హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం

Arun Chilukuri
Published on: 3 March 2021 10:52 AM IST
Hyderabad Software Engineer Stabbed At Home By Her friend
X

హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం

రాను రాను మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతోంది. ముక్కు పచ్చలారని చిన్నారుల నుంచి మంచానికే పరిమితమైన వృద్ధుల వరకు ఏదొక చోట దాడికి గురవుతూనే ఉన్నారు. ప్రేమ పేరుతో కళ్లల్లో కామం నింపుకున్న కొందరు దుర్మార్గులు కసాయిల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఆడపిల్ల బతుకును చిదిమేస్తున్నారు.

ఎక్కడో ఓ చోట అమ్మాయిలపై దాడులు, అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్‌ దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. రంగారెడ్డి జిల్లా హైదర్‌షాకోట్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడికి దిగాడు. కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే దాడిని ప్రతిఘటించే క్రమంలో యువతి తల్లికి కూడా గాయాలుకావడంతో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువతిని గత కొంతకాలంగా సల్మాన్‌ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు‌. అయితే దానికి యువతి నిరాకరిస్తుండడంతో కక్ష పెంచుకున్నాడు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న యువతిని ఫాలో అయ్యాడు. నేరుగా ఇంట్లోకి చొరబడి తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకోవడానికి వచ్చిన బాధితురాలి తల్లిని కూడా గాయపర్చాడు ప్రేమోన్మాది.

నార్సింగ్‌ పీఎస్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దాడికి పాల్పడిన నిందితుడు సల్మాన్‌ను అరెస్ట్ చేశారు. యువతితో పాటు తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని తెలిపారు. కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడని, యువతీ యువకులిద్దరూ పరిచయస్థులే అని వెల్లడించారు పోలీసులు.

మరోవైపు బాధితురాలిని పరామర్శించేందుకు లంగర్‌హౌస్‌లోని రెనోవా హాస్పిటల్‌కు చేరుకున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. అయితే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మొదట పోలీసులు నిరాకరించడంతో బీజేపీ నేతలు మండిపడ్డారు. దీంతో కొద్దిసేపటి తర్వాత బాధితురాలిని పరామర్శించేందుకు అనుమతినిచ్చారు పోలీసులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story