హైద్రాబాద్ జూన్ 2 నుంచి తెలంగాణకు మాత్రమే రాజధాని... మే 18న కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్న 5 కీలకాంశాలివే...

Hyderabad Will Be The Sole Capital Of Telangana from June 2nd
x

హైద్రాబాద్ జూన్ 2 నుంచి తెలంగాణకు మాత్రమే రాజధాని... మే 18న కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్న 5 కీలకాంశాలివే...

Highlights

పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఫోకస్ పెట్టా

పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఈ నెల 18న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఐదు అంశాలపై కీలకంగా చర్చించనున్నారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై రేవంత్ రెడ్డి సర్కార్ కేంద్రీకరించింది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో ఈ హామీలపై నిర్ణయం తీసుకోనున్నారు.

తెలంగాణ కేబినెట్ లో చర్చించే ఐదు అంశాలు

1. హైద్రాబాద్ ఇక తెలంగాణకే రాజధాని: ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు హైద్రాబాద్ ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా 2014లో నిర్ణయించారు.ఈ గడువు 2024 జూన్ రెండో తేదీతో ముగుస్తుంది. దరిమిలా హైద్రాబాద్ ఇక నుండి తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడ కేటాయించిన భవనాలను జూన్ రెండో తేదీ తర్వాత స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు సీఎం.

2. రూ. 2 లక్షల రుణమాఫీ: రూ. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. 2024 ఆగస్టు 15 లోపుగా ఈ హామీని నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు.ఈ దిశగా చర్యలు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించాలని అధికారులను ఆదేశించారు.రుణమాఫీపై ఇతర రాష్ట్రాల్లో అవలంభిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు.ఈ విషయాలపై కేబినెట్ లో తుది నిర్ణయం తీసుకోనుంది.

3.ఉద్యోగుల బదిలీలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కేబినెట్ లో చర్చించనున్నారు. 9, 10 షెడ్యూల్ సంస్థల విభజన వంటి అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మరో వైపు రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పరస్పర బదిలీలు కోరుకుంటే వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

4.రాష్ట్ర విభజన పదేళ్ల వేడుకలు: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 2024 జూన్ రెండో తేదీకి పదేళ్లు పూర్తి కానుంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

5.ధాన్యం కొనుగోలు: ఇటీవల కురిసిన వర్షాలతో వరి ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించనున్నట్టుగా ప్రకటించింది.తడిసిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపుపై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మరో వైపు ఖరీఫ్ సీజన్ ప్రణాళికపై కూడ చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories