దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ చక్రం తిప్పేందుకు అడుగులు పడుతున్నాయా ?

దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ చక్రం తిప్పేందుకు అడుగులు పడుతున్నాయా ?
x
Highlights

టీఆర్ఎస్‌ పార్టీకి అన్ని కలిసస్తున్నాయి. అనుకున్నది అనుకున్నట్లే జరిగిపోతున్నాయి. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ నిర్మాణానికి లైన్‌ క్లియరయ్యింది....

టీఆర్ఎస్‌ పార్టీకి అన్ని కలిసస్తున్నాయి. అనుకున్నది అనుకున్నట్లే జరిగిపోతున్నాయి. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ నిర్మాణానికి లైన్‌ క్లియరయ్యింది. గులాబీ పార్టీకి రాజధానిలో కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. రేపో మాపో నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టనున్నారు. నామకరణంతో పాటు భూమి పూజ చేసేందుకు సీఎం కేసీఆర్ త్వరలో హస్తీనా బాట పట్టనున్నారు. మరీ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల వైపు అడుగులు వేస్తారా.. రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు కేటీఆర్‌కేనా.. వచ్చే ఎన్నికల వరకు పార్టీ భవిష్యత్ ఎలా ఉండనుంది. గులాబీ శ్రేణులు ఏమని భావిస్తున్నారు..?

దేశ రాజకీయల్లో చక్రం తిప్పాలనుకునే సీఎం కేసీఆర్‌కు ఓ వరం వరించింది. అదేంటంటే ఢిల్లీలో టీఆర్ఎస్‌ భవన్ నిర్మించేందుకు కేంద్రం స్థలం కేటాయించింది. అక్కడ తెలంగాణ భవన్‌ నిర్మించేందుకు గులాబీ అధిపతి అప్పుడే కసర్తతులు కూడా మొదలుపెట్టారు. త్వరలో నిర్మాణపనులు కూడా ప్రారంభించనున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల ముందు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటకు కేసీఆర్ ప్రయత్నించారు. 8 రాష్ట్రాల నాయకులతో సమావేశమయ్యారు. కానీ ఏ మాత్రం సాధ్యమవ్వలేదు.

ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రప్రభుత్వాలు చిన్న చూపు చూపిస్తున్నాయన్నది సీఎం కేసీఆర్ వాదన. అయితే ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఫెడరల్‌ ఫ్రెంట్‌గా ఏర్పాటు చేస్తే జాతీయ పార్టీలకు చెక్‌ పట్టవచ్చన్నది కేసీఆర్ ఆలోచన. మరీ వారందరిని ఏకం చేసేందుకు ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ కార్యాలయం తప్పక ఉండాలి. ఇందుకోసం కేంద్రాన్ని అభ్యర్థించగా వసంత్ విహార్ ఏరియాలో 11 వందల చదరపు మీటర్ల స్థలం కేటాయించింది.

రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చారు. కేంద్రం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. వచ్చేవారం సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్లి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు గులాబీ శ్రేణులు చెబుతున్నారు. ఇక ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ పూర్తవ్వగానే సీఎం కేసీఆర్ అక్కడికే మకాం మార్చే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రిగా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను చక్కదిద్దుతున్నారు. ప్రభుత్వంలో సీఎం స్థాయి రివ్యూలు, మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర ఎన్నికల బాధ్యతను కూడా తీసుకున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్, దేశ రాజకీయాల్లో కేసీఆర్ యాక్టివ్‌గా ఉండనున్నట్లు గులాబీ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని ఆరునెలల్లో పూర్తి చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు టీఆర్ఎస్‌ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఫెడరల్‌ ఫ్రెంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ గట్టిగానే ప్రయత్నిస్తారని అర్థమవుతోంది. అయితే కాలం టీఆర్ఎస్ భవిష్యత్‌ను ఎటువైపుకు తీసుకువెళ్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories