కమలం అధిష్టానంపై ఇంద్రసేనుడు అలిగారా?

కమలం అధిష్టానంపై ఇంద్రసేనుడు అలిగారా?
x
Highlights

ఒకప్పుడు బీజేపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడాయన. పార్టీలో అందరి కన్నా సీనియర్. పార్టీ అధ్యక్షుడిగానూ పని చేసిన ఆయన, పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు కృషి...

ఒకప్పుడు బీజేపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడాయన. పార్టీలో అందరి కన్నా సీనియర్. పార్టీ అధ్యక్షుడిగానూ పని చేసిన ఆయన, పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు కృషి చేశారన్న పేరు తెచ్చుకున్నారు. అలాంటి నాయకుడు ప్రస్తుతం పార్టీ ఆఫీస్ కే పరిమితమయ్యారు. పార్టీ కోసం ఎంతో చేసిన ఆయనకు, పార్టీ చేసిందేమీ లేదన్నది ఆయన సన్నిహితుల వాదన. ఇంతకీ ఎవరా లీడర్..? ఏంటా కథ..? ఎందుకంతగా లోలోపల కుమిలిపోతున్నారాయన...?

రాజకీయాల్లో ఎదగాలంటే కత్తి మీద సాము లాంటిదే. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే ప్రత్యర్థులతోనే కాదు మిత్రులతోనూ అప్రమత్తంగా ఉండాలి. పాలిటిక్స్‌లో ఓడలు బండ్లు కావొచ్చు. బండ్లు ఓడలూ కావొచ్చు. నిత్యం ప్రత్యర్థులను ఓ కంట కనిపెడ్తూనే ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. జిమ్మిక్కులూ చేయాలి. అయితే మనం ఇప్పుడు చెప్పుకునే సదరు లీడర్ లో అలాంటి లక్షణాలేవీ లేవు. ముక్కుసూటిగా ఉంటారు. ఏదైనా ముఖంపైనే నిర్మొహమాటంగా చెప్పేస్తారు. అదే ఇప్పుడు ఆయనకు పెద్ద మైనస్ గా మారిందట. పార్టీలో క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే ఆ లీడరే నల్లు ఇంద్ర సేనా రెడ్డి.

విద్యార్థి విభాగంలో పని చేసిన ఇంద్రసేన,1980 నుంచే పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. జాతీయస్థాయిలో పని చేసిన ఆయన, ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ఇంద్రసేన హయాంలో పార్టీ పుంజుకుంది. ప్రస్తుత రాష్ట్ర బీజేపీ కార్యాలయ భవనం ఇంద్రసేనా రెడ్డి అధ్యక్షుడిగా పని చేసినప్పుడు నిర్మించిందే. తెలంగాణలో ప్రత్యక్ష ఎన్నికల్లో బీజేపీ నుంచి మూడుసార్లు గెలిచిన అతికొద్ది మందిలో ఆయన ఒకరు. అలాంటి సీనియర్ కి పార్టీలో దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదన్నది ఆయన సన్నిహితుల వాదన.

రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన చాలామందికి పార్టీ సముచిత స్థానం కల్పించింది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన అనేక మంది సీనియర్లు వివిధ పదవుల్లో ఉన్నారు. విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేసి రాగా, దత్తాత్రేయ హిమాచల్ గవర్నర్‌గా వెళ్ళారు‌. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి బాధ్యతల్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇంద్రసేనా రెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యుడి హోదాలో పని చేస్తున్నారు. పార్టీ కోసం సిన్సియర్ గా పని చేసిన ఇంద్రసేనా రెడ్డికి, పార్టీ సరైన గౌరవం ఇవ్వట్లేదని, ఆయనను ఆఫీస్ కే పరిమితం చేయడం భావ్యం కాదని ఆయన సన్నిహితులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముక్కు సూటితనం, నిక్కచ్చిగా ఉండటమే ఆయన ఎదుగుదలకు ఆటంకం గా మారాయన్నది ఆయన సన్నిహితుల అభిప్రాయం.

మరోవైపు ఇంద్రసేనారెడ్డి సైతం గవర్నర్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. సుమారు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, ఏదొక రాష్ట్రంలో ఆయనను గవర్నర్ గా నియమిస్తే ఆయనకు సముచిత స్థానం కల్పించినట్లు అవుతుందని వారు అభిప్రాయపడ్తున్నారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో అధికారంలో లేని సమయంలో పార్టీ బలోపేతానికి తాను చేసిన కృషిని మోడీ, అమిత్ షాలు గుర్తిస్తారన్న నమ్మకం తనకుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట ఇంద్రసేనా రెడ్డి.

తమిళనాడు బీజేపీ శాఖకు అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళసై కు తెలంగాణ గవర్నర్ గా కేంద్రం బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా వివిధ రాష్ట్రాలకు అధ్యక్షులుగా పనిచేసిన వారికి సైతం బీజేపీ జాతీయ నాయకత్వం గవర్నర్లుగా ప్రమోషన్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తమ నాయకుడికి కూడా అవకాశమొస్తుందన్న ఆశలో ఇంద్రసేనారెడ్డి వర్గీయులు ఉన్నట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories