ఇవాల్టి నుంచి తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం

Independent Indian Diamond Festival | TS News
x

ఇవాల్టి నుంచి తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం

Highlights

*హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

Telangana: స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు తెలంగాణ ముస్తాబైంది. 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ వేడుకలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రారంభించనున్నారు. హెచ్‌ఐసీసీలో నిర్వహించే ప్రారంభ వేడుకల్లో ఉదయం 11.35 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. అనంతరం జాతిపిత గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేసి వందనం సమర్పిస్తారు. తరువాత సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు తిలకిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందేశాన్ని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ఇస్తారు. వజ్రోత్సవాల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ కార్యక్రమాలను అత్యం త ఘనంగా దేశభక్తి ఉట్టిపడేలా నిర్వహించనున్నట్టు సోమేశ్‌కుమార్‌ చెప్పారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రత్యేక పాసులు జారీచేశామని, జిల్లాల నుంచి వచ్చేవారికి వాహన సదుపాయాలు కల్పించామని వివరించారు. తొలుత సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, ఇందులోభాగంగా 75 మంది వైణిక విద్వాంసులతో దేశభక్తి గీతాలాపన ఉంటుందన్నారు. స్వతంత్ర సమర యోధులను తలచుకొనే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ప్యూజన్‌ డ్యాన్స్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించేందుకు భారీ వేదికను ఏర్పాటు చేశారు. హెచ్‌ఐసీసీకి వెళ్లే అన్ని మార్గాలను జాతీయ జెండాలతో అలంకరించారు. నగరంలోని అన్ని జంక్షన్‌లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తోపాటు జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, పంచాయితీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, అదనపు డీజీ జితేందర్‌, ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ అనిల్‌కుమార్‌ ఉన్నారు. వజ్రోత్సవ వేడుకలు సోమవారం నుంచి ప్రారంభం కానుండగా, 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమాలతో ముగుస్తాయి. ఈ ఉత్సవాల నిర్వహణను ఎంపీ కే కేశవరావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ నిర్వహిస్తున్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories