Weather Report: తెలంగాణలో నేడు, రేపు వడగాలులు.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

IMD Issues Orange Alert For Telangana
x

Weather Report: తెలంగాణలో నేడు, రేపు వడగాలులు.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

Highlights

Weather Report: నేడు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం

Weather Report: తెలంగాణలో నేడు,రేపు ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వీలైనంత వరకు పగటిపూట బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని సూచించింది. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా చోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక మంగళవారం 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వివరించింది.

ఎండల తీవ్రత ఎక్కువగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేటతో పాటు పలు జిల్లాల్లో ఉంటుందని ఐఎండీ అధికారులు తెలిపారు. పగటిపూట బయటకు వెళ్లాల్సి వస్తే.. తలకు తప్పనిసరిగా క్లాత్ చుట్టుకోవాలని, గొడుగు తీసుకెళ్లాలని తెలిపారు. దాహం వేయకున్నా తరచూ నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ కు గురికాకుండా జాగ్రత్తపడాలని వైద్యులు సూచించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్ధులు, చిన్నారులు ఇంట్లోనే ఉండడం ఉత్తమమని తెలిపారు. కూల్ డ్రింకుల జోలికి వెళ్లకుండా ఇంట్లోనే మజ్జిగ, లస్సీ, నిమ్మరసం తయారుచేసుకుని తరచూ తాగాలని వైద్యులు తెలుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories