Top
logo

మావో అగ్రనేతల లొంగుబాట.. నిజమేనా?

మావో అగ్రనేతల లొంగుబాట.. నిజమేనా?
X
Highlights

Maoist Leader Ganapathi: దశాబ్దాల పాటు బాధ్యతలు భుజాలపై వేసుకున్నారు.. ఒక్కో అడుగు వేస్తూ.. మావో...

Maoist Leader Ganapathi: దశాబ్దాల పాటు బాధ్యతలు భుజాలపై వేసుకున్నారు.. ఒక్కో అడుగు వేస్తూ.. మావో సిద్ధాంత పార్టీలను ఏకం చేశారు.. విప్లవమే ఊపిరిగా బతికారు. మరి ఉన్నట్టుండి వారిలో ఊహించని మార్పులేంటి..? జనజీవన స్రవంతిలో చేరాలన్న అనూహ్య నిర్ణయానికి కారణమేంటి..? మోస్ట్ వాంటెడ్ లీడర్స్ సరెండర్ వార్తల్లో వాస్తవమెంత...?

మావోయిస్టు పార్టీని ముందుండి నడిపిన అగ్రనేతలు సరండర్‌కు సిద్ధమయ్యారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. దశాబ్దాలు సేవలందించిన లీడర్లు ఒకేసారి లొంగుబాటు నిర్ణయం తీసుకోవటం మావోయిస్టు పార్టీని ఓ కుదుపు కుదిపేస్తుంది. ఇంతకీ ఈ అనూహ్య నిర్ణయానికి కారణాలేంటి..? అనారోగ్యమా..? విభేదాలా..? మూకుమ్మడి లొంగుబాటు చర్యల వెనుక ఉద్దేశమేంటి..?

మావోయిస్టు పార్టీలో ఓ వెలుగు వెలిగిన అగ్రనేతలు లొంగుబాటు బాట పడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా విప్లవ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి త్వరలో ప్రభుత్వానికి లొంగిపోతున్నారని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే కేంద్ర హోంశాఖ ముందు సరెండర్ అవుతారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయంటూ లీకులు కూడా చక్కర్లు కొడుతున్నాయి. మావో దళపతి గణపతితోపాటు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, కటకం సుదర్శన్ అలి యాస్ ఆనంద్‌, గణపతి భార్య సుజాత, భూపతి భార్య తారాబాయి కూడా లొంగిపోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నెలలుగా చేపట్టిన ఈ ఆపరేషన్ దాదాపు కొలిక్కి వచ్చిందని, ఇక లాంఛనంగా లొంగిపోయినట్లు ప్రకటన వెలువడటమే మిగిలిందంటున్నారు.

గత మూడు నెలలుగా ఈ ఐదుగురు ఇంటెలిజెన్స్ బ్యూరోతో టచ్ లో ఉన్నారని, నాగపూర్ నుంచి మొదలైన లొంగుబాటు చర్చలు, రాయపూర్ దగ్గర ఫైనల్ అయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల అదుపులో ఉన్న వీరంతా ఒకేసారి కేంద్ర హోం మంత్రి ముందు లొంగిపోయేలా ఏర్పాట్లు జరుగుతున్నాయనే కథనాలు పుట్టుకొచ్చాయి. కరోనాతో, అనారోగ్యంతో చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అమిత్ షా ఆరోగ్యం సహకరించకపోతే, కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి ముందు లొంగిపోవచ్చని అంటున్నారు. అయితే కేంద్ర హోంశాఖ ముందు లొంగిపోతే ఇదే తొలి సరెండర్ అవుతుంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ముందు మావోయిస్టులు లొంగిపోయిన దాఖలాలు లేవు.

మావోయిస్టు అగ్రనేతలు పార్టీకి దూరమవ్వాలన్న నిర్ణయం తీసుకోవడానికి అనారోగ్యమే కారణమా..? లేక సైద్ధాంతిక విభేదాలా...? నేతల లొంగుబాటుపై లీకులొస్తున్నా.. మావోయిస్టు పార్టీ ఎందుకు స్పందిచటం లేదు. ఇంతకీ దళపతి గణపతి పార్టీ వ్యవహారాలు చూస్తున్నారా లేక పార్టీని వీడేందుకే సిద్దమయ్యారా..?

సరిగ్గా రెండేళ్ళ క్రితం, 2018 నవంబరులో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో భారీ మార్పులు జరిగాయి. దాదాపు రెండున్నర దశాబ్దాలు పీపుల్స్ వార్, మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న గణపతిని ఆ బాధ్యతల నుంచి అనారోగ్యకారణాలతో తప్పించిన పార్టీ నాయకత్వం శ్రీకాకుళం జిల్లాకు చెందిన వరంగల్ ఆర్‌ఈసీ విద్యార్థి నంబళ్ళ కేశవరావు అలియాస్ బసవరాజ్ కు బాధ్యతలు అప్పజెప్పింది. అయితే కేవలం అనారోగ్యం కారణంగానే గణపతిని తప్పించారా? లేక సిద్ధాంత పరమైన విభేదాలతో తొలగించారా అనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది.

1983, 1984లో పీపుల్స్ వార్ పార్టీలో తొలిసారిగా సైద్ధాంతిక విభేదాలు వచ్చి 'దిద్దుబాటు క్యాంపెయిన్'తో సమసిపోయాయి. అప్పట్లో పార్టీకి కొండపల్లి సీతారామయ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత 1991-94 కాలంలో రెండోసారి విభేదాలు పొడచూపాయి. దాంతో కొండపల్లి సీతారామయ్యను పార్టీ నుంచి బహిష్కరించి గణపతికి కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పింది పార్టీ నాయకత్వం. ఆ తర్వాత కూడా కేంద్ర కమిటీ సమావేశాల్లో, పొలిట్‌బ్యూరో సమావేశాల్లో విభేదాలు వచ్చాయి.

పార్టీలో నిరంతరం ఏదో ఒక అంశంపై ఇలాంటి విభేదాలు రావడం, చర్చల ద్వారా పరిష్కరించడం ఎప్పుడూ జరిగేదే. గణపతి స్థానంలో కేవశరావును నియమించడం వెనక కూడా ఈ విభేదాలే అసలైన కారణమని పలు సందర్భాల్లో స్పష్టమైంది. పార్టీ విస్తరణ, మిలిటెంట్ యాక్షన్‌లతో రిక్రూట్‌మెంట్‌ పెంచడం, పట్టణాల్లో ఫ్రంటల్ ఆర్గనేషన్స్ ద్వారా నిలిచిపోయిన కార్యకలాపాలను పునరుద్ధరించడం, విద్యార్థి సెక్షన్‌లో క్రియాశీలం కావడం ఇలాంటి అనేక అంశాలు కీలక సమావేశాల సందర్భంగా చర్చకు వచ్చేవి. ఈ నేపథ్యంలో గణపతి కంటే దూకుడుగా వ్యవహరించే బసవరాజ్‌కు బాధ్యతలు అప్పజెప్పింది పార్టీ నాయకత్వం.

అయితే మావోలలో ఏ స్థాయి నేత లొంగిపోయినా పార్టీకి ముందే సమాచారం ఉంటుంది. కానీ గణపతి సరెండర్‌పై పార్టీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన లేదు. దీన్ని బట్టి చూస్తే లొంగుబాటు వార్తలు అవాస్తవమేమో అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే కొంతకాలంగా గణపతి సంబంధాలను తెంచుకున్నట్లు పార్టీకి తెలుసని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. లొంగుబాటు గురించి తెలిసిన తర్వాత ప్రకటన రావొచ్చని చెబుతున్నాయి. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన ఎలాగూ వస్తుందని, లొంగుబాటుకు ముందే అలాంటి ప్రకటన ఊహించలేమంటున్నారు.

పార్టీలో సుదీర్ఘ నాయకత్వం చేపట్టి మావోయిస్టు సామ్రాజ్యాన్ని విస్తరించటంలో కీలకపాత్ర పోషించిన గణపతిని లొంగుబాటుకు ఒప్పించిందెవరు..? ఈ సరెండర్‌ ప్రక్రియ ఎలా ప్రారంభమైంది..? టాప్‌ లీడర్స్ లొంగుబాటు వెనుక రాజకీయ కోణం ఉందా..?

దేశ అంతర్గత భద్రతకు సవాలుగా మారిన మావోయిస్టు పార్టీ అగ్రనేతల సరెండర్‌ ప్రక్రియ తెలంగాణ నుంచే ప్రారంభమైనట్లు ప్రచారం సాగుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన సామాజికవర్గ నేతలు, గణపతి బంధువుల ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన నేత ఎవరనేది బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.

దాదాపు ఏడాదిన్నరగా సరెండర్‌ ప్రక్రియ కొనసాగగా నాలుగైదు నెలల క్రితమే ఆశించిన ఫలితాలు రాబోతున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. అనుకున్నట్లుగానే గణపతి ద్వారా ఆయనకు సన్నిహితంగా ఉండే మరో ఇద్దరు కూడా లొంగిపోడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఇంటిలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందింది. ఈ విషయం తెలంగాణ పోలీసులకు తెలియందేమీ కాకపోయినా, ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లొంగుబాటు అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత పరోక్షంగా, ఆయనతోపాటు మల్లోజుల వేణుగోపాల్ కూడా లొంగిపోతే ఆహ్వానిస్తామంటూ లీకులు ఇచ్చారు. తెలంగాణ నుంచే మావోయిస్టుల లొంగుబాటు చర్యలకు అడుగు పడిందని తెలిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న భయం కారణంగానే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం కానీ రాష్ట్ర పోలీసులు కానీ ఈ ఎపిసోడ్ లో చేతికి మట్టంటకుండా వ్యవహరిస్తున్నారనే వార్తలొస్తున్నాయి. నక్సలైట్ల ఎజెండాయే తమ ఎజెండా అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో కామెంట్ చేశారు. ఇదే సమయంలో నక్సలైట్ల కదలికలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పలు సందర్భాల్లో కేంద్ర హోం శాఖకు స్పష్టం చేశారు. కానీ అగ్రనేతల లొంగుబాటు విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో సీరియస్ ఇన్వాల్వ్‌మెంట్‌ వద్దని డిసైడ్ అయిందట. అందుకే గణపతి లొంగుబాటుకు చొరవ తీసుకున్నది తెలంగాణ నేతలే అయినా, అది ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తోంది. క్రెడిట్ దక్కకున్నా పర్వాలేదు కానీ టార్గెట్‌ కాకూడదన్నది తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

ఇంటిలిజెన్స్‌ వర్గాలు నుంచి వస్తున్న వార్తల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనకు మావోటాప్ లీడర్స్ ఓకే అని ఉంటే అందుకు వారు పెట్టిన షరతులేంటి..? ఆ షరతులకు ప్రభుత్వాలు ఓకే చెబుతాయా..? శాంతిని కోరుకునే ప్రభుత్వాలు కాంప్రమైజ్‌ అవ్వక తప్పదా..?

లొంగుబాటు చర్చల సందర్భంగా గణపతి పలు ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిసింది. వివిధ రాష్ట్రాల్లో తనపై దాదాపు 150 కేసులు ఉండటంతో వాటిని బేషరతుగా ఎత్తివేయాలనేది ఆయన తొలి డిమాండ్‌గా తెలుస్తోంది. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న తనకు ప్రశాంత జీవితం గడిపే వాతావరణ ఉండాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండకూడదనేది ఆయన రెండో డిమాండ్. జీవనాధారానికి సంబంధించిన ఆర్థిక సాయం లేదా ఉపాధి అవకాశాలను కల్పించాలన్న డిమాండ్‌ను కూడా ప్రస్తావించినట్లు తెలిసింది.

గణపతి ఆయనతో పాటు లొంగుబాటుకు సిద్ధమైన మరో ఇద్దరిపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రం కోట్ల రూపాయల రివార్డులు ప్రకటించాయి. లొంగుబాటుతో వీటిని తీసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గణపతితో పాటు లొంగిపోయే అవకాశాలున్నాయంటూ ఐబీ వర్గాలు పేర్కొన్న మావోయిస్టు నేతలంతా దాదాపు సమకాలికులు. ఎమర్జెన్సీ సమయంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలోని పీపుల్స్ వార్ పార్టీలోకి ఆకర్షితులయ్యారు. తొలుత గణపతి, ఆ తర్వాత ఆనంద్, మరికొంతకాలానికి వేణుగోపాల్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి వివిధ స్థాయిల్లో, వేర్వేరు బాధ్యతల్లో పార్టీలో కొనసాగిన వీరంతా సత్సంబంధాల్లోనే ఉన్నారు. ముగ్గురూ తెలంగాణకు చెందినవారే. 2018 నవంబరులో నాయకత్వ మార్పు తదనంతర పరిస్థితుల్లో వీరి ముగ్గురి అభిప్రాయాలూ దాదాపు ఒక్కటిగానే ఉన్నాయని, అందువల్లే గణపతి ద్వారా ఆ ఇద్దరినీ కూడా సరెండర్ చేయించడానికి మార్గం సుగమమైనట్లు తెలిసింది.

అయితే అగ్రనేతల సరెండర్ ఆపరేషన్‌ ఎక్కడ నుంచి మొదలైనా అది బీజేపీకి రాజకీయ ప్రయోజనం కలిగిస్తుందనే ప్రచారం జరగుతోంది. వచ్చే బీహార్ ఎన్నికల్లో మావోయిస్టు అగ్రనేతల సరెండర్‌ను ఘన విజయంగా చెప్పుకుని కమలం పార్టీ ముందుకెళ్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండున్నర దశాబ్దాలు పార్టీలో కీలక పాత్ర పోషించిన నేతలు తీసుకున్న లొంగుబాటు నిర్ణయం తీసుకోవటం మావోయిస్టు పార్టీలో విప్లవ ఉద్యమంలోభారీ కుదుపుగానే చెప్పాలి. అంతేకాదు నిఘా వర్గాల సమాచారమే నిజమైతే అగ్రనేతల మూకుమ్మడి లొంగుబాటు దేశంలో ఓ సంచలనం కూడా మారనుంది.

Web TitleIs there true in Naxalites surrender
Next Story