తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పెరిగిన డిమాండ్... రేసులో హేమాహేమీలు

Increased demand for the Telangana BJP president post
x

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పెరిగిన డిమాండ్... రేసులో హేమాహేమీలు

Highlights

బీజేపీ నియమావళి ప్రకారం ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలి. కాబట్టి, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కిషన్ రెడ్డి త్వరలోనే తప్పుకోబోతున్నారు. దాంతో, ఈ పదవి కోసం రేస్ మొదలైంది.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుండి ఇద్దరికి చోటు దక్కింది. కేబినెట్ లో చోటు దక్కని ఎంపీలు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం రేసులో ముందువరుసలో నిలిచారు.


బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి రేసులో వీరే

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి 2022 చివరలో బాధ్యతలు చేపట్టారు. మోదీ క్యాబినెట్‌లో ఆయనకు మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కింది. బీజేపీ నియమావళి ప్రకారం ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలి. కాబట్టి, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కిషన్ రెడ్డి త్వరలోనే తప్పుకోబోతున్నారు. దాంతో, ఈ పదవి కోసం రేస్ మొదలైంది.

మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఎన్నికైన ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జీ మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్సీ సి. రామచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్ రావు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆర్. ఆచారి, బీజేవైఎం మాజీ నాయకుడు కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి రేసులో ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరిన నాయకులతో పాటు మొదటి నుండి పార్టీలో ఉన్న నాయకులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.


దీల్లీలో రామచంద్రరావు లాబీయింగ్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మాజీ ఎమ్మెల్సీ సి. రామచందర్ రావు లాబీయింగ్ కోసం దిల్లీ వెళ్లినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్టును కూడా తాను త్యాగం చేసిన విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. బ్రాహ్మణ కోటాలో తనకు పార్టీ అధ‌్యక్ష పదవిని ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జీగా కొనసాగుతున్న మురళీధర్ రావు కూడ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయన చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీలో తనకున్న పరిచయాల ద్వారా అధ్యక్ష పదవిని దక్కించుకోవాలని మురళీధర్ రావు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కని ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఈటల రాజేందర్ కు ఉన్నాయి. ఇది ఆయనకు కలిసి రానుంది. మరో వైపు గతంలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్న డీకే అరుణ కూడా మరోసారి ఈ పదవి కోసం రంగంలోకి దిగారు. రెడ్డి సామాజిక వర్గానికి పదవిని కట్టబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తే తన పేరును పరిశీలించాలని ఆమె కోరుతున్నారు.


బీజేపీ అధ్యక్ష పదవికి పాత, కొత్త నాయకుల మధ్య పోరు

బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీలో పాత, కొత్త నాయకుల మధ్య పోరు సాగుతుంది. మొదటి నుండి పార్టీలో ఉన్న తమకు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని వారు కోరుతున్నారు. ఇతర పార్టీల నుండి కమలం పార్టీలో చేరిన నాయకులకు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పార్టీ పదవులు తమకు ఇవ్వాలని కోరుతున్నారు. బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆర్. ఆచారి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి,ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్ రావు, చింతా సాంబమూర్తి తదితరులు కూడా అధ్యక్ష పదవిని తమకు ఇవ్వాలని కోరుతున్నారు. బీసీ కోటాలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, ఆర్. ఆచారి, కాసం వెంకటేశ్వర్లు, బ్రహ్మణ కోటాలో ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్ రావు, రెడ్డి కోటాలో ప్రేమేందర్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవిని కోరుతున్నారు.

కిషన్ రెడ్డి కంటే ముందు బండి సంజయ్‌కు బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంలో ఆర్ఎస్ఎస్ కీలకంగా వ్యవహరించింది. అయితే ప్రస్తుతం రేసులో ఉన్నవారిలో ఆర్ఎస్ఎస్ ఎవరి పేరు సూచిస్తుందోననేది ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories