గులాబీ బాస్‌ సడెన్‌ టూర్ల వెనక..అదిరిపోయే వ్యూహం వుందా?

Is There a Strategy Behind the KCR Sudden Tours?
x

గులాబీ బాస్‌ సడెన్‌ టూర్ల వెనక అదిరిపోయే వ్యూహం వుందా?

Highlights

గులాబీ బాస్‌ రూటు మార్చారా? కొత్త స్ట్రాటజీకి స్కెచ్ వేశారా? ప్రత్యర్థుల ఊహకూ అందని వ్యూహానికి పదునుపెట్టారా?

గులాబీ బాస్‌ రూటు మార్చారా? కొత్త స్ట్రాటజీకి స్కెచ్ వేశారా? ప్రత్యర్థుల ఊహకూ అందని వ్యూహానికి పదునుపెట్టారా? సడెన్‌గా జిల్లా టూర్లు, ప్రారంభోత్సవాలు, సహపంక్తి భోజనాలు, ఉద్యమకాలం నాటి పాత స్టైల్‌లో చలోక్తులు, పంచ్‌లు, వ్యంగ్యాస్త్రాలు ఇస్తున్న సిగ్నల్స్ ఏంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, ఉన్నట్టుండి వరుసగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. కరోనా నుంచి తేరుకుండటం, రాష్ట్రం అన్‌లాక్ కావడంతో, కోవిడ్‌కు ముందున్న పర్యటనల సందడి కనిపిస్తోంది. వాసాలమర్రి, ఆ మొన్న వరంగల్, యాదాద్రి, అంతకుముందు సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో కేసిఆర్ పర్యటనలు, ప్రసంగాలపై ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

తెలంగాణ జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలు జరిగాయి. చాలా కలెక్టరేట్ల కన్‌స్ట్రక్షన్స్‌ పూర్తయి కూడా చాల రోజులవుతోంది. ఇన్నాళ్లూలేని ప్రారంభోత్సవాల హడావిడి ఉన్నపలంగా, ఇప్పుడే ఎందుకు షురూ అయ్యిందన్న చర్చ షురూ అయ్యింది. అంతేకాదు కలెక్టరేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసిఆర్ ప్రసంగాలు ఇంటా బయట పెద్ద డిస్కషనే అవుతున్నాయి. అభివృద్ది, రాజకీయ పార్టీల నైజాలు, భావి రాజకీయాలపై కేసిఆర్ మాట్లాడిన తీరు, కొత్త చర్చకు తెరలేపుతోంది. అంతేకాదు వాసాలమర్రిలో ఏకంగా పల్లె జనంతో సహపంక్తి భోజనాలు, మాటా-మంతీ, కుశల ప్రశ్నలు అడుగుతూ రెండేసి గంటల ముచ్చట్లు, అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పల్లె నుంచి పట్నం వరకు అభివృద్దిపై, తనకంటూ ఒక విజన్‌ వుందన్నారు కేసీఆర్. అయితే ఉద్యమ సమయంలో నుడికారాలు, యాస బాషతో జనంతో మమేకమైనట్టుగానే, ఇప్పుడు కూడా అభివృద్దికోణంలో మనం బాగుపడవద్దా అంటూ కౌన్సెలింగ్, కేరింగ్ తరహాలో, జనానికి నచ్చిన, మెచ్చిన యాసలో మాట్లాడి ఆకట్టుకుంటున్నారు కేసీఆర్. పూర్తిగా పాత కేసీఆర్‌గా మారిపోయారు.

అయితే ఉన్నపలంగా కేసిఆర్ ఇలా గంటల తరబడి ప్రసంగాలు దేనికి అన్న చర్చ సాగుతోంది. ఆ ప్రసంగాల్లో సంతోషం, వైరాగ్యం అన్నీ కలగలిపి ఉన్నాయన్న విశ్లేషణా లేకపోలేదు. విపక్షాల విమర్శల నేపథ్యంలోనే రూటు మార్చారా? లేదంటే ముందస్తు వ్యూహం ప్రకారమే బాటలేస్తున్నారా?

హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ రాజీనామా చెయ్యడంతో, త్వరలో ఉప ఎన్నిక అనివార్యం. కరోనా నేపథ్యంలో, ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించే అవకాశాలు లేకపోయినా, కేసులు తగ్గుతున్న కారణంగా ఉప ఎన్నికల నిర్వహించవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. బైపోల్‌ సమయం వరకు సీఎం కేసీఆర్ ఏదో ఒక కార్యక్రమంతో ప్రజాక్షేత్రంలో ఉండాలని భావిస్తున్నారట. వచ్చే నెల మొదటి వారంలో, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమాలు ఉన్నందున, స్వయంగా సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారట. జిల్లాల్లో కలెక్టర్‌ కార్యాలయాల ప్రారంభోత్సవం, ఎస్పీ కార్యాలయాల ప్రారంభోత్సవంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారట సీఎం. అక్కడే రాజకీయలపై జిల్లా నేతలతో సమావేశాలు, పార్టీలో ఇంటర్నల్ గొడవలపై దృష్టి పెడతారట.

ఇదిలావుంటే, దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో, హుజురాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించారట కేసీఆర్. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో, మీటింగ్‌లు పెట్టినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ రెండు ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగడంతో, సీఎం కేసీఆర్ ఆ నెక్స్ట్ జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, నాగార్జున సాగర్ ఎన్నికల్లో తనదైన శైలిలో చాణక్యాన్ని ప్రదర్శించారు. టీఆర్ఎస్ విజయానికి కారణం అయ్యారు.

కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్‌పై పెద్దఎత్తున విమర్శలు కురిపించాయి ప్రతిపక్షాలు. ప్రజల ప్రాణాలు పోతున్నా, ప్రగతి భవన్‌కే సీఎం పరిమితం అయ్యారనే ఆరోపణలు చేశాయి అపోజిషన్ పార్టీలు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు సీఎం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారట. ఇక నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకోవడమే ప్రస్తుత జిల్లా పర్యటనలట. పూర్తిస్థాయిలో, అటు పాలన ఇటు పార్టీ మరింత బలోపేతంపై సీనియర్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారట. ఈటల ఎపిసోడ్‌తో రాజకీయం మరింత వేడెక్కడంతో, ప్రతిప్రక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా చెలరేగిపోవాలని డిసైడయ్యారట.

ఇక మంత్రులు, ఎమ్మెల్యేల పనితిరును సీఎం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారట. పార్టీ నిర్మాణంతో పాటు సమస్యలను పరిష్కరించడంలో చర్యలు, పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని చెప్తూ, మరింతగా ప్రజలకు దగ్గరవ్వాలని సూచిస్తున్నారట. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసి, నియోజకవర్గాల్లో అసంతృప్తవాదులను చల్లబరుస్తానని హామి ఇస్తున్నారట కేసీఆర్.

రాష్ట్రంలో ఈటెల ఎపిసోడ్ తరువాత రాజకీయ సమీకరణలు మరింత వేడెక్కుతున్నాయి. హుజురాబాద్ అంశం తెలంగాణవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై, ప్రత్యేక దృష్టి సారించారట గులాబీ బాస్. రాజేందర్ బర్తరఫ్ తరువాత ఆ సామాజిక వర్గంలో ఎలాంటి అసంతృప్తి, అసమ్మతి ఉందో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. ఎలాగూ హుజురాబాద్ లో ఉప ఎన్నిక తప్పదు కాబట్టి, అనంతరం జరగబోయే రాజకీయాలపై దృష్టి పెట్టి, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండటం వల్ల, ప్రజల నమ్మకాన్ని చూరగొనెలా, ప్రణాళికలు రచిస్తున్నారట సీఎం కేసీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories