మార్చిందని పదేపదే విమర్శిస్తూ వస్తున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా తెలంగాణలో అమలవుతున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, నిజంగానే కేంద్రం తెలంగాణ పథకాలను కాపీ కొడుతుందా.? అన్నది ఇప్పటికిప్పుడు తేలే అంశం కాదు. అయినప్పటికీ కేసీఆర్ మాస్టర్ ప్లాన్ మాత్రం బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేయడమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇటు టీఆర్ఎస్ మంత్రులు సైతం ఇలాంటి వ్యాఖ్యల ద్వారానే వీలుచిక్కిన ప్రతిసారీ రాష్ట్ర పథకాలను హైలైట్ చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ ప్రతి పథకంపై ఇతర రాష్ర్టాల్లో అమలుకు ప్రజలు కోరుకుంటున్నారనీ గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తెలంగాణ సంక్షేమ పథకాలవైపే ఆశగా చూస్తున్నాయని, ఇన్‌డైరెక్ట్‌గా కేసీఆర్ ప్రధాని కావాలన్న మనసులో మాటను బయటపెడుతూ వస్తున్నారు.

ఇక.. కేసీఆర్ కామన్ మినిమమ్ ఎజెండాకు బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం సానుకూలంగా స్పందిస్తున్నారట. ప్రధానంగా దళితబంధు ఇతర రాష్ట్రాల సీఎంలను ఆకర్షిస్తుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో, తెలంగాణలో సరే.. దేశవ్యాప్తంగా దళితబంధు అమలు సాధ్యమేనా అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. అయితే, దీనికీ గులాబీ పార్టీ అధిపతి కేసీఆర్ దగ్గర మరో మాస్టర్ ప్లాన్ ఉండకపోదంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.

మొత్తంగా ఫెడరల్ కూటమికి తెలంగాణ సంక్షేమ పథకాలే తిరుగులేని కవచాలవుతాయని గులాబీ అధిపతి భావిస్తున్నారట. ఒక్క దళితబంధు పథకమే ఇతర రాష్ట్రాల్లో ఓట్లను కొల్లగొడుతుందని, ఇక మిగిలిన సంక్షేమ పథకాలు ఒక్కొక్కటీ ఒక్కో ఓటు బ్యాంక్‌గా పనిచేస్తుందని టీఆర్ఎస్ శ్రేణులు సైతం చెబుతున్నాయి. ఇదే కేసీఆర్ బంగారు భారత్ వ్యూహం అంటున్నారు విశ్లేషకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories