Weather Report: తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావం.. రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Impact Of South West Monsoon In Telangana
x

Weather Report: తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావం.. రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Highlights

Weather Report: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచన

Weather Report: తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలుచోట్ల కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. అయితే రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

నేడు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపు, ఎల్లుండి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈనెల 6న రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. అదే రోజు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ...

కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున సాయంత్రం వేళ పడిన వర్షానికి కాస్త ఉక్కపోత తగ్గింది. నగరవాసులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు. వర్షంతో వేడితో పాటు ఉక్కపోత కూడా తగ్గిందని నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. జూలైలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని.. బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో వాహనాలను నడిపినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

కాగా.. నేడు కూడా నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం సమయంలో చిరు జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు చేరుకోగా.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో ఇక నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. జూలై నెలలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా వేశారు. ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని, 36 డిగ్రీల సెల్సియస్‌లోపే నమోదవుతాయని పేర్కొన్నారు వాతావరణ శాఖ అధికారులు...

Show Full Article
Print Article
Next Story
More Stories