Khammam: వంగుతున్న నాలుగు స్తంభాలు.. నాలుగుస్తంభాలాటపై హైకమాండ్‌ నజర్‌ లేదా?

Internal Conflict in Khammam TRS
x

Khammam: వంగుతున్న నాలుగు స్తంభాలు.. నాలుగుస్తంభాలాటపై హైకమాండ్‌ నజర్‌ లేదా?

Highlights

Khammam: ఉద్యమ ఖిల్లాలో ఒకప్పుడు ఆ పార్టీ అత్యంత బలహీనమైన పార్టీ. మమ తరహాలో నామమాత్రంగా ఉండేది.

Khammam: ఉద్యమ ఖిల్లాలో ఒకప్పుడు ఆ పార్టీ అత్యంత బలహీనమైన పార్టీ. మమ తరహాలో నామమాత్రంగా ఉండేది. రెండు సాధారణ ఎన్నికల్లోనూ ఆ పార్టీ డీలా పడింది. రాష్ట్రమంతా ఉవ్వెత్తున గులాబీ విరబూసినా ఖమ్మం జిల్లాలో మాత్రం వాడిపోయింది. రెండు ఎన్నికల్లోనూ ఒకే ఒక్క సీటుతో సర్ధుకుపోవాల్సి వచ్చింది. అలాంటి జిల్లాలో క్యాడర్, లీడర్లతో పార్టీ బలీయంగా మారినా నాలుగు స్తంభాలాటతో అల్లాడుతోందట. ఎక్కడో దగ్గర వర్గ విభేదాలు కాక రేపుతూనే ఉన్నాయట. నిండు కుండలా ఉన్నా నివురుగప్పిన నిప్పులా ఉన్న పంచాయతీతో లుకలుకలు మొదలయ్యాయట. ఇంతకీ ఆ జిల్లా కారు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ఆధిపత్యపోరు ఏంటి?

ఖమ్మం జిల్లాలో వలసలతో బలమైన శక్తిగా ఎదిగామని ఖుషీ అయిన గులాబీ పార్టీకి వర్గాల ముళ్లు గుచ్చుకుంటున్నాయట. జిల్లాలో ఉన్న అయిదు నియోజకవర్గాలలో వర్గాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఈ జిల్లా నుంచి రవాణా శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు నాలుగు స్థంబాలుగా ఉన్నారు. కానీ ఒక స్థంబానికి ఇంకో స్థంభం మద్దతు ఉండటం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇది ఎప్పటికైనా ప్రమాదమంటున్నారు రాజకీయ పరిశీలకులు. మేమంతా ఒక్కటే ప్రత్యర్ధులే కావాలని మా మధ్య వర్గ చిచ్చు పెడుతున్నారని అంటున్నా రక్తం చిందకుండా ఒకరిపై మరొకరు కత్తులు దూస్తున్నారట.

ఖమ్మం జిల్లాలో ఆ నలుగురు నేతలు, ఎవరికి వారు తమదైన శైలిలో బలమైన క్యాడర్‌ను కలిగి ఉన్నారు. ఆర్ధికాంశాలు, క్యాడర్ బలం కూడా అదే స్థాయిలో ఆ నలుగురు కలిగి ఉండటం గులాబీ పార్టీకి ఎప్పటికైనా నష్టదాయకమనే టాక్‌ వినిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల ప్రస్తుతం రాజకీయ శూన్యతలో ఉన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలుపుగోలుతో క్యాడర్ మరింత దగ్గరైనా పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఎంపీ నామా నాగేశ్వరరావు టీడీపీలో బలమైన నేతగా ఉన్నా 2019 ఎన్నికలకు ముందు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తన తండ్రి వారసత్వంగా రాజకీయ అరంగ్రేటం చేసి ఖమ్మం నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారు. 2018 ముందస్తు ఎన్నికల్లో జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. అనూహ్య రీతిలో మంత్రివర్గంలో స్థానం పొందారు.

ఈ నాలుగు స్థంభాలాటలో క్యాడర్ నలిగిపోతుందట. నియోజకవర్గ స్థాయి నేతలు కూడా ఆ నలుగురి మధ్య సర్ధుకుపోలేక పోతున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఆ నలుగురి క్యాడర్ ఎవరికి వారు యమునా తీరుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాకు చెందిన కీలక నేత తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనదైన ముద్ర కోసం పరితపించడం ఇప్పుడు హట్‌టాపిక్‌గా మారింది. అందరినీ కలుపుకుపోవాల్సిన ఆ కీలక నేత చిన్న పిల్లాడిలా బెదిరించడం ఏంటని తలలు పండిన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. రాజకీయ చదరంగంలో ఎత్తుగడలు మామూలే అయినా క్యాడర్‌ను వార్నింగ్‌లతో దగ్గర చేసుకోవాలనుకోవడం సుదీర్ఘ రాజకీయంలో సరైంది కాదని పరిశీలకులు అంటున్నారు. ఎవరు ఉన్నా లేకున్నా క్యాడర్‌ను కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే వర్గ విభేదాలతో కాటేయాలని చూడటం పార్టీకి నష్టమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర నాయకత్వం కూడా ఖమ్మం జిల్లాలో నాలుగు స్థంభాలాటపై నజర్ వేయడం లేదట. అభిమానంతో వస్తే అక్కున చేర్చుకోవాలి కానీ బెదిరింపులతో బలమైన నేతగా ఎదగాలనుకోవడం అత్యాశే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గులాబీ పార్టీలో జరుగుతున్న ఈ అంతర్గత పరిణామాలను సీనియర్ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నా టైమ్‌ వచ్చినప్పుడు పావులు కదపే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జోరందుకుంది. మరి, ఈ నాలుగు స్థంభాలతో బలమైన గులాబీ భవనాన్ని నిర్మిస్తారో నిలువునా మునిగిపోతారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories