కమలంలో కీచులాట షురూ అయ్యిందా?

కమలంలో కీచులాట షురూ అయ్యిందా?
x
Highlights

ఆలూ లేదు చూలూ లేదు..కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా తయారైంది బీజేపీ పరిస్థితి. గ్రేటర్‌ ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో, అప్పుడే ఆ పార్టీలో కొత్త యుద్ధం...

ఆలూ లేదు చూలూ లేదు..కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా తయారైంది బీజేపీ పరిస్థితి. గ్రేటర్‌ ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో, అప్పుడే ఆ పార్టీలో కొత్త యుద్ధం మొదలైందట. ముగ్గురు లీడర్ల నడుమ నయా రచ్చ షురూ అయ్యిందట. ఇంతకీ ఏంటది?

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల మహాఘట్టం ముగియడంతో, అసలు క్రెడిట్‌ రేస్‌ మొదలైంది బీజేపీలో. గ్రేటర్‌పై చాలా అంచనాలనే పెట్టుకుంది కమలం. ఢిల్లీ నుంచి గల్లీకి నేతలను రప్పించింది. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి, మాజీ సీఎం, జాతీయ నాయకులతో ప్రచారం చేయించింది. పనిలో పనిగా ప్రధాని అధికారిక పర్యటనను ప్రచారానికి వాడుకుంది. ఆఖరి వరకూ సకల అస్త్రాలనూ ప్రయోగించింది. ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగరేసి, మొత్తం తెలంగాణలో రాజ్యాధికారానికి బాటలేసుకోవాలని సంకల్పించింది. అందుకే చతురంగ బలగాలతో యుద్ధం చేసింది. అయితే, ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు లెక్కలు మిగిలాయి. దానితోపాటు స్టేట్ బీజేపీలో క్రెడిట్‌ గేమ్‌ కూడా గంట కొట్టింది.

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల హోరులో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అలాగే లక్ష్మణ్‌, క్షణం తీరికలేకుండా చక్రంతిప్పారు. మొదట్లో బండి హడావుడే కనిపించినా, ఆ తర్వాత కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు రంగంలోకి దిగారు. దుబ్బాక విజయంతో బండికి మైలేజ్‌ రావడంతో, ఇక్కడా ఆయనే అన్నీ తానై నడిపిస్తే, సిటీలో తమ ఉనికే ప్రమాదంలో పడుతుందని భావించిన కిషన్, లక్ష్మణ్‌లు, పోటాపోటీగా చెలరేగిపోయారు. ఒకరకంగా బండి చేతి నుంచి గ్రేటర్ స్టీరింగ్‌ తీసుకున్నారు. టికెట్ల కేటాయింపు వ్యవహారాన్ని దాదాపుగా లాగేసుకున్నారన్న మాటలు వినిపించాయి. జిల్లా రాజకీయాల నుంచి వచ్చావ్, సిటీ పాలిటిక్స్ నీకేం తెలుసంటూ, పార్టీ సమావేశంలో బండిని ఇద్దరు నేతలు అన్నారట. అందుకే అన్ని పార్టీల అభ్యర్థులు కన్‌ఫామ్ అయ్యాక, దాదాపు చివరి అంకంలో కమలం క్యాండిడేట్స్‌‌ను ప్రకటించారు. అయితే, మొత్తానికి గ్రేటర్‌లో కమలం అలజడి రేపింది. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా సీన్‌ క్రియేట్ చెయ్యడంలో కొంత సక్సెస్ అయ్యింది. అయితే, బీజేపీలో కీచులాట ఇప్పుడే మొదలైంది.

గత గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు నాలుగంటే నాలుగు. ఇప్పుడు ఎంతలేదన్న ఓట్లు-సీట్లు పెరుగుతాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత కావచ్చు, కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలకు ఓట్లెయ్యలేక, ప్రత్యామ్నాయంగా కమలాన్ని భావించి ఓటేసినవారు కావచ్చు. ఆ రకంగా ఓటింగ్ శాతం, సీట్లూ పెరిగే చాన్సుంది. గ్రేటర్ పీఠాన్ని గెలిచినా, రెండోస్థానమొచ్చినా, ఆఖరికి మూడోస్థానమైనా, బీజేపీ ఆనందానికి పట్టపగ్గాలుండవు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనంటూ స్టేట్‌లెవల్లో ఢంకా బజాయిస్తుంది. ఈస్థాయిలో గ్రేటర్‌‌లో ఊపొచ్చింది తనవల్లేనంటే, కాదు తన వల్లేనంటూ బీజేపీలో క్రెడిట్‌ గేమ్‌ మొదలయ్యిందన్న చర్చ కూడా స్టార్ట్‌ అయ్యిందట. ఇదంతా తన తమ నేత దూకుడు వల్లేనంటూ బండి సంజయ్‌ అనుచరులు ప్రచారం షురూ చేశారట. అయితే, సిటీలో పూర్తిస్థాయి పట్టుంది తనకే, కేంద్రమంత్రిగా వుండి కూడా వీధివీధి తిరిగి ప్రచారం చేశానని కిషన్‌ రెడ్డి సన్నిహితులు కూడా క్రెడిట్‌ కోసం అల్లాడుతున్నారట. అటు లక్ష్మణ్ సైతం, బీసీ ఓట్లు తన వల్లే వచ్చాయంటూ, చిట్టాపద్దులు చెబుతున్నారట. ఇంత క్రెడిట్ వార్‌ ఎందుకంటే, గ్రేటర్‌లో పెర్‌ఫార్మెన్స్‌ను బట్టే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరనేది తేలిపోతుందన్న ఆశలు సదరు నేతలివి. అందుకే గ్రేటర్‌లో తనకే అత్యధిక మార్కులంటూ, నేతలు పోటాపోటీగా ప్రచారం మొదలెట్టారట. చూడాలి, గ్రేటర్‌లో బీజేపీకి మార్కులెన్నో, అధిష్టానం ఎవరికెన్ని మార్కులేస్తుందో.


Show Full Article
Print Article
Next Story
More Stories