Maoist Blast Landmines : మందుపాతర పేల్చేసిన మావోయిస్టులు

Maoist Blast Landmines : మందుపాతర పేల్చేసిన మావోయిస్టులు
x
Highlights

Maoist Blast Landmines : భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చర్ల మండలంలోని పెదముసిలేరు గ్రామ శివారులో గల పైడి వాగు వద్ద ప్రధాన...

Maoist Blast Landmines : భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చర్ల మండలంలోని పెదముసిలేరు గ్రామ శివారులో గల పైడి వాగు వద్ద ప్రధాన రహదారిని మందుపాతర పెట్టి పేల్చివేశారు. దీంతో రహదారిపూర్తిగా ధ్వంసం అవడంతో వాహనాల రాకకు ఇబ్బందులు ఏర్పడి ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మందుపాతర ధాటికి రహదారిపై సుమారుగా 10 అడుగుల మేర గొయ్యి ఏర్పడింది.

ఆదివారం రాత్రి 9.45 నిమిషాల ప్రాంతంలో ఈ దారుణమైన సంఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. ఇదే తరహాలో సరిగ్గా మూడేండ్ల క్రితం కూడా పైడి వాగు రహదారిపై ఉన్న వంతెనను నక్సల్స్ పేల్చివేశారు. శంకర్ ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు ఆదివారం మన్యంలో బంద్‌కు పిలుపు నిచ్చారు. బంద్ సందర్భంగా మావోయిస్టులు రహదారి పేల్చి తమ ఉనికిని చాటుకున్నారు. ఈ మందుపాతరలను మావోయిస్టులు గత ఏడాది రహదారి నిర్మాణం జరిగే సమయంలోనే పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవళ్లగూడెంలో ఈనెల 3న జరిగిన ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఆదివారం పిలుపునిచ్చిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టుల కదలికల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అలజడి వాతావరణం నెలకొంది. బంద్‌ సందర్భంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు, ఆయా జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని నెలలుగా తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టులు ఏజెన్సీ జిల్లాలకు ఛత్తీస్‌గఢ్‌ నుంచి యాక్షన్‌ టీమ్‌లను పంపించినట్టు తెలుస్తోంది. అలాగే జూలైలో కొత్తగా తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు మరో 12 కమిటీలను మావోయిస్టులు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో ఏజెన్సీ జిల్లాల్లో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. గత రెండు నెలల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కరకగూడెం మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోనూ ఎదురు కాల్పులు జరిగాయి. దేవళ్లగూడెం ఎన్‌కౌంటర్‌లో తమ యాక్షన్‌ కమిటీ సభ్యుడు, ముఖ్యనేత హరిభూషణ్‌ గన్‌మన్‌ దూది దేవాల్‌ అలియాస్‌ శంకర్‌ మృతితో మావోయిస్టులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories